ఈటల కోసం తెలంగాణకు వస్తానంటున్న బీజేపీ అగ్రనేత

By Ritwika Ram Jul. 15, 2021, 08:30 pm IST
ఈటల కోసం తెలంగాణకు వస్తానంటున్న బీజేపీ అగ్రనేత

తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రాజీనామాలు చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నెల రోజుల కిందట బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈటల నిలబడుతున్న నేపథ్యంలో.. ప్రచారంలో పాల్గొంటానని అమిత్‌షా హామీ ఇచ్చారు. హుజురాబాద్ కు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఒకసారి ప్రచారానికి రావాలని అమిత్ షాను కోరానని.. రాష్ట్రానికి ఎన్నిసార్లు అయినా సరే వస్తానని ఆయన చెప్పినట్లు ఈటల వివరించారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని అమిత్‌షా సూచించారని తెలిపారు. తనకు సంపూర్ణ మద్దతు అందించే బాధ్యత మాది అని అమిత్ షా చెప్పినట్లు ఈటల తెలిపారు.

తొలిసారి ఉప ఎన్నిక ప్రచారానికి..

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్‌‌కు బైపోల్ జరిగింది. దుబ్బాక మినహా మిగతా రెండు చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. ఈ మూడు ఎన్నికలకు అమిత్ షా రాలేదు. అయితే గతేడాది జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి మాత్రం వచ్చారు. కానీ ర్యాలీ మధ్యలోనే వెళ్లిపోయారాయన. తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా షా రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈటల రాజేందర్ పోటీలో ఉన్న హుజూరాబాద్‌ లో ప్రచారానికి వస్తానని ఆయన చెప్పారు. దీంతో ఈటల సహా తెలంగాణ బీజేపీ నేతలంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. టీఆర్ఎస్‌ కు అభ్యర్థే దొరకడం లేదని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈటల నెల రోజుల తర్వాత..

జున్ 14 ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరారు. కేసీఆర్​తో, టీఆర్ఎస్​తో 20 ఏళ్ల బంధాన్ని తెంచుకుని బయటికి వచ్చారు. అధికార పార్టీ నుంచి బయటికి వచ్చి.. మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ కాషాయ కండువాను కప్పుకునేందుకు రెడీ అయ్యారు. కానీ ఢిల్లీకి వెళ్లిన ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించేందుకు.. పెద్ద నేతలు ఎవరూ రాలేదు. బీజేపీ త్రిమూర్తులైన నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా కనిపించలేదు. ఓ ప్రధాన నేత తమ పార్టీలోకి చేరుతున్నారంటే.. అమిత్ షా లేదా జేపీ నడ్డా వస్తుంటారు. కానీ వీళ్లెవరూ ఈటల మెడలో కాషాయ కండువా వేసి బీజేపీలోకి ఆహ్వానించలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మరో కేంద్ర మంత్రి, తెలంగాణకు చెందిన కిషన్​రెడ్డి, రాష్ట్రానికి చెందిన ఇతర నేతలు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత నెల రోజులకు అమిత్ షాను ఈటల కలిశారు. అది కూడా ఒంటరిగా కాదు. కీలక నేతలతోపాటు వెళ్లి కేవలం 15 నిమిషాలు అక్కడ ఉన్నారు. ఈటల బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలవాలని అనుకున్నామని.. అప్పుడు కుదరలేదని, అందుకే ఇప్పుడు సమయం తీసుకుని కలిశామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మీడియాకు సర్దిచెప్పుకున్నారు.

Also Read : వివేక్ వెంకటస్వామి పార్టీ మారడం లేదట..! అదంతా ఫేక్ ప్రచారమట..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp