కొత్త వాళ్ళని రాజకీయాల్లో ప్రోత్సహించకూడదా ? రాధాకృష్ణ బాధేమిటో ?

By Phani Kumar Jun. 21, 2020, 11:25 am IST
కొత్త వాళ్ళని రాజకీయాల్లో ప్రోత్సహించకూడదా ? రాధాకృష్ణ బాధేమిటో ?

దశాబ్దాలుగా రాజకీయనేపధ్యమున్న కుటుంబాలకు చెందిన వాళ్ళను కాదని జగన్మోహన్ రెడ్డి కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడంటూ ప్రతి ఆదివారం ఎల్లోమీడియాలో రాసే కొత్తపలుకులో వేమూరి రాధాకృష్ణ తన బాధంతా వెళ్ళగక్కాడు. జగన్ ఎవరెవరిని పక్కనపెట్టాడు, ఎవరెవరిని ఆధిరిస్తున్నాడనే విషయంలో పెద్ద జాబితానే ఇచ్చాడు. రాధాకృష్ణ ఇచ్చిన జాబితాను పక్కన పెడితే అసలు కొత్తపలుకు బాధేమిటో అర్ధం కావటం లేదు. కుటుంబ నేపధ్యం కారణంగా దశాబ్దాలుగా పాతుకుపోయిన నేతలకు ప్రాధాన్యత ఇస్తే కొత్త వాళ్ళను ఎవరు ప్రోత్సహిస్తారని గోలచేస్తారు. సీనియర్ నేతలను పక్కనపెట్టేసి కొత్తవాళ్ళకు ప్రాధాన్యత ఇస్తే సీనియర్లను దూరం పెట్టేస్తున్నారంటూ గోల చేస్తారు. అంటే జగన్ ఏమి చేసినా గోల చేయాలన్నది ఎల్లోమీడియా టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమైపోతోంది.

సొంత పార్టీలో రాజకీయ కుటుంబాలు, పలుకుబడి కలిగిన నేతలను జగన్ దూరం పెట్టేస్తున్నాడంటూ రాధాకృష్ణ ఏమిటో అర్ధం కావటం లేదు. పార్టీలో ఎవరిని ఆధరించాలి ?ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంలో జగన్ కు క్లారిటి ఉంది. కాబట్టి తన ప్లాన్ ప్రకారమే ముందుకు వెళతాడు. మధ్యలో రాధాకృష్ణకు వచ్చిన సమస్యేమిటో అర్ధం కావటం లేదు. పార్టీలో సినియర్లయిన ఆనం రామనారాయణరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళను జగన్ దూరం పెట్టేశాడంటూ రాశాడు. తమను జగన్ దూరం పెట్టాడని ఆనం, భూమన ఎప్పుడైనా చెప్పారా ? ఎవరికి పదవులు ఇవ్వాలో ? ఎఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలో జగన్ కు అంతమాత్రం తెలీదా ? పదవులు రానంత మాత్రాన సీనియర్లను దూరం పెట్టేసినట్లేనా ? ఉన్నదే 25 మంత్రి పదవులు. ఎంతమంది సీనియర్లను మంత్రివర్గంలోకి తీసుకోగలడు ? ఇక మొదటి నుండి తనకు మద్దతుగా ఉన్న అనీల్ కుమార్ యాదవ్ ను మంత్రివర్గంలోకి తీసుకోవటంలో తప్పేమీ లేదు.

రాజకీయంగా కమ్మ, కాపు నేతలపై ఆధారపడకుండా నేరుగా ఓటర్లతోనే సంబంధాలు పెట్టుకోవాలని జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు రాధాకృష్ణ తెగ బాధిపోయాడు. ఏ సిఎం అయినా ఒకళ్ళిద్దరు నేతలపై ఆధారపడి రాజకీయాలు చేస్తాడా ? ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవాలనుకోవటం తప్పెలా అవుతుందో కొత్తపలుకే చెప్పాలి. సీనియర్లు, రాజకీయ కుటుంబాల వాళ్ళు కొరకరాని కొయ్యలుగా తయారవుతారని జగన్ ఆలోచనగా రాధాకృష్ణ చెప్పటమే విచిత్రంగా ఉంది. ఏ పార్టీ అధినేతైనా తనకు హార్డు కోర్ మద్దతుదారులను, నమ్మకస్తులనే దగ్గర పెట్టుకోవాలనే ఆలోచిస్తాడని రాధాకృష్ణకు తెలీదా ?

ఇక భూమనను కూడా జగన్ దూరం పెట్టేశాడంటున్నాడు. భూమనకు లేని బాధ రాధాకృష్ణకు ఎందుకు ? భూమనది రాజకీయ కుటుంబం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం వైఎస్ కుటుంబం వల్లే రాజకీయంగా ఎదిగాడన్న విషయం చిత్తూరు జిల్లాలో ఎవరినడిగినా చెబుతారు. సీనియర్లను తొక్కేయటం ద్వారా తెలుగునాట జగన్ సరికొత్త రాజకీయానికి తెరలేపాడు అని రాధాకృష్ణ చెప్పింది కూడా తప్పే. 1982లో తెలుగుదేశంపార్టీ తరపున పోటి చేసిన వాళ్ళల్లో చాలామంది అప్పటికి రాజకీయాలకు కొత్తే అన్న విషయం అందరికీ తెలుసు. యనమల రామకృష్ణుడు, దివంగత నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు లాంటి వాళ్ళే ఉదాహరణ.

ఎప్పటి సంగతో ఎందుకు అనుకుంటే 1999 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కూడా తటస్తులంటూ కొత్త పద్దతిని ప్రారంభించలేదా ? అప్పటి ఎన్నికల్లో రాజకీయ నేపధ్యం లేని కొందరిని హఠాత్తుగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లిచ్చి ప్రోత్సహించలేదా ? కొత్తగూడెంలో కవిత, సూర్యాపేటలో రజని, మాజీమంత్రి శనక్కాయల అరుణ లాంటి వాళ్ళున్నారు. తర్వాత కూడా కాల్వ శ్రీనివాసులు లాంటి వాళ్ళకు చంద్రబాబు టిక్కెట్లివ్వలేదా ? మరి వాళ్ళను ప్రోత్సహించి టిక్కెట్లిచ్చినపుడు ఆయా నియోజకవర్గాల్లో సీనియర్లను చంద్రబాబు తొక్కేస్తున్నాడని రాధాకృష్ణ ఎందుకు గోల చేయలేదు ? కొత్తవాళ్ళను ప్రోత్సహించే విషయంలో చంద్రబాబు చేస్తే బ్రహ్మాండం, జగన్ చేస్తే తప్పయ్యిందా రాధాకృష్ణకు ?

చంద్రబాబు అయినా జగన్ అయినా తమకు నమ్మకస్తులుగా ఎవరుంటారు ? తమకు మద్దతుదారులుగా ఉండే వాళ్ళనే ప్రోత్సహించాలని అనుకోవటం సహజం. నమ్మకస్తులను ప్రోత్సహించటం, ఆధిరంచటంలో వైఎస్ కుటుంబానికి తిరుగులేని బ్రాండ్ ఉంది. తాజాగా వైసిపి నుండి రాజ్యసభకు ఎంపికైన నలుగురిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలే ఇందుకు ఉదాహరణ. మరి ఇదే విషయంలో చంద్రబాబు ఏమి చేశాడు ? ఎప్పటికప్పుడు మద్దతుదారులను మార్చేస్తాడని, సీనియర్లను అణగదొక్కేస్తాడని చంద్రబాబు మాజీ సహచరుల ఆరోపణలు అందరికీ తెలిసిందే.

ఇక టిడిపి సీనియర్లపై జగన్ ప్రభుత్వం కేసులు పెడుతున్నాడంటూ రాధాకృష్ణ తెగ బాధిపడిపోతున్నాడు. యనమల, నిమ్మకాయలపై ఎస్సీ కేసు పెట్టడం ఏమిటంటూ మండిపోయాడు. పై ఇద్దరు నేతలపై ప్రభుత్వం తనంతట తానుగా కేసు పెట్టలేదు. రెండో పెళ్ళి వివాహం వివాదంలో ఓ ఎస్సీ యువతి టిడిపి మాజీ ఎంఎల్ఏ పిల్లి అనంతలక్ష్మితో పాటు యనమల, నిమ్మకాలపై చేసిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు పెట్టారు. ఇక మరీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మీద నిర్భయ కేసు నమోదైంది. మహిళా కమీషనర్ ను పట్టుకుని అందరిముందు బట్టలూడదీసి కొడతానంటూ చింతకాయల దుర్భాషలాడాడు. దాంతో మహిళా కమీషనర్ ఫిర్యాదుతో చింతకాయలపై పోలీసులు నిర్భయ కేసు పెట్టారు.

ఇక మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఇఎస్ఐ కుంభకోణంలో ఆధారాలతో సహా దొరికినందునే ఏసిబి కేసులు పెట్టి అరెస్టు చేసింది. మాజీ ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డి జేసి ట్రావెల్స్ ముసుగులో దశాబ్దాలుగా చేస్తున్న మోసాలు బయపడిన కారణంగానే ప్రభాకర్ రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. అచ్చెన్న, ప్రభాకర్ అరెస్టు విషయంలో జనాల్లో కానీ టిడిపిలోనే సానుభూతి రావటం లేదన్న విషయాన్ని రాధాకృష్ణ మరచిపోయినట్లున్నాడు. రాధాకృష్ణ రాతలు చూస్తుంటే జగన్ కొత్త తరహా రాజకీయం వల్ల చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు మూసుకుపోతుందని అర్ధమైనట్లే ఉంది. అందుకనే ఇటువంటి పిచ్చిరాతలు రాస్తున్నాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp