మొదట తండ్రిని తరువాత కూతురిని వరించిన ఆ పదవి .

By Ritwika Ram Jul. 21, 2021, 11:30 am IST
మొదట తండ్రిని తరువాత కూతురిని వరించిన ఆ పదవి .

వైఎస్సార్ కు ‘వీర’ విధేయుడు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట అడుగులో అడుగేసిన నాయకుడు.. ఏళ్లపాటు జెండా మోసిన లీడర్. అందుకు ప్రతిఫలంగా రెండేళ్ల కిందటే నామినేటెడ్ పదవితో న్యాయం చేశారు జగన్. ఇప్పుడు ఆయన బిడ్డకు కూడా పదవి ఇచ్చారు. తనను నమ్మి, తన వెంట నడిచినందుకు తండ్రి తర్వాత తనయను అందలం ఎక్కించారు. అనంతపురం జిల్లా సహకార కేంద్ర (ఏడీసీసీ) బ్యాంకు చైర్ పర్సన్ గా 24 ఏళ్ల ఎం.లిఖితను నియమించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేటెడ్ పదవులిచ్చిన 135 మందిలో పిన్న వయసు వ్యక్తి బహుశా లిఖితనే కావచ్చు. బీటెక్ పూర్తి కాగానే ఏడీసీసీ బ్యాంకు చైర్ పర్సన్ పదవిని చేపట్టారామె. నిన్నటిదాకా ఆమె తండ్రి పామిడి వీరాంజనేయులు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా పని చేశారు.

‘వీరా’గా ఫేమస్..

వీరా.. పామిడి వీరాంజనేయులు.. మానుకింద వీరాంజనేయులు.. ఏ పేరుతో పిలిచినా పలికే వ్యక్తిగా స్థానికంగా మంచి పేరు ఉంది ఆయనకు. అనంతపురంలోని ఎస్ఎస్ బీఎన్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 1991లో డిగ్రీ పూర్తి చేశారు. చదువులు పూర్తయిన రెండేళ్లలోనే ఆర్టీసీలో కండక్టర్‌‌ గా ఉద్యోగం సంపాదించారు. 1998 దాకా ఉద్యోగంలో కొనసాగారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2001లో జరిగిన ఎన్నికల్లో జడ్పీటీసీగా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. 2006 దాకా ఆ పదవిలో కొనసాగారు. తర్వాత పార్టీలో పలు పదవుల్లో కొనసాగారు.

పామిడి మండలంలోనే కాకుండా జిల్లాలోని సీనియర్ నాయకులతో పరిచయాలు పెంచుకున్నారు. మండల పరిధిలో కీలక నేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటికి వచ్చాక.. ముందుగా తన అనుచరులను పంపారు. తర్వాత 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా పని చేశారు. అప్పటి శింగనమల నేత జొన్నలగడ్డ పద్మావతి, గుంతకల్లు నేత వై.వెంకట్రామిరెడ్డితో కలిసి వీరాంజనేయులు పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్ పాదయాత్ర సందర్భంగా.. వైస్సార్‌‌సీపీ అధినేతతో కలిసి అడుగులో అడుగు వేశారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి గెలుపుకోసం తీవ్రంగా కష్టపడ్డారు. 2014లో స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఓడిపోగా.. గత ఎన్నికల్లో విజయం సాధించారు. వైవీఆర్ గెలుపు కోసం వీరా ఎంతో కృషి చేశారు.

ఏడీసీసీ చైర్మన్ గా రెండేళ్లు..

2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టారు. అందులో భాగంగా వైఎస్సార్ సీపీ అనంతపురం జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న వీరాంజనేయులును.. అదే ఏడాది ఏడీసీసీ చైర్మన్ గా జగన్ నియమించారు. అప్పట్లో వీరా భారీ ర్యాలీగా వెళ్లి ప్రమాణ స్వీకారం చేశారు. ఏడీసీసీ చైర్మన్‌గా జిల్లాలోని రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాలోని 119 సహకార సంఘాల్లోని 1.2 లక్షల మంది రైతులకు రూ.360 కోట్ల రుణాలను అందించారు. అవినీతికి తావులేకుండా, అక్రమాలు జరగకుండా రెండేళ్లపాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. పాలకవర్గ సభ్యులు, అధికారుల సహకారంతో అభివృద్ధికి కృషి చేశారు. పలు ప్రాంతాల్లోని బ్రాంచీలకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేశావారు. తాజాగా పదవీకాలం పూర్తి కావడంతో.. వీరా స్థానంలో ఆయన కూతురు లిఖిత ఎంపికయ్యారు. మహిళా కోటాలో లిఖితను ఎంపిక చేశారని, వీరాంజనేయులుకు మరో పదవి ఇస్తామని పార్టీ పెద్దలు చప్పినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

లిఖిత.. గ్రాండ్ ఎంట్రీ

చిన్న వయసులోనే ఏడీసీసీ బ్యాంకు చైర్ పర్సన్‌గా ఎన్నికై లిఖిత చరిత్ర సృష్టించారు. తొలి అడుగులోనే జిల్లా స్థాయిలో పదవితో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచారు. ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ చదివిన లిఖిత.. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. తండ్రి బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఏడీసీసీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరా కుటుంబంలో రెండో తరం రాజకీయ అరంగేట్రంతో అటు వైసీపీ అభిమానులు, ఇటు వీరా అనుచరులు సంబురాలు చేసుకుంటున్నారు. పార్టీ కోసం పని చేసిన వీరాకు జగన్ ఇచ్చిన బహుమతి ఇది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp