భారత విమానయానంలో మరో కొత్త కంపెనీ

By Karthik P Oct. 12, 2021, 07:30 pm IST
భారత విమానయానంలో మరో కొత్త కంపెనీ

భారతదేశ విమానయానంలో మరో కొత్త కంపెనీ వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఎయిర్‌ ఇండియా, ఇండిగో, స్పేస్‌జెట్‌.. వీటి పేర్ల సరసన మరో పేరు చేరబోతోంది. ఇండియా వారెన్‌ బఫెట్‌గా, ఇన్వెస్ట్‌మెంట్‌ గురుగా పేరొందిన రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ఆకాశ ఎయిర్‌ పేరుతో కొత్త విమానయాన సంస్థను తీసుకువస్తున్నారు. ఈ కంపెనీ కార్యకలాపాలు సాగించేందుకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఎన్‌వోసీ జారీ చేసింది. వచ్చే ఏడాది వేసవి నుంచి ఆకాశ ఎయిర్‌ విమానాలు ఎగరబోతున్నాయి.

షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులకే ప్రాధాన్యమిచ్చే రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా విమానయాన రంగంలోకి వస్తుండడంతో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. విమానయాన రంగంలో నెలకొన్న పోటీ, ఖర్చులు పెరగడం వంటి పరిణామాలతో దేశంలోని పలు ప్రైవేటు కంపెనీలు దివాళాతీశాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎయిర్‌ ఇండియా కూడా అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో.. దాన్ని ఇటీవల అమ్మేశారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న పౌర విమానయాన రంగంలో రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు పెడుతుండడంతో ఆకాశ ఎయిర్‌పై అంచనాలు పెరిగిపోయాయి.

Also Read : టాటా చేతికి ఎయిర్ ఇండియా..?

ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నడిచే ఆకాశ ఎయిర్‌లో రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా 40 శాతం వాటా ఉన్నట్లు సమాచారం. ఆ మొత్తం విలువ దాదాపు 35 మిలియన్‌ డాలర్లని తెలుస్తోంది. ఈ నెల 5, 6 తేదీల్లో రాకేష్‌.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని నెలలుగా ఎన్‌వోసీ కోసం ఆకాశ ఎయిర్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాకేష్‌.. మోదీని కలిసిన వారం రోజులకే ఆకాశ ఎయిర్‌కు ఎన్‌వోసీ రావడం విశేషం.

తక్కువ ఖర్చుతో విమానయాన సేవలు అందించే ఇండిగో, స్పేస్‌జెట్‌ మాదిరిగానే ఆకాశ ఎయిర్‌ తన కార్యకలాపాలను నిర్వహించబోతోందని ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్కొంది. నాలుగేళ్లలో 70 విమానాలను ఈ సంస్థ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పని చేసిన వినయ్‌ దూబేనే ఆకాశ ఎయిర్‌ సీఈవోగా ఉన్నారు. ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ దిగ్గజం ఇండిగో మాజీ ప్రెసిడెంట్‌ ఆధిత్య ఘోష్‌ కూడా ఆకాశ ఎయిర్‌ బోర్డులో సభ్యుడుగా ఉండడంతో ఈ సంస్థ సేవలపై ఆసక్తి నెలకొంది.

Also Read :  ఎయిర్ ఇండియా - ఎక్కడ మొదలైందో అక్కడకే చేరింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp