దేవాలయాలలో వరుస ఘటనలు...కుట్రకోణం ఉందంటూ అనుమానాలు

By Dutt.R Sep. 16, 2020, 03:00 pm IST
దేవాలయాలలో వరుస ఘటనలు...కుట్రకోణం ఉందంటూ అనుమానాలు

అంతర్వేది రధం ఘటన మరవకముందే ఏపీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఉన్న మహా మండపం వద్ద అమ్మవారి రథానికి ఉన్న నాలుగు వెండి సింహాలలో మూడు చోరీకి గురైనట్లు వెలుగులోకి వచ్చింది.

ఏపీలో దేవాలయాలలో వరుసగా చోటు చేసుకున్న పరిణామాలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది రధం ఘటన మరవకముందే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఉన్న మహా మండపం వద్ద అమ్మవారి రథానికి ఉన్న నాలుగు వెండి సింహాలలో మూడు చోరీకి గురైనట్లు వెలుగులోకి వచ్చింది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, ఈవో సురేష్ బాబులు తమ వివరణ ఇచ్చినా దీనిపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

వివరణ ఇచ్చిన మంత్రి, ఈవో

దుర్గగుడిలోని రథానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా కార్పెట్‌ని తెరిచి చూసే సమయంలో సింహాలు కనిపించలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రధాన్ని ఉపయోగించలేదని ఈ ఘటన గత ప్రభుత్వంలో జరిగిందా? లేక ప్రస్తుతం జరిగిందా? అనే విషయాన్ని తేల్చేందుకు ఓ కమిటీ వేస్తున్నామని మంత్రి ప్రకటించారు. దీనికి బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని అంతర్వేది ఘటన తరువాత దేవాలయాలలో భద్రత చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో వెండి రథంలో మూడు సింహాలు మాయం కాలేదని దుర్గగుడి ఈవో సురేష్ బాబు స్పష్టం చేశారు. రికార్డులను పరిశీలిస్తున్నామని అంతర్వేది ఘటన జరగడంతో ఇలాంటి ఫేక్ న్యూస్ వస్తున్నాయని అన్నారు. మూడు రోజులలో విషయం చెబుతామని వెల్లడించారు.

ప్రతిపక్షాల విమర్శలు

'అంతర్వేది ఘటన మరువక ముందే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఉన్న మహా మండపం వద్ద అమ్మవారి రథానికి ఉన్న నాలుగు వెండి సింహాలలో మూడు చోరీకి గురయ్యాయి. ఆ సంగతి ఎవరికీ తెలియకుండా వేరే కొత్త వెండి సింహాలు తయారుచేసే పనిలో అధికారులు ఉండడం దురదృష్టకరం. ఇలాంటివి తెలుగుదేశం తీవ్రస్థాయిలో ఖండిస్తుంది' అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.'ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఆలయాలకు కూడా భద్రత కరవైందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వెయ్యాలి. లేకపోతే ప్రజాగ్రహం తప్పదు' అని గోరంట బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. దేవాదాయ మంత్రి, ఈవో వివరణ ఇచ్చినా దుర్గగుడిలో వెండి రథాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు పరిశీలించారు.

ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు 'దుర్గగుడిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రధం నిర్మాణంలో నాలుగు సింహాలను అమర్చారు ప్రస్తుతం వాటిలో మూడు సింహాలు కనుమరుగవ్వడం, మిగిలిన ఒకటి కూడా అసంపూర్ణంగా కనిపించడం చూస్తుంటే, ఆలయ అధికారుల నిర్లక్ష్యం, పవిత్రతను కాపాడే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఆలయ అధికారి ఆధీనంలో ఉండే రక్షణ వ్యవస్థ సరియైన పద్దతి అవలంబించని వైఖరిని కండిస్తున్నాము, ప్రభుత్వం సంబంధిత విచారణ చేసి 2 రోజుల్లోనే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. గవర్నర్ ను కలుస్తామని ఆయన అపాయింట్ మెంట్ ను కూడా తీసుకున్నామని వీర్రాజు తెలిపారు.

కుట్రకోణం

పరిపాలనపై పట్టుసాధించడానికి ఏ ముఖ్యమంత్రికైనా ప్రతిపక్షాలు ఆరు నెలల సమయం ఇస్తుంది. అదేమీ వింత ఆచారమే కానీ జగన్ సీఎం కాగానే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం ఆరంభించాయి. తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతోంది అంటూ మొదలెట్టి ప్రతి పనిపై విమర్శలు చేస్తున్నాయి. కరోనా లాంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రతి ఒక్క వర్గానికి లబ్ది చేకూరేలా సీఎం జగన్ చేస్తుండటం ప్రతిపక్షాలకు ఇబ్బందిగా ఉందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఎలాగైనా జగన్ ను అప్రతిష్ట చేయాలంటే ఏదో ఒక కారణం దొరకాలి అంటూ ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయని సమాచారం.

ఈ సమయంలోనే అంతర్వేది రధం ఘటన వారికి అవకాశంగా దొరికింది. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వైసీపీ సర్కార్ వ్యవహరిస్తుందని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇదే సమయంలో దుర్గగుడి వెండి రధంలో మూడు సింహాలు చోరికి గురయినట్లు విమర్శలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఓటేస్తేనే తమకు 151 సీట్లు వచ్చాయని గుర్తు చేస్తున్న వైసీపీ నేతలు హిందూ మతానికి వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తామని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందంటూ వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని డ్రామాలు చేస్తున్న ప్రతిపక్షాలు ఇప్పటికైనా తమ బుద్ది మార్చుకోవాలని వారు హితువు పలుకుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp