పొలిటికల్ స్టాల్‌వార్ట్‌ అమర్ సింగ్

By Krishna Babu Aug. 02, 2020, 12:20 pm IST
పొలిటికల్ స్టాల్‌వార్ట్‌ అమర్ సింగ్

దేశ రాజకీయల్లో కార్పొరేట్ ఠాకూర్ గా పేరొందిన విలక్షణ రాజకీయ నాయకుడిగా, అన్ని రంగాల్లో ఉన్న ధనవంతులకి ఆప్త మిత్రుడిగా, దశాబ్ధము పాటు డిల్లీ రాజకీయాలను శాసించిన నేతగా, ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ స్టాల్‌వార్ట్‌గా పేరున్న అమర్ సింగ్ తన 35ఏళ్ళ రాజకీయ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు చవిచూశారు. యుపీ రాజకీయల్లో సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ ఆత్మ గా మారిన ఆయన దేశ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలకు పరోక్షంగా ప్రత్యక్షంగా కారణం అయ్యారు.

1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో హరీష్ చంద్రసింగ్, శైల్ కుమారీ సింగ్ దంపతులకు జన్మించిన అమర్‌సింగ్‌ , తన విద్యాభ్యాసం అంతా కలకత్తాలోనే పూర్తి చేసి, కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ & ఎల్.ఎల్.బి పట్టా పొందారు. విద్యాభ్యాసం అనంతరం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన అమర్ సింగ్ కొంత కాలానికి మాధవరావు సిందియాకి అత్యంత సన్నిహితంగా మారి సుమారు 10ఏళ్ళు కలిసి రాజకీయ ప్రయాణం చేశారు. ఏఐసీసీ మెంబర్ గా కూడా భాద్యతలు నిర్వహించిన అమర్ సింగ్ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే సీటు ఆశించినా చివరివరకు దక్కలేదు. 1985 నుండి 1989 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వీర్ బహుద్దూర్ సింగ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన 1996 వరకు కాంగ్రెస్ లో కొనసాగారు.

వీర్ బహుద్దూర్ సింగ్ సమయం నుండి సమాజ్ వాది పార్టి నేత ములాయం సింగ్ యాదవ్ తో అమర్ సింగ్ కు పరిచయాలు ఉన్నా, ఒకనాడు విమాన ప్రయాణం లో ములాయం సింగ్ యాదవ్ తో కలిసి చేసిన ప్రయాణం వలన పెరిగిన సాన్నిహిత్యం ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిందని చెబుతారు. 1996లో దేవగౌడ కాంగ్రెస్ మద్దతుతో ప్రధాని అయిన తరువాత ఇంగ్లీషు రాని ములాయం సింగ్ కు హిందీ రాని దేవ గౌడకు మద్య అనుసందాన కర్తగా వ్యవహరించడంతో ములాయం సింగ్ తో మరింతగా ఏర్పడిన సాన్నిహిత్యంతో, ఆయనను కొంత కాలానికి సమాజ్ వాదీ పార్టీకి దగ్గర చేసి ఆ పార్టి కండువా కప్పుకునేలా చేసింది.

అమర్ సింగ్ రాకతో అప్పటివరకు సోషలిజం పునాదులమీద ఉన్న సమాజ్ వాది పార్టీకి సినీ గ్లామర్ తో పాటు అంబానీల వంటి వ్యాపారవేత్తల పరిచయం కూడా ఏర్పడింది. సమాజ్ వాది పార్టీ తరుపున జయబచ్చన్ , సమాజ్ వాది పార్టీ మద్దతుతో అనిల్ అంబానీ లాంటి వారిని రాజ్యసభకు పంపేలా చేసింది అమర్ సింగ్ నే . 1996 నవంబరులో తొలిసారి సమాజ్ వాదీపార్టీ తరుపున రాజ్యసభకు ఎంపికైన అమర్ సింగ్ తరువాత కాలంలో ఆ పార్టీకి జనరల్ సెక్రటరి అయ్యారు. అదే ఏడు తెలుగుదేశం పార్టీ తరుపున రాజ్యసభకు ఎన్నికైన జయప్రదతో అమర్ సింగ్ కు స్నేహం ఏర్పడటంతో అమెకు చంద్రబాబుతో వచ్చిన విభేదాలు కారణంగా తరువాతికాలంలో తెలుగుదేశానికి రాజీనామా చేసి సమాజ్ వాదిపార్టీలో చేరి అమర్ సింగ్ అండతో 2004, 2009లో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు.

1996, 2002, 2008 న మూడు సార్లు సమాజ్ వాది పార్టీనుండి రాజ్యసభకు ఎన్నికైన అమర్ సింగ్ అనేక సంధర్భాల్లో తీవ్ర వివాదాస్పదం అయ్యారు. 2008జులై లో యుపిఏ 1 ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వామపక్షాలు ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో పార్లమెంటులో విశ్వాసపరీక్షను ఎదుర్కోవాలసి వచ్చింది. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సమాజ్ వాది పార్టి నేత అమర్ సింగ్ ప్రతిపక్ష సభ్యులకి ఓటుకు నోటు ఏరచూపి పార్లమెంట్ సాక్షిగా సాక్షాలతో సహా దొరిపోయారు. ఆనాడు ఈ వ్యవహారం దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ వ్యవహారంలో అరెస్ట్ అయి కొంత కాలం ఆయన తీహార్ జైలులో గడిపారు. అలాగే 2011 లో బాలీవుడ్ సినితారతో జరిపిన సంభాషణ వ్యవహారంకూడా తీవ్ర దుమారం రేగడంతో అమర్ సింగ్ సుప్రీం కోర్టు ను ఆశ్రయించగా ఆ టేప్ మార్ఫ్ అని తేలింది.

అయితే ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ భార్య డింపుల్ ఫిరోజాబాద్ స్థానంలో ఓటమికి అమర్ సింగే కారణం అని ఆరోపించడంతో మొదలైన విభేదాలు చివరికి అమర్ సింగ్ తన పదవులకు రాజీనామా చేసే వరకు వచ్చంది, ఈ పరిణమంతో పార్టి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నెపంతో 2010లో అమర్ సింగ్, జయప్రదను ములాయంసింగ్ యాదవ్ పార్టి నుండి బహిష్కరించారు. దీంతో 2011లో ఆయన రాష్ట్రియ లోక్ మంచ్ పేరున సొంత పార్టీ స్థాపించి 2012లో 403 స్థానాలకుగాను 360 సీట్లలో పోటీ చేసినా ఒక్కస్థానం కూడా గెలవలేకపోయారు. 2013లో కిడ్నీ ఫెయిల్యూర్ అవడంతో దుబాయిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత 2014 ఎన్నికల ముందు రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో చేరి ఫతేపూర్ సిక్రీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఓటమి చవిచూసారు.

ఓటమి అనంతరం ఆయన 2014లో రాజ్యసభ పదవి ముగిసిపోతున్న సమయంలో భారతీయ జనతా పార్టి నుండి ఆ స్థానాన్ని ఆసించినా ఫలితం దక్కలేదు. దీంతో అమర్ సింగ్ పాత మిత్రుడు అయిన సమాజ్ వాది పార్టి నేత అఖిలేష్ యాదవ్ అభిష్టానికి వ్యతిరేకించి ములాయం సింగ్ మద్దతుతో 2016లో చివరి సారిగా పెద్దల సభకు నామినేట్‌ అయ్యారు. దాంతో పాటు 2016 అక్టోబర్ లో సమాజ్ వాది పార్టికి జనరల్ సెక్రటరీగా తిరిగి ఎన్నికయ్యారు. అయితే ములయాం సింగ్ యాదవ్ కి, కోడుకు అఖిలేష్ యాదవ్ కి మధ్య విభేధాలు తీవ్రం అయి పార్టీ పగ్గాలు అఖిలేష్ హస్తగతం చేసుకున్నాక తిరిగి 2017 జనవరి 1న అమర్ సింగ్ ను పార్టి నుండి బహిష్కరించారు. తన కుటుంబంలో విభేదాలు రావడానికి అమర్ సింగ్ కారణం అని అఖిలేష్ బలంగా నమ్మడం ఈ పరిణామానికి ఒక కారణం. ఈ పరిణామం తరువాత ఆయన తన పూర్తి మద్దతు నరేంద్రమోడికి ప్రకటించారు.

ఇటీవల కిడ్నీ సంబందిత వ్యాది సమస్యలు మరీ ఎక్కువ అవడంతో సింగపూర్ వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి కొంత విషమించడంతో సింగపూర్ లోని మౌంట్ ఎలిజిబిత్ ఆసుపత్రిలో చేరి చికిత్స పోందినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆయన ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో, సినీతారలతో , వ్యాపారవేత్తలతో ఏకకాలంలో సత్సంబందాలు ఏర్పరుచుకొన్న వ్యక్తి అమర్ సింగ్. సామాన్య వ్యక్తిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి విలక్షణ నేతగా ఎదిగి దశాబ్దం పాటు డిల్లీ రాజకీయాలను శాశించి తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా అమర్ సింగ్ గుర్తుండిపోతారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp