కోడెల ... కోడెల ... ఓటమితో ముగిసిన ఒక శకం

By Sanjeev Reddy May. 23, 2020, 06:30 pm IST
కోడెల ... కోడెల ... ఓటమితో ముగిసిన ఒక శకం

కోడెల లేచిపడ్డ అల

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు...
నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే...

2019 ఎన్నికల తర్వాత పలువురు సీనియర్ నాయకులు రాజకీయంగా అంతర్ధానం అవగా , మాజీ స్పీకర్ కోడెల జీవితం మాత్రం అర్ధాంతరంగా ముగియడం విషాదం. టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోడెల గుంటూరు జిల్లా నకరికళ్ళు మండలం కండ్లకుంట గ్రామంలో జన్మించారు . తన అమ్మమ్మ గారి ఊరైన సిరిపురంలో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన కోడెల బాల్యంలో తన అన్నదమ్ములందరూ మసూచి కాటుకి బలవ్వడంతో డాక్టర్ కావాలన్న పట్టుదలతో చదివి విజయవాడ లయోలా కాలేజ్ లో పీయూసీ చేసి కర్నూల్,గుంటూరు మెడికల్ కాలేజీలలో ఎంబీబీస్ చేసి బనారస్ యూనివర్సిటీలో జనరల్ సర్జన్ పూర్తి చేశారు.

అనంతరం కొన్నాళ్ళు సత్తెనపల్లిలో ఓ వైద్యుడి వద్ద జూనియర్ గా పని చేసిన కోడెల తర్వాతి కాలంలో నరసరావుపేట జమీందార్ రాజా మాళ్రాజ్ వంశస్థులు వద్ద నుండి నరసరావుపేట కోటలో వైద్యశాల కోసమని 82 సెంట్లు నామమాత్రపు ధరకు పుచ్చుకొని హాస్పిటల్ కట్టి ప్రాక్టీస్ చేయనారంభించారు . అనతి కాలంలోనే మంచి సర్జన్ గా , హస్తవాసి కల డాక్టర్ గా పేరు పొందిన కోడెల చుట్టుపక్కల గ్రామీణ ప్రజలకు నామమాత్రపు ఫీజులతో వైద్యం చేసి మంచి పేరు సంపాదించుకొన్నారు . డబ్బులిచ్చుకోలేని కొందరికి ఉచితంగా వైద్యం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి . ( కోడెల మరణం తర్వాత రూపాయి మాత్రమే ఫీజ్ తీసుకొని వైద్యం చేసిన డాక్టర్ గా కొందరు కీర్తిస్తూ చేసిన ప్రచారంలో వాస్తవం లేదు) .

1983 లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చిన కోడెల ఆ యాడాది గెలిచిన తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు . 1983 , 85 , 89 , 94 , 99 లలో వరసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోడెల పలు మంత్రి పదవులు కూడా చేపట్టాడు.

1987 లో మొదటిసారి హోమ్ మంత్రి గా చేసిన కోడెల ఆ తర్వాత భారీ నీటి పారుదల , పంచాయితీ రాజ్ , పబ్లిక్ వెల్పేర్ , పబ్లిక్ హెల్త్ శాఖలకు మంత్రిగా చేసిన కోడెల దాదాపు రెండు దశాబ్దాలు తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యాడు .

ఈ ఇరవై ఏళ్లలో నరసరావుపేట పట్టణంలో కోడెల చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గవి

1. నరసరావుపేట పట్టణానికి శాశ్వత మంచినీటి పధకం : నకరికళ్ళు సాగర్ కెనాల్ నుండి శాంతినగర్ లోని ఫిల్టర్ బెడ్స్ వరకూ , అక్కడి నుండి టౌన్ లోని స్టోరేజ్ టాంక్స్ కి ఒక్క మోటార్ వినియోగించకుండా నీరు చేరే విధంగా ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా పధకం నరసరావుపేట పట్టణానికి ఓ వరం అని చెప్పొచ్చు . భౌగోళికంగా నకరికళ్ళు కన్నా 98 మీటర్లు దిగువున నరసరావుపేట ఉండటం వలన ఈ వెసులుబాటు కలిగినా అది గుర్తించి కృషి చేసిన నాయకుడిగా ఈ పధకం కొనసాగినంత కాలం కోడెల పేరు నిలిచి ఉంటుంది అనడంలో సందేహం లేదు .

2 . కోటప్పకొండ అభివృద్ధి : సహజంగా శివభక్తుడైన కోడెల కోటప్పకొండ ఆలయ అనువంశిక ధర్మకర్తలుగా ఉన్న జమిందార్ వంశస్తులతో ఉన్న సాన్నిహిత్యంతో వారి ఆర్ధిక సహాయంతో , ప్రభుత్వ నిధులతో గుడి అభివృద్ధి , కొండ సుందరీకరణ కార్యక్రమాలతో పాటు ఆ టైంలో నాబార్డ్ చైర్మన్ గా ఉన్న రుణమాఫీ కమిటీ కోటయ్య సహకారంతో ఘాట్ రోడ్ నిర్మాణం చేశారు .

3.ఎన్టీఆర్ సతీమణి దివంగత బసవతారకం పేరు మీద ఏర్పాటు చేసిన కేన్సర్ ఇన్స్టిట్యూట్ కి లైఫ్ టైం ఛైర్మెన్ గా వ్యవహరించిన కోడెల గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలువురికి ఈ హాస్పిటల్ ద్వారా వైద్య సహాయం అందించడమే కాకుండా , నరసరావుపేట టీడీపీ కార్యకర్తలు పలువురికి ఇన్స్టిట్యూషన్ లో ఉద్యోగాలు ఇప్పించి ఆదుకొన్నాడు . 2009 లో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణకి ఛైర్మెన్ భాద్యతలు అప్పజెప్పేనాటికి సదరు సంస్థలో దాదాపు పదిహేడు వందల మంది ఉద్యోగులు ఉండగా అందులో షుమారు ఆరు వందల మంది నరసరావుపేట వాసులే ఉండడంలో కోడెల పాత్ర ఎంతో ఉంది .

అలాగే పేట చుట్టుపక్కల పల్లెటూర్లలో సీసీ రోడ్స్ , పట్టణంలో టౌన్ హాల్ , సత్తెనపల్లి రోడ్ లో కోడెల స్టేడియం , చెరువులో శివా గెస్ట్ హవుస్ లాంటి నిర్మాణాలు కోడెల హయాంలో చెప్పుకోదగ్గ పనులు .

ఇదంతా కోడెలలోని ఒక కోణాన్ని చూపిస్తుండగా వెలుగు వెనకే చీకటి ఉన్నట్టు కోడెల విజయాల వెనకాల రౌడీయిజం , ఫ్యాక్షన్ , గుండాయిజం ప్రభావం కొంచం ఎక్కువే అని చెప్పొచ్చు . తన విజయానికి ఎవరైనా అడ్డొస్తారని అనుమానం వచ్చినా నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేసే కోడెల గెలుపు కోసం తొక్కని అడ్డదారి , చేయని అకృత్యం లేదు.

తన గెలుపు కోసం గ్రామాల్లో వర్గ విబేధాలు రేకెత్తించిన కోడెల పచ్చని పల్నాడు పల్లెల్లో బాంబుల సంస్కృతి ప్రవేశపెట్టి ఆరని చిచ్చు రగిల్చాడు అని చెప్పొచ్చు .

1988 లో రంగా హత్య దరిమిలా హోంమంత్రిగా ఉన్న కోడెల పై ప్రధాన ముద్దాయిగా మొదటిసారి నేర ఆరోపణలు రాగా ఆ తర్వాత కాలంలో యేటికేటికి దౌర్జన్యం , దాడి , అవినీతి , అక్రమాల ఆరోపణలు కోడెల జీవితంలో నిత్యకృత్యం అయిపోయాయి . ఈ క్రమంలో కొన్ని గ్రామాల్లో వైరి వర్గాలు ఏకంగా కోడెల పై బాంబు దాడులు చేయడం కోడెల పై గ్రామాల్లో నెలకొన్న వ్యతిరేకతకు తార్ఖాణంగా చెప్పొచ్చు . ఒకానొక సందర్భంలో కోడెల హోంమంత్రి హోదాలో రొంపిచెర్ల మండల పర్యటనకు పోగా గ్రామస్తులు మొత్తం మూకుమ్మడిగా దాడి చేసి హత్యాయత్నం చేయగా చపారపు గోపాల రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు తన ఇంట్లో కోడెలని దాచి గ్రామస్తులకు అడ్డు నిలిచి కోడెలని కాపాడాడు .

1999 లో ఏకంగా కోడెల ఇంట్లోనే బాంబులు తయారు చేస్తుండగా అవి పేలి ఓ రౌడీ షీటర్,టీడీపీ డమ్మీ అభ్యర్థి సతీష్ తో సహా నలుగురు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది .బాంబులు పేలిన ఇల్లు అంతకు ఆర్నెల్ల ముందే అద్దెకి ఇచ్చానని పత్రాలు సృష్టించి చంద్రబాబు అండతో బయటపడ్డా బాంబుల శివప్రసాద్ అనే పేరు మాత్రం నిలిచిపోయింది .

ఆ తర్వాత 2004 ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనంలో ఓటమి పాలైన కోడెల , 2009 ఎన్నికల్లోనూ వరసగా రెండోసారి ఓడిపోయాడు . ఈ ఎన్నికలకు ముందు హాయగ్రీవ అనే టీడీపీ కార్యకర్త హత్య జరిగింది . ఆ హత్య కాంగ్రెస్ వారే చేశారని కోడెల , టీడీపీ శ్రేణులు పలు అల్లర్లు చేయగా , కోడెల అనుంగు సహచరుడు , మృతుడికి మేనల్లుడు వరుసయ్యే రౌడీ షీటర్ జల్లపల్లి అంజిబాబు ఆ కేసులో ముద్దాయి . కొంతకాలం జైలు జీవితం తర్వాత బెయిలు పై విడుదలయ్యిన జల్లపల్లి అంజిబాబును నరసరావుపేట శంకర మఠం గేటు వద్ద ప్రత్యర్ధులు దారుణంగా నరికి చంపగా అది కాంగ్రెస్ హత్య అంటూ చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు , ఆందోళనలు చేపించగా తరువాత హాయగ్రీవ బంధవులు , ఇతర ప్రత్యర్ధులు కలిసి చేసిన హత్యగా తేలింది .

ఇలాంటి పలు ఘటనల తర్వాత కోడెల అభిమానులు పల్నాటి పులి అని కోడెలకి బిరుదివ్వగా ప్రత్యర్ధులు కూడా అవును పులే పలువురిని మింగి నీళ్లు తాగిన పులి అని చెబుతుంటారు .

1983 నుండి నమ్మకంగా కోడెల వెన్నంటి ఉన్న పలువురు సీనియర్ నాయకులు కోడెల ఏకపక్ష వైఖరి , స్వార్ధపు ఎత్తులతో విసిగి వేసారి టీడీపీకి దూరమవ్వగా 2014 ఎన్నికలలో పేట నుండి గెలవడం కష్టం అని నిచ్ఛయించుకొన్న కోడెల పక్కనే ఉన్న సత్తెనపల్లి నుండి పోటీ చేసి గెలిచాడు . ఆది నుండీ టీడీపీలో బలమైన వర్గాన్ని కూడగట్టి మైంటైన్ చేసే కోడెల ఎప్పటికైనా తనకి ప్రమాదం అని భావించి అదును కోసం ఎదురు చూస్తున్న బాబు సొంత నియోజకవర్గంలో విలువ కోల్పోయి పక్క నియోజక వర్గం నుండి గెలిచిన కోడెలకి మంత్రి పదవి ఇవ్వకపోగా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తన కన్నా జూనియర్స్ అయిన సీఎం రమేష్ , సుజనా చౌదరిలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం గమనించిన కోడెల పలువురు సీనియర్లతో మొత్తుకోగా చివరికి స్పీకర్ పదవి దక్కింది .

2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన నరసరావుపేటలో బీజేపీ అభ్యర్థి నలబోతు వెంకట్రావు ఓడిపోగా , తన కొడుకు కోడెల శివరాంని టీడీపీ ఇంచార్జ్ గా నియమింప జేసుకోవడం కోడెల కొంప ముంచిందని చెప్పొచ్చు .

అత్యంత వేగంగా ఎదగాలన్న కాంక్షతో ఉన్న కోడెల శివరాం ధాటికి నరసరావుపేట బెంబేలెత్తింది అని చెప్పొచ్చు . నియోజక వర్గంలో తనకి తెలియకుండా చిన్న పని కూడా జరగకూడదని కట్టడి చేసిన శివరాం ప్రతి పనిలోనూ కే టాక్స్ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తాయి . కాదన్న వారి పై చేసిన దౌర్జన్యాల వార్తలతో మీడియా సోషల్ మీడియా హోరెత్తింది . ఇది ప్రభుత్వ కాంట్రాక్టర్స్ కే పరిమితం కాకుండా ప్రయివేటు వ్యాపారస్తులు , నిర్మాణ రంగంలోని వారి పై కూడా కే టాక్స్ భారం పడటంతో నరసరావుపేటలో కాస్తో కూస్తో పనులు చేసి సంపాదించుకున్న కోడెల పేరు తుడిచి పెట్టుకుపోవడమే కాకుండా వైసీపీ నుండి గెలిచిన ఇద్దరు ఎంపీపీలను , పలువురు ఎంపీటీసీ సభ్యులను , పన్నెండు మంది వైసీపీ సర్పంచ్ లను బలవంతంగా టీడీపీలో చేర్చుకోవడంతో నరసరావుపేట ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని చెప్పొచ్చు .

మరోవైపు సత్తెనపల్లిలో కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మి కే టాక్స్ వసూళ్లతో పాటు , ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి వద్ద లక్షల్లో గుంజి ఉద్యోగాలివ్వలేదనే ఆరోపణలు , ఫార్మా కంపెనీలకు తమ కంపెనీ సెలైన్స్ , డ్రగ్స్ మాత్రమే కొనాలని టార్గెట్స్ విధించి వేధించడం , సైలేజ్ గడ్డి కుంభకోణం , అన్నా క్యాంటీన్స్ లో భోజనాన్ని ఎత్తుకెళ్ళి తమ కంపెనీల్లో కార్మికులకు ముప్పై రూపాయలకు అమ్ముకొన్న ఘటనలతో కోడెల కుమార్తె పేరు కూడా సంచలనం అయ్యింది .

ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో మళ్లీ సత్తెనపల్లి నుండి గెలవనని నిచ్ఛయించుకొన్న కోడెల పేట నుండి కానీ గుంటూరు 2 నుండి కానీ పోటీ చేస్తానని బాబుని కోరగా బాబు మాత్రం సత్తెనపల్లి కేటాయించడం సత్తెనపల్లిలో అంబటి రాంబాబు చేతిలో దారుణ పరాజయం పాలయ్యాడు. ఎన్నికల నాడు పోలింగ్ పరిశీలనకు ఇనుమెట్ల వెళ్లిన కోడెల బూత్ తలుపులు వేసి రిగ్గింగ్ కి ప్రయత్నించగా ఇనుమెట్ల గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేసి కోడెల బట్టలు చించివేసి భౌతికంగా గాయపరిచి వెల్లగొట్టటం జరగ్గా అది వైసీపీ కార్యకర్తల పని అని టీడీపీ ఆరోపించగా రాజకీయాలకతీతంగా గ్రామస్తులు అందరూ కలిసి కొట్టారని ప్రాథమిక సమాచారం .

వైసీపీ అధికారంలోకి వచ్చాక గతంలో కే టాక్స్ బారిన పడ్డ పలువురు బయటికొచ్చి కోడెల కొడుకు కూతురు అరాచకాల పై భారీ ఎత్తున ఫిర్యాదులు చేయగా పలు కేసులు నమోదు అయ్యాయి . దరిమిలా కోడెల కొడుకు , కూతురు అజ్ఞాతంలోకి వెళ్లగా కోడెల సైతం తన మకాం హైద్రాబాద్ కి మార్చారు . పులి మీద పుట్రలా ఏపీ అసెంబ్లీ వాటగా హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన అసెంబ్లీ ఫర్నిచర్ మాయమైందని గుర్తించిన ప్రభుత్వం అసెంబ్లీ కార్యదర్శిని వివరణ కోరగా కోడెల తనయుడు చేతివాటం ప్రదర్శించి అసెంబ్లీ ఫర్నిచర్ ని తన షో రూమ్ లో వాడుకొన్న విషయం బయటపడింది .

ఈ ఘటన పై పలు కేసులు నమోదు అవ్వడం , సొంత పార్టీ వారే విమర్శలు గుప్పించడం , వివరణ ఇద్దామంటే బాబు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మరో వైపు ఇంట్లో ఆస్తి వివాదాలు అన్నీ కలిపి కోడెలని తీవ్ర నిర్వేదానికి గురి చేయగా అవమానాలు తట్టుకోలేక ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసి విఫలమైన కోడెల రెండో సారి కూడా ప్రయత్నించి కేబుల్ వైర్ తో బాత్ రూమ్ లో ఉరి వేసుకొని చనిపోయాడు .

డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకొని స్వయంకృషితో రాజకీయాల్లో ఎదిగి పలు వివాదాల్లో మునిగితేలినా రాజసం తగ్గకుండా బతికిన కోడెల చివరికి సంతానం చేసిన నిర్వకాల వలన ఫర్నిచర్ దొంగగా ముద్ర వేయించుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం విషాదం . అప్పటి వరకూ ఫర్నిచర్ దొంగతనం విషయంలో కోడెలని నిందించి కలవటానికి కూడా ఇష్టపడని బాబు , టీడీపీ నేతలు కోడెల మరణాన్ని మాత్రం రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట .

హైదరాబాద్ లో మరణించిన కోడెల భౌతికకాయాన్ని మాచర్ల మీదుగా తీసుకొస్తే చివరి చూపు చూసుకోవచ్చు అని ఆశించిన పలనాడు మొత్తం ఉన్న కోడెల అభిమానులు , సామాజిక వర్గం వారి ఆశలను నిర్వీర్యం చేస్తూ తనకి రాజకీయంగా పట్టున్న కృష్ణా జిల్లా నియోజకవర్గాల మీదుగా శవయాత్ర చేసిన బాబు ఇది సర్కారీ హత్య అని ఆరోపణలు చేసి సానుభూతి పొందే ప్రయత్నం చేయడం బాబు మార్క్ దిగజారుడు అని చెప్పొచ్చు .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp