పవన్‌ చెప్తే చాలా ప్రజలూ చెప్పాలా?

By P. Kumar Aug. 01, 2020, 08:00 am IST
పవన్‌ చెప్తే చాలా ప్రజలూ చెప్పాలా?

బిల్లుల ఆమోదంపై సమాధానం చెప్పాలంటూ ఏబీఎన్‌ శివాలు...!

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై గవర్నర్‌ సంతకం. ఇంకేముంది మిన్ను విరిగి మీద పడిందా? మేను పర్వతమేమైనా బద్ధలైందా? అనుకునేంతలా ఏబీఏన్‌ న్యూస్‌ ప్రజెంటర్‌ వెంకటకృష్ణ శివమెత్తారు. నేటి ఈ సమస్యకు కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబును పల్లెత్తు మాటైనా అనకుండా పవన్‌ కళ్యాణ్‌ సమాధానం చెప్పాలంటూ దిక్కులు పిక్కటిల్లేలా డిమాండ్‌ చేశారు. దాంతో ఏబీఎన్‌ ప్రస్తుతానికి పవన్‌ ఒక్కడితో సరిపెట్టినా నేడో రేపో వైఎస్సార్‌సీపీకి ఓట్లేసిన ప్రజలను సైతం సంజాయిషీ అడిగినా అడుగుతుందంటూ పలువురు కామెంట్‌ చేస్తున్నారు.

Read Also:- శాశ్వతంగా నిలిచిపోనున్న జగన్ ‘రాజ’ముద్ర

ఫార్ములా ఇదే....

నిరపరాధిని అపరాధిగా, అపరాధిని నిరపరాధిగా చిత్రీకరించగల శక్తిమంతమైన సాధనమే మీడియా...ఈ స్టేట్‌మెంట్‌కు ఎల్లో మీడియా సంపూర్ణ న్యాయం చేస్తోంది. అమరావతి పేరుతో చంద్రబాబు అభూత కల్పనను ఆవిష్కరిస్తే, ఇప్పుడు తెగ ఇదైపోతున్న ప్రసారమాధ్యమాలే ఆనాడు ఆ ప్రహసనానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించాయి. పర్యావసానం...రైతులు త్రిశంకు స్వర్గంలోకి నెట్టబడ్డారు. కానీ, ఏబీఎన్‌ చానెల్, దాని ప్రజెంటర్‌ వెంకట కృష్ణలకు మాత్రం ఇవేవీ పట్టవు. కాబట్టే అమరావతి సమస్యకు సృష్టికర్తయిన చంద్రబాబును నిరపరాధిగా డిక్లేర్‌ చేసి...పవన్‌కళ్యాణ్, గవర్నర్‌ తదితరులను అపరాధులు మార్చి సంజాయిషీ అడుగుతున్నారు.

Read Also:- .గవర్నర్‌ రాజకీయ వ్యవస్థ కాదు.. రాజ్యాంగ వ్యవస్థ : బీజేపీ..

బోనెక్కాల్సింది బాబు కదా?

అమరావతి ప్రహసనంలో జరిగిన నష్టమేదైనా ఉందంటే దానికి ప్రథమ ముద్దాయి చంద్రబాబే. ఈ విషయంలో మీడియా బోనంటూ ఎక్కించాల్సి వస్తే చంద్రబాబుతోనే ప్రారంభించాలి. తర్వాత తానే బోనులో నుంచోవాలి. ఎందుకంటే చంద్రబాబు మూడు పంటలు పండే 33 వేల ఎకరాలను సేకరిస్తున్నప్పుడు, ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టనప్పుడు, ఇస్తాంబుల్‌ నిర్మిస్తా, సింగపూర్‌ను సాక్షాత్కరిస్తా అంటూ అలవికాని మాటలు చెప్తున్నప్పుడు ఈ చానెళ్లన్నీ ఏంచేశాయో అందరం చూశాం. చంద్రబాబు రోజుకో గ్రాఫిక్స్‌ను విడుదల చేస్తుంటే ఆహా ఓహో అద్భుతం అంటూ కీర్తించాయే కానీ, పనులెప్పుడు మొదలవుతాయి? భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లెప్పుడు కేటాయిస్తారు? అంటూ ప్రశ్నించిన దాఖలాలు లేవు. కాబట్టి నేడు చంద్రబాబు, ఎల్లో మీడియాల వైఖరిని‘మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కింది అంట’ అనే తరహాలో ఉందని చెప్పొచ్చు.

వార్తల్లోనే అద్భుతాలు

వాటర్‌ ట్యాక్సీలు,అండర్‌ వాటర్‌ మెట్రో,ఎయిర్‌ అంబులెన్స్‌లు,ఆకాశహర్మ్యాలు అబ్బో ఒకటా రెండా ఇలాంటివెన్నో నిత్యం పత్రికల్లో కనిపించేవి! వాస్తవంలోకొస్తే చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అమరావతిలో రోడ్లను సైతం పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయారు. కేవలం నాలుగంటే నాలుగు తాత్కాలిక భవనాలతో సరిపెట్టేశారు. ఇప్పుడిదే అమరావతికి శాపంగా పరిణమించింది. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన జరగకపోవడంతో ప్రత్యామ్నాయ ఆలోచనల వైపు నేటి పాలకపక్షం దృష్టిసారించింది. అలాగే పేరుకు అమరావతికి ప్రజా రాజధాని అంటూ క్యాప్షన్‌ తగిలించినా అది కేవలం కొందరు పెద్దల నగరంగా మారిపోయింది. దీంతో ఇతర ప్రాంతాల ప్రజలు అమరావతిని ఓన్‌ చేసుకోలేకపోయారు. ఆ కారణంగా అమరావతి హోదాలో జరిగే మార్పులకు వారి నుంచి కనీస స్పందన కూడా రావట్లేదు.

ఆలస్యంగానైనా ....

చంద్రబాబునాయుడి భూసమీకరణపై కొంతకాలం మౌనం వహించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తర్వాత విమర్శలు ఎక్కుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే భూమిలిచ్చిన రైతుల పరిస్థితేంటి అని అప్పట్లో పవన్‌ ప్రశ్నించిన మాట వాస్తవం. జరగరానిది జరిగితే పత్తిపాటి పుల్లారావు, నారాయణ వంటి నేతలు మీకు కనిపించనైనా కనిపించరని రైతులను హెచ్చరించారు. అయితే పవన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా టీడీపీ నేతలు, ఆశ్రితపక్షపాతం వ్యవహరించే మీడియా తీవ్రంగా స్పందించాయి. కానీ, అదే మీడియా ఇప్పుడు పవన్‌ ఏం సమాధానం చెప్తారు అంటూ ప్రశ్నిస్తుండటం గమనార్హం.

ఇదేమి వైపరీత్యం....

బిల్లుల ఆమోదంపై చర్చ సందర్భంగా ఏబీఎన్‌ న్యూస్‌ ప్రజెంటర్‌ వెంకటకృష్ణ తీరు నవ్విపోదురు కాగా నాకేంటి....? అనే తరహాలో సాగింది. ఆవేశం, ఆక్రోషం, అసహనం ఇలా అన్నీ శృతిమించడంతో విశ్లేషణ కాస్తా వైపరీత్యంగా మారింది. గతంలో ఓ చానెల్‌లో పనిచేసినప్పుడు రాజధాని వికేంద్రీకరణను సమర్థిస్తున్నానన్న వెంకటకృష్ణ ఏబీఎన్‌లోకి మారగానే పది బస్సులంతటి వాహనాన్ని తయారుచేసి అందులో రాజధాని పెట్టి రోజుకో ఊరు తిప్పండంటూ గల్లీలో మాట్లాడుకునే సిల్లీ కామెంట్స్‌ చేయడం గమనార్హం. చర్చలో ప్రధాని నుంచి పవన్‌ కళ్యాణ్‌ వరకు, గవర్నర్‌ నుంచి సోము వీర్రాజు వరకు ఇలా అందర్నీ ఆడిపోసుకున్న వెంకటకృష్ణ...చంద్రబాబును మాత్రం పల్లెత్తు మాట అనకపోవడం ఆశ్చర్యమేమీ కాదు...!  
 
 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp