ఎంపీ జయదేవ్‌కు షాకిచ్చిన ఏపీ సర్కార్.. చంద్రబాబు సీరియస్‌..

By Kotireddy Palukuri Jun. 30, 2020, 10:14 pm IST
ఎంపీ జయదేవ్‌కు షాకిచ్చిన ఏపీ సర్కార్.. చంద్రబాబు సీరియస్‌..

టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. గతంలో అమర రాజా కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన 253 ఎకరాల భూమిని తిరిగి వెనక్కి తీసుకుంటూ జగన్‌ సర్కార్‌ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం, నునిగుండ్ల పల్లి, కొత్తపల్లిలోని సర్వే నంబర్‌ 65/1లో అమర రాజా కంపెనీ విస్తరణకు అప్పట్లో ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే భూములు తీసుకున్నా నిబంధనల ప్రకారం కంపెనీ విస్తరించకపోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. నిబంధనల ప్రకారం పదేళ్లలోపు ప్రభుత్వం నుంచి ఏ కారణంతో భూములు తీసుకుంటారో ఆ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ అమర రాజా కంపెనీ భూములు తీసుకుని పదేళ్లు దాటినా ప్లాంటు విస్తరణ చేపట్టకపోవడంతో తాజాగా ఏపీ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. అమర రాజా కంపెనీకి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని విమర్శించారు. ఎంపీ జయదేవ్‌పై అక్కసుతోనే అమర రాజా భూములు వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పన్ను చెల్లించే వ్యక్తి గల్లా అని అన్నారు. పారిశ్రామికంగా ఏపీని ప్రపంచ పటంలో పెట్టాలనే లక్ష్యంతో విదేశాల నుంచి వచ్చి అమర రాజా యూనిట్లు స్థాపించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే పెట్టుబడుదారులు రాష్ట్రానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఇకపైనైనా కక్ష సాధింపు చర్యలు సీఎం జగన్‌ స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp