ఇందులో.. జ‌గ‌న్ ఆడుతున్న నాట‌కాలేంటో సెల‌విస్తారా అచ్చెన్నా..?

By Kalyan.S Aug. 27, 2021, 07:30 am IST
ఇందులో.. జ‌గ‌న్ ఆడుతున్న నాట‌కాలేంటో సెల‌విస్తారా అచ్చెన్నా..?

నాడు - నేడు.. ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుంచీ బాగా ప్రాచుర్యం పొందుతున్న ప‌దం. వాస్త‌వానికి ఇది ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల అభివృద్ధికి సంబంధించిన‌దే అయినా.. జ‌గ‌న్ తీసుకుంటున్న ప్రతి నిర్ణ‌యంలోనూ క‌నిపిస్తోంది. గ‌త పాల‌న‌కు, జ‌గ‌న్ సంక్షేమ‌ పాల‌న‌కు తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డ‌మే ఇందుకు కార‌ణం. ప‌థ‌కాలు, పాల‌న‌లోనే కాదు.. కొన్ని అంశాల్లో బాధితుల‌కు న్యాయం చేయ‌డంలోనూ జ‌గ‌న్ విభిన్న పంథానే అవ‌లంబిస్తున్నారు. తాజాగా అగ్రిగోల్డ్ బాధితులకు డ‌బ్బులు అంద‌జేసి ఆదుకుంటే.. టీడీపీ మాత్రం స‌న్నాయినొక్కులు నొక్కుతోంది. జ‌గ‌న్ నాట‌కాలు అడుతున్నారని ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అంటున్నారు.

వాస్త‌వానికి ఈ కుంభ‌కోణం జ‌రిగింది తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలోనే అని అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం చేయ‌డంలో నాటి ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. బాధితులు నానా గోల చేసిన తర్వాత సరిగ్గా గ‌త అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే ఫిబ్రవరిలో బాధితులను ఆదుకునే పేరుతో ప్రభుత్వం జీవో ఇచ్చింది. కేవ‌లం ఓట్ల ల‌బ్ది కోసం ఎన్నికలకు ముందు జీవో ఇవ్వడం, ఎన్నికల కోడ్ పేరుతో డబ్బులు పంపిణీ చేయలేకపోయామని ఇపుడు చెప్పడం చూస్తే.. నాట‌కాలు ఆడేది ఎవ‌రో ఎవ‌రికైనా ఇట్టే తెలిసిపోతుంది. కానీ.. ఆగ్రిగోల్డ్ సంస్ధకున్న భూములు వేలం వేసి తిరిగి రాబట్టుకుంటామని జగన్ చెబుతూ.. మరోవైపు ఉదారంగా ఆదుకున్నామని నాటకాలు ఆడటం ఏమిటంటూ అచ్చెన్నాయుడు అండ్ కో ప్ర‌శ్నిస్తున్నారు.

కోర్టులో కేసు తేలి.. ఎన్ని సంవ‌త్స‌రాలు ప‌ట్టినా ప‌ర్వాలేదు.. అగ్రి గోల్డ్ ఆస్తులు అమ్మి న త‌ర్వాత మాత్ర‌మే ఖాతాదారులకు డబ్బులు జమ చేయాల‌నేది అచ్చెన్న ఉద్దేశంగా క‌నిపిస్తోంది. మ‌న‌కెందుకులే ఎప్పుడో తీర్పు వ‌చ్చాకే చూద్దాం.. అనుకునే సాధార‌ణ నేత‌ల్లా ఆలోచించ‌కుండా జ‌గ‌న్ ముందుగానే బాధితుల‌కు న్యాయం జ‌రిగేలా చేశారు. ఖాతాదారుల సమస్యను అర్థం చేసుకున్నారు కాబట్టే ముందు డబ్బులు జమచేసేసి తర్వాత ఆస్తులను అమ్మి తమ సొమ్మును ప్రభుత్వం రీఎంబర్స్ చేసుకుంటుందని చెప్పారు. మ‌రి అందులో త‌ప్పు ఏముందో స‌ద‌రు అచ్చెన్నఅండ్ కో వారికే తెలియాలి.

అగ్రిగోల్డ్ బాధితులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులను జమ చేసింది. రు. 10 వేల నుంచి రు. 20 వేల మధ్య పెట్టుబడి పెట్టిన వాళ్లకు తాజాగా వాళ్ళ డబ్బులు అందచేసింది. సుమారు 10.40 లక్షల మంది ఖాతాదారులకు రు. 670 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇందులో నాట‌కాలు ఏంటో కూడా వారే సెల‌వివ్వాలి. ఎప్ప‌టికో వ‌స్తాయ‌నుకున్న డ‌బ్బులు అందినందుకు బాధితులు సంతోషిస్తుంటే మధ్యలో టీడీపీ బాధేమిటో అర్థం కావటం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp