అణు విధ్వంసం అవిష్కరణ జరిగి డెబ్భై అయిదేళ్ళు

By Sannapareddy Krishna Reddy Aug. 06, 2020, 05:15 pm IST
అణు విధ్వంసం అవిష్కరణ జరిగి డెబ్భై అయిదేళ్ళు

నేటికి సరిగ్గా డెబ్భై అయిదు సంవత్సరాల క్రితం, ఆగస్టు 6,1945న జపాన్ నగరం హిరోషిమా మీద ఆటంబాంబు జార విడిచి, మానవాళి అదివరకు ఎన్నడూ చూడని వినాశనాన్ని ప్రపంచానికి చూపించింది అమెరికా. మూడు రోజుల తర్వాత మరో జపాన్ నగరం నాగసాకి మీద మరో అణుబాంబు జారవిడిచి మరింత ప్రాణ, ఆస్తి నష్టం కలిగించింది.

మాన్ హాటన్ ప్రాజెక్ట్

ఇటలీలో ఫాసిస్ట్, జర్మనీలో నాజీ ప్రభుత్వాల అణచివేత, వివక్ష భరించలేక 1930-1940 సంవత్సరాల మధ్య చాలా మంది శాస్త్రవేత్తలు అమెరికాకి వలస వెళ్ళారు. వారి వల్ల హిట్లర్ అప్పటివరకూ మానవాళి చరిత్రలోనే ఎవరూ చూడని విధ్వంసం కలిగించే ఆయుధం తయారు చేసే పనిలో ఉన్నాడని అమెరికా ప్రభుత్వం తెలుసుకొంది.

1940లో పెరల్ హార్బర్లోని అమెరికా సైనిక స్థావరం మీద జపాన్ దాడి చేయడంతో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రవేశించడంతో మాన్ హాటన్ ప్రాజెక్టు పేరుతో అణ్వస్త్రం అభివృద్ధి చేయడానికి పరిశోధన మొదలు పెట్టింది అమెరికా ప్రభుత్వం. కొన్ని సంవత్సరాల పరిశోధన తర్వాత ఈ బృందం రేడియో ధార్మిక యురేనియం, ప్లుటోనియం తయారు చేసి, సైన్యానికి అందించింది. రాబర్ట్ ఓపెన్ హెయిమర్ నాయకత్వంలో మరో బృందం ఈ మూలకాలతో బాంబు తయారు చేసి, జూలై 16,1945న న్యూ మెక్సికోలో విజయవంతంగా పరీక్షించి చూశారు.

జపాన్ మొండితనం

అమెరికా సైన్యం ఆటంబాంబు పరీక్ష జరిపే నాటికి ఇటలీ, జర్మనీ లొంగిపోవడంతో యూరోప్ ఖండంలో యుద్ధం ముగిసిపోయింది. అయితే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా జపాన్ మొండిగా యుద్ధం కొనసాగించడంతో పసిఫిక్ ప్రాంతంలో హోరాహోరీ పోరు కొనసాగింది. గెలిచే అవకాశం ఏమాత్రం లేదని తెలిసినా రోజురోజుకూ జపాన్ మరింత తీవ్రంగా పోరాటం చేయడంతో 2046 మార్చి నుంచి జూన్ నెలలోపు అంతకుముందు నాలుగు సంవత్సరాలలో మరణించిన వారిలో సగం మంది అమెరికా నాయకత్వంలోని మిత్ర పక్షాల సైనికులు ఆ నాలుగు నెలల్లోనే మరణించారు.

యుద్ధం కొనసాగేకొద్దీ సైనికబలం, ఆయుధ సంపత్తి తగ్గిపోతూ ఉండడంతో జపాన్ వైమానిక దళం కామికేజ్ పద్ధతిలో యుద్ధం ప్రారంభించింది. ఇందులో ఒక యుద్ధ విమానంలో పేలుడు సామగ్రి నింపి నేరుగా వెళ్లి ఒక యుద్ధనౌకని ఢీ కొడతారు. విమానంలో ఉన్న ఒకరో ఇద్దరో మరణిస్తే, అవతలి పక్షం వారి నౌక, అందులో ఉన్న సిబ్బంది వందలాది మంది మరణిస్తారు. ఇది విమాన వాహక నౌక అయితే నష్టం మరింత ఉంటుంది. యుద్ధం చివరి దశకు వచ్చింది అనుకునే సమయంలో ఈ భారీ నష్టాలు అమెరికాని బాగా చికాకు పెట్టాయి. అప్పుడే రూజ్వెల్ట్ స్థానంలో అధ్యక్ష పీఠం ఎక్కిన హారీ ట్రూమన్ మీద ఒత్తిడి పెరిగింది.

జపాన్ కి అల్టిమేటమ్

1946 జులై మాసం చివరిలో జపాన్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేశాడు ట్రూమన్. వెంటనే లొంగిపోకపోతే కనీవిని ఎరుగని రీతిలో దెబ్బ తీస్తాం అన్న ట్రూమన్ హెచ్చరిక ఏమాత్రం పట్టించుకోకుండా జపాన్ యుద్ధం కొనసాగించింది. తన హెచ్చరికని ఎలా అమలు చేయాలో యాక్షన్ ప్లాన్ రూపొందించే బాధ్యత తన సహచరులకు అప్పగించాడు ట్రూమన్.

పసిఫిక్ రంగంలో అమెరికా సైన్యాధ్యక్షుడు డగ్లస్ మెకార్థర్ ముందు విమానాలతో బాంబుల వర్షం కరిపించి, ఆ తర్వాత సైన్యాన్ని పంపించాలని ప్రతిపాదించారు. అయితే ఇందులో తమ సైన్యానికి అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో ట్రూమన్ దీనిని కొట్టిపారేశాడు. వార్ సెక్రటరీ హెన్రీ స్టిమ్సన్, సర్వ సైన్యాధ్యక్షుడు డ్వైట్ ఐసెన్ హోవర్ లకు ఇష్టం లేకపోయినా, సెక్రటరీ ఆఫ్ స్టేట్ జేమ్స్ బిర్నెస్ తమకు తక్కువ నష్టంతో యుద్ధం త్వరగా ముగించడానికి ఆటంబాంబు ప్రయోగం ఒక్కటే మార్గం అని చేసిన వాదనతో ఏకీభవించి అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు హారీ ట్రూమన్.

హిరోషిమా మీద లిటిల్ బాయ్ బాంబు

అధ్యక్షుడు పచ్చజెండా ఊపగానే తొమ్మిది వేల పౌండ్లు బరువున్న యురేనియం-235 బాంబుని పసిఫిక్ సముద్రంలోని టినియన్ ద్వీపంలో ఉన్న అమెరికా సైనిక స్థావరానికి తరలించారు. ఆగస్టు 6,1945 ఉదయాన్నే ఒక B-29 విమానంలోకి ఎక్కించి ముందుగా నిర్ణయించిన హిరోషిమా నగరం మీదకు తీసుకువెళ్లారు. ఒకవేళ హిరోషిమాలో వాతావరణం అనుకూలంగా లేకపోతే కోకురా లేదా నాగసాకి నగరాల మీద ఆ బాంబు వేయాలని ఆర్డర్ ఇచ్చారు.

మూడున్నర లక్షల మంది జనాభా ఉన్న హిరోషిమాలో ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి హిరోషిమాని మొదటి లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆ విమానం పైలట్ కల్నల్ పాల్ టిబ్బెట్స్ తన తల్లి పేరు ఎనోలా గేని ఆ విమానానికి పెట్టుకుంటే, అమెరికా సైన్యం బాబుకి లిటిల్ బాయ్ అన్న పేరు పెట్టింది.

ఉదయం 8:15 కల్లా బాంబుకి పారాచూట్ కట్టి హిరోషిమా మీద వదిలేశారు. భూమి నుంచి రెండు వేల అడుగుల ఎత్తులో పేలిన బాంబు అయిదు చదరపు మైళ్ళ విస్తీర్ణంలో నగరాన్ని తుడిచిపెట్టి, ఎనభై వేల మందిని క్షణాల్లో అంతం చేసింది. ఆ తర్వాత రేడియేషన్ ప్రభావం వల్ల హీరోషిమాలో మొత్తం ప్రాణనష్టం 1,26,000 అని అంచనా వేశారు.

నాగసాకి మీద ఫ్యాట్ మాన్

హిరోషిమా మీద బాంబు దాడి తర్వాత జపాన్ ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో రెడీగా ఉన్న రెండవ బాంబు కూడా ప్రయోగించాలని నిర్ణయించాడు అధ్యక్షుడు. ఈ బాంబుకి అమెరికా సైన్యం పెట్టిన పేరు ఫ్మాట్ మాన్.

జులై 9 న కోకురా నగరం మీద బాంబు వేయాలని బయలుదేరి, అక్కడ వాతావరణం మేఘావృతం అయి ఉండడంతో నాగసాకి మీద వేశారు. అయితే నాగసాకి చిన్న నగరం కావడంతో హిరోషిమాతో పోలిస్తే ఇక్కడ ప్రాణనష్టం కొంచెం తక్కువగా నలభై వేల నుంచి ఎనభై వేలు అని అంచనా వేశారు.

అప్పటికీ జపాన్ నుంచి స్పందన లేకపోవడంతో మరో మూడు బాంబులు సిద్ధం చేయమని శాస్త్రవేత్తల బృందానికి అమెరికా సైన్యం తెలిపింది. మరో మూడు నగరాలను గుర్తించి, బాంబులు రాగానే దాడి చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా జపాన్ చక్రవర్తి హిరోహిటో ఆగస్టు 15న జపాన్ లొంగుబాటును రేడియోలో ప్రకటించాడు.

సెప్టెంబర్ 2న అమెరికా యుద్ధ నౌక మిస్సోరీలో జపాన్ చక్రవర్తి లొంగిపోయినట్టు ప్రకటన మీద సంతకం చేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసింది.
హీరోషిమా మీద బాంబు దాడితోనే దారుణంగా దెబ్భతిన్న జపాన్ ని లొంగదీసుకోవడం కన్నా ప్రపంచానికి తనేమిటో తెలియజేసి, యుద్ధానంతర ప్రపంచం మీద ఆధిపత్యం సాధించాలన్న ప్రయత్నంతోనే అమెరికా రెండవ బాంబు ప్రయోగించింది అని నిపుణులు అంటారు.

ఏదేమైనా ఆ తర్వాత అనేక దేశాలు ఇబ్బడిముబ్బడిగా అణ్వస్త్రాలు తయారు చేసినా ఇప్పటి వరకూ వాటిని ఉపయోగించవలసిన అవసరం రాకపోవడం అదృష్టం అనే చెప్పాలి. అయితే ఆ ప్రమాదకర ఆయుధాలు ఎక్కడ ఉగ్రవాదుల చేతుల్లో పడతాయో అన్న భయం మాత్రం ఎప్పుడూ ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp