పోటాపోటీ : టీఆర్ఎస్ 493.. బీజేపీ 494

By Kalyan.S Nov. 21, 2020, 07:16 am IST
పోటాపోటీ : టీఆర్ఎస్ 493.. బీజేపీ 494

గ్రేట‌ర్ వార్ ఎలా ఉండ‌బోతుందో ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన నామినేష‌న్ల ప‌ర్వమే తెలియ‌జేస్తోంది. ఏయే పార్టీల మ‌ధ్య ప్ర‌ధాన పోరు ఉండ‌నుందో కూడా విశ‌ద‌మ‌వుతోంది. మొత్తంగా నామినేష‌న్ల ఘ‌ట్టాన్ని ప‌రిశీలిస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మ‌ధ్యే గ్రేట‌ర్ పోరు హోరాహోరీగా జ‌ర‌గ‌నున్న‌ట్లుగా భావించ‌వ‌చ్చు. డివిజ‌న్ల‌కు మించి నామినేష‌న్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఉప‌సంహ‌ర‌ణ అనంత‌రం ఆ సంఖ్య త‌గ్గ‌నుంది. అలాగే కొంద‌రు రెబెల్స్ గా బ‌రిలో ఉండే అవ‌కాశ‌మూ ఉంటుంది. అయితే నామినేష‌న్లు దాఖ‌లైన సంఖ్య‌ను ప‌రిశీలిస్తే నేత‌లు ఎక్కువ‌గా ఆ రెండు పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ కంటే బీజేపీ నుంచి దాఖ‌లైన నామినేష‌న్ల సంఖ్య ఒక‌టి ఎక్కువ‌గానే ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌

గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌లో ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన నామినేష‌న్ల ప‌ర్వం శుక్రవారంతో ముగిసింది. మొద‌టి రెండు రోజులు టికెట్ క‌న్మాఫ్ అని ముంద‌స్తుగా స‌మాచారం ఉన్న, జాబితాలో పేర్లున్న‌ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఎక్కువ‌గా నామినేష‌న్లు వేశారు. చివ‌రి రోజు జాబితాలో పేర్లు లేక‌పోయినా గ‌డువు ముగిసిపోవ‌డంతో ఆశావ‌హులంద‌రూ నామినేష‌న్లు వేశారు. వీరిలో స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. ఇదిలా ఉండ‌గా.. నామినేష‌న్లు వేసేందుకు భారీగా జ‌న‌స‌మీక‌ర‌ణ చేసి నేత‌లు త‌మ బ‌లాల‌ను చూపే ప్ర‌య‌త్నం చేశారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌ను వ‌దిలేసి మ‌రీ గుంపులు గుంపులుగా ర్యాలీలు నిర్వ‌హించారు. కొంద‌రైతే రెండో సెట్ నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు కూడా అట్ట‌హాసంగా బ‌య‌లుదేరారు. డ‌ప్పుల చ‌ప్పుళ్లు, బాణ‌సంచా పేలుళ్లు త‌దిత‌ర హంగూ ఆర్భాటాల‌తో త‌మ బ‌లం నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశారు. నామినేషన్ గడువు ముగిసే సమయానికి అధికార పార్టీ నుంచి 493 నామినేషన్లు అందగా, అత్యధికంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి 494 నామినేషన్లు వచ్చినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

మొత్తం 2, 226 నామినేషన్లు..

గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు గాను.. 1663 మంది అభ్యర్థులు 2,226 నామినేషన్లు దాఖలు చేశారు . చివ‌రి రోజైన శుక్రవారమే 1561 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి 494, టీఆర్ ఎస్ నుంచి 493 నామినేష‌న్లు రాగా.. కాంగ్రెస్ నుంచి అందిన నామినేషన్లు 312గా అధికారులు ప్ర‌క‌టించారు. తెలుగుదేశం పార్టీ నుంచి 186 నామినేషన్లు వ‌చ్చాయి. ఎంఐఎం నుంచి 66 నామినేష‌న్లు వ‌చ్చాయి. కాగా క‌మ్యూనిస్టు పార్టీలైన సీపీఎం నుంచి 24, సిపిఐ నుంచి 15 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఇతర పార్టీల నుంచి కూడా మ‌రో 86 నామినేషన్లు రాగా.. అత్య‌ధికంగా 550 నామినేష‌న్లు స్వతంత్ర అభ్యర్థుల నుంచి అందాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp