‌ ట్రైలర్‌ హిట్‌.. సినిమా ఫట్..

By Kotireddy Palukuri Aug. 05, 2020, 07:00 pm IST
‌ ట్రైలర్‌ హిట్‌.. సినిమా ఫట్..

ఊహించినట్లుగానే జరిగింది. మూడు రాజధానుల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్‌ విధించిన చంద్రబాబు.. ఆ సమయం ముగిసిన తర్వాత ఏదో చేస్తారని ఆశించిన వారికి ఆశాభంగం తప్పా మరేమీ మిగలేదు. ఎప్పటిలాగే ఆవు వ్యాసం వినిపించారు చంద్రబాబునాయుడు. గతంలో చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పారు. ప్రజలు చైతన్యం కావాలన్నారు. పోరాటం చేయాలన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. అంతేకాని డెడ్‌లైన ముగిసిన తర్వాత తాను ఏమి చేస్తానన్నది మాత్రం చెప్పలేదు. మళ్లీ రెండు రోజులకు మీడియా ముందుకు వస్తానన్నారు. అమరావతిపై వాస్తవాలు వివరిస్తానన్నారు. ఇలా ఇకపై ప్రతి రెండు రోజులకు ఒక సారి మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తానని చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వానికి చంద్రబాబు డెడ్‌లైన్‌ విధించడంతో ప్రజా ప్రతినిధులు రాజీనామాలు, ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగింది. ప్రభుత్వం చంద్రబాబు సవాల్‌ను స్వీకరించకపోతే ఆయనే రాజీనామా చేస్తారాని, వారి పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళతారని అందరూ భావించారు. చంద్రబాబు వేసే ఎత్తుతో అధికార పార్టీ చిత్తు అవుతుందని తెలుగు తమ్ముళ్లు కూడా భారీగా ఆశించారు. సోషల్‌ మీడియాలో ప్రచారం హోరెత్తించారు. కానీ డెడ్‌లైన్‌ ముగిసిన తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలు చూసి నివ్వెరపోయారు. తమ నాయకుడు ఏదో చేస్తారని ఆశిస్తే.. మునుపటిలాగే మాట్లాడారని తమ్ముళ్లు నిర్వేదంలో ఉన్నారు. డెడ్‌లైన్‌ ముగిసిన తర్వాత కూడా చంద్రబాబు మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, అసెంబ్లీని రద్దు చేయాలంటూ మాట్లాడి డెడ్‌లైన్‌ అనే పథకానికి ఉన్న అర్థాన్నే మార్చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Read Also: చంద్రబాబు: ఆవు వ్యాసమా.. సంచలనమా..?

48 గంటల డెడ్‌లైన్‌ విధించడంతో బాబు అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. చానెళ్లలో ప్రత్యేక చర్చా కార్యక్రమాలు పెట్టాయి. కౌంట్‌డౌన్‌ కూడా వేశాయి. బాబు అస్త్రాలు బయటకు తీస్తున్నారంటూ ప్రచారం చేశాయి. కానీ బాబు మాత్రం.. కేంద్రం జోక్యం చేసుకోవాలని మాట్లాడి తుస్సుమనిపించారు. తమకు సంబంధం లేదని లోక్‌సభలో రాతపూర్వకంగా తెలిపినా మళ్లీ ఈ డిమాండ్‌ ఎందుకు చేస్తున్నారని విలేకర్లు అడిగితే.. అయోధ్యకు, అమరావతికి లింక్‌ పెట్టి మాట్లాడిన చంద్రబాబు అందరినీ అశ్చర్యానికి గురి చేశారు. మొత్తం మీద చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్ సినిమా‌ ట్రైలర్‌ హిట్‌.. సినిమా ఫట్‌ మాదిరిగా ముగిసింది


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp