జ‌గ‌న్ నెక్ట్స్ విజన్ ఇదేనా..!?

By Kalyan.S Aug. 03, 2020, 08:40 am IST
జ‌గ‌న్ నెక్ట్స్ విజన్ ఇదేనా..!?

వైఎస్ఆర్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌ణ‌నీయ‌మైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్ర‌జ‌ల‌కు స‌ర‌ళ‌మైన పాల‌న అందించే దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయి. మునుపెన్న‌డూ జ‌ర‌గ‌ని అభివృద్ధి, ఎన్న‌డూ చూడ‌ని సంక్షేమం అక్క‌డ క‌నిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మూడు రాజధానులకు మార్గం సుగ‌మం కావ‌డంతో ఆ దిశ‌గా ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు సంబంధించి ఇప్పుడు మ‌రో అంశంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అదే అభివృద్ధి మండ‌ళ్ల ఏర్పాటు. మ‌రింత సుల‌భ‌త‌ర‌మైన పాల‌న కోసం ఏపీని నాలుగు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని నిర్ణ‌యించిన‌ట్లు కనిపిస్తోంది. అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలు అందేందుకు ఈ జోన్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఆర్డీఏను రద్దు చేసిన ప్రభుత్వం…ఏఎంఆర్డీఏ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే జోన‌ల్ వ్య‌వ‌స్థ పై కూడా కసరత్తు పూర్తయిందని.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

జీఎన్ రావు క‌మిటీలో జోన్ల ప్ర‌తిపాద‌న

ఏపీలో పాలన వికేంద్రీకరణపై కీలక అధ్యయనాలు చేసిన జీఎన్ రావు కమిటీ తొలిగా జోన్ల ఏర్పాటును సూచించింది. ఉత్తర కోస్తా, మధ్య కోస్తా ప్రాంతాల్లోనే అర్బనైజేషన్ ఎక్కువగా ఉందని, అందువల్ల అభివృద్ధి విషయంలోనూ కోస్తాపై ఒత్తిడి ఎక్కువగా ఉందని, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై మరింత ఫోకస్ పెంచడం ద్వారా ఒకే ప్రాంతంపై ఒత్తిడిని తగ్గించొచ్చని జీఎన్ రావు కమిటీ తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని 4 జోన్లుగా చూడాలని, ఆయా జోన్లలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ అంశానికి జ‌గ‌న్ కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. రాజధాని తరలింపునకు ముందే జోన్ల ఏర్పాటు ప్రక్రియను ముగించాలని భావిస్తున్నార‌ని పేర్కొంటున్నాయి. వికేంద్రీకరణపై ఏర్పాటైన జీఎన్ రావు, బోస్టన్ తదితర కమిటీల సూచనలను కూడా పరిగణలోకి తీసుకుని.. 13 జిల్లాలను 4 జోన్లుగా విభజించాలని నిర్ణయించుకుంది. ఒక్కో జోన్ పరిధిలో ప్రధాన శాఖల రాష్ట్రస్థాయి కార్యాలయాలు, భారీ పరిశ్రమలు నెలకొల్పాలని, తద్వారా ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని సర్కారు భావిస్తున్నది. రాజధాని తరలింపు కంటే మందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటోన్న సీఎం జగన్.. అందుకు సంబంధించిన కసరత్తును చేపట్టినట్లు సమాచారం.

ఆ జోన్లు ఇవే..

ఓ స‌మాచారం ప్ర‌కారం... రాష్ట్రంలోని విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప నాలుగు జోన్లుగా ఏర్పాటు చేసి ఒక్కో జోన్ లోకి మూడు, నాలుగు జిల్లాల‌ను తీసుకురానున్నారు. విజయనగరం జోన్ ప‌రిధిలోకి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఉంటాయి. కాకినాడ జోన్ ప‌రిధిలోకి తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు వ‌స్తాయి. గుంటూరు జోన్ మూడు జిల్లాలు వస్తాయి. అవేమిటంటే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు. రాయ‌ల‌సీమ‌ను కడప జోన్ గా ప్ర‌క‌టించి ఆ ప‌రిధిలోకి నాలుగు జిల్లాలు చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప ఉంటాయి. కొత్త‌గా ఏర్పాట‌య్యే నాలుగు జోన్లు వేటికవే ప్రత్యేకంగా నిలబడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా జోన్లలోని ప్రత్యేకత పరిస్థితులు, అక్కడ అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాల దృష్ట్యా వేర్వేరు వ్యూహాలను జగన్ సర్కారు సిద్ధం చేస్తోంది.

జోన్ల చైర్మన్లకు మంత్రి హోదా..

ఏపీ సర్కారు కొత్తగా ఏర్పాటు చేయనున్న నాలుగు జోన్ల పర్యవేక్షణ కోసం భారీ వ్యూహ ర‌చ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒక్కో జోన్ కు ఒక్కో బోర్డు ఏర్పాటు చేసిన వాటికి చైర్మన్ తోపాటు ఏడుగురు సభ్యులు ఉండేలా కమిటీ ఉంటుందని, ఆయా జోన్ల చైర్మన్లకు కేబినెట్ ర్యాంకు హోదా కూడా కల్పించబోతున్నారని స‌మాచారం. మంత్రి పదవితో సమానంగా జోన్ల చైర్మన్లను ట్రీట్ చేయబోతున్నారన్న సమాచారం. దీని ద్వారా ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీ అవ‌కాశం ఉంటుంది. మ‌రోవైపు.. మ‌రి కొంద‌రికి ప‌ద‌వులు ద‌క్కుతాయి. మంత్రి పదవులు ఆశించి, చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన ఎమ్మెల్యేలు, గతంలోనే జగన్ నుంచి మాట పొందిన ఇతర కీలక నేతలకు ఈ పదవులు ద‌క్కే అవ‌కాశాలు ఉంటాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp