సీఎం జగన్‌ గురించి అగ్రిగోల్డు బాధితులు ఏమనుకుంటున్నారు..?

By Aditya Sep. 14, 2021, 03:30 pm IST
సీఎం జగన్‌ గురించి అగ్రిగోల్డు బాధితులు ఏమనుకుంటున్నారు..?

ఆస్థి పంపకాల వేళ సొంత అన్నదమ్ములైనా అప్పులు పంచుకోవడానికి ముందుకు రారు. అలాంటిది ఓ ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన సొమ్మును తాను చెల్లిస్తానని వారికి హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప విషయం. అలాంటి గొప్ప పని చేసి ఆ బాధితుల కన్నీళ్ళు తుడిచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి.

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు...

తాము రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న సొమ్ములను డిపాజిట్లుగా కట్టించుకున్న అగ్రిగోల్డు సంస్థ బోర్డు తిప్పెయడంతో లక్షలాది మంది మోసపోయారు. ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో వారందరూ తమ గోడును వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికి విన్నవించుకున్నారు. వారు మోసపోయిన తీరును విని ఆయన చలించారు. 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అని వారికి భరోసా ఇచ్చారు. తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి డబ్బు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు.

రెండు విడతలుగా చెల్లింపు..

అగ్రిగోల్డు సంస్థ నిర్వాకం వల్ల ఎనిమిది రాష్ట్రాల్లో లక్షలాది మంది నష్టపోయారు. వీరిలో 10 వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన వారికి మొదట విడతగా 2019 నవంబరులో చెల్లింపులు చేసింది. అలా మొదటి విడతలో 3.40 లక్షల మందికి 238.73 కోట్లు చెల్లించింది. 10 వేల నుంచి 20 వేల రూపాయల లోపు డిపాజిట్ చేసి మోసపోయినవారికి 2021 ఆగస్టులో సొమ్ములు చెల్లించింది. ఆవిధంగా 3.14 లక్షల మందికి 459.23 కోట్ల రూపాయలు అందజేసింది. వీరితోపాటు మొదటి విడతలో మిగిలిపోయిన 10 వేల లోపు డిపాజిట్ దారులు మరో 3.86 లక్షల మందికి 207.61 కోట్ల రూపాయలు చెల్లించింది. రెండు విడతలుగా అగ్రిగోల్డు బాధితులు మొత్తం 10.40 లక్షల మందికి 905.57 కోట్లు అందజేసి వారికి ఆలంబనగా నిలిచింది.

Also Read : ఊహించని ట్విస్ట్‌.. స్పీకర్‌కు అచ్చెం నాయుడు క్షమాపణ

టీడీపీ సర్కారు మోసం

గత తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిగోల్డు బాధితుల గోడును చాలారోజులు పట్టించుకోలేదు. వారు పెద్దఎత్తున ఆందోళనకు దిగడం, ప్రతిపక్ష నేత వారికి హామీ ఇవ్వడంతో కంగారు పడి అరకొర చర్యలు తీసుకుంది. కాకి లెక్కల ద్వారా 20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితుల సంఖ్యను కేవలం 8.79 లక్షల మందిగా తేల్చింది. వారికి 785 కోట్లు చెల్లిస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే వారిని మోస గించింది.

జగన్ సర్కారు నిజాయితీ..

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జగన్ సర్కారు వారిని ఆదుకొనేందుకు అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు గ్రామ, వార్డు వలంటీర్లు. సచివాలయాల ద్వారా బాధితులను గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి వారి ఖాతాల్లో సొమ్మును జమ చేసింది.

మిగిలిన సొమ్ముకు భరోసా..

కోర్టులో ఉన్న అగ్రిగోల్డు బాధితుల వ్యవహారంలో ప్రభుత్వమే చొరవ చూపించి, ఆ సంస్థ భూములను అమ్మించి, మిగిలిన సొమ్మును డిపాజిట్ దారులకు చెల్లించాలని కసరత్తు చేస్తోంది. ఒక ప్రైవేటు కంపెనీ మోసగించడంతో నష్టపోయిన వారిని ఆదుకొనేందుకు ఒక ప్రభుత్వం ఈ విధంగా రంగంలోకి దిగిన దాఖలా దేశంలోనే ఎప్పుడూ వినలేదు. అందుకే అగ్రిగోల్డు బాధితులు ఇది మనసున్న ప్రభుత్వం అంటూ జగన్మోహనరెడ్డి్ సర్కారును కొనియాడుతున్నారు.

Also Read : కలల లోగిల్లు కల్లెదుటే.....

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp