ప్రాణ వాయువు నిలిచింది - ప్రాణాలు తీసింది

By Rishi K May. 11, 2021, 08:02 am IST
ప్రాణ వాయువు నిలిచింది - ప్రాణాలు తీసింది

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ట్యాంక్‌లో ఆక్సిజన్ నిండుకోవడంతో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ అందక 11 మంది మృత్యువాత పడ్డారు. అధికారులు హుటాహుటిన స్పందించి ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించడంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రమాదం ఎలా జరిగింది?

రుయా ఆసుపత్రిలో సుమారు వెయ్యి మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 135 మంది ఐసీయూ వార్డులో చికిత్స పొందుతుండగా మరో 465 మంది ఆక్సిజన్‌ పడకలపై ఉన్నారు. 163 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి ఆవరణలోనే 11వేలలీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఉంది. ఈ ట్యాంక్‌ నుండి ఆస్పత్రిలోని వెంటిలేటర్‌, ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లకు ప్రాణవాయువు సరఫరా అవుతుంది. కాగా ట్యాంక్‌లోని ఆక్సిజన్ నిల్వలు తగ్గినట్లు గుర్తించిన సిబ్బంది ముందుగానే అధికారులకు సమాచారం అందించారు. దాంతో అధికారులు చెన్నైలోని లిండేన్‌ కంపెనీకి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ తీసుకురావాలని చెప్పడంతో సాయంత్రం నాలుగు గంటలకు చెన్నైనుండి ఆక్సిజన్ ట్యాంకర్ బయలుదేరింది.

కాగా రుయా ఆసుపత్రిలోని ఆక్సిజన్ ట్యాంక్ లో ఆక్సిజన్ నిల్వలు తరిగిపోవడంతో ప్రెజర్ తగ్గి సరఫరాలో అంతరాయం ఏర్పడంతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక విలవిల్లాడిపోయారు. దీంతో వారి ప్రాణాలను నిలబెట్టేందుకు ఆసుపత్రి సిబ్బంది పరుగులు తీశారు. దీంతో ఆసుపత్రి వార్డుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆక్సిజన్ సిలిండర్ల సహకారంతో బాధితుల ప్రాణాలను నిలిపేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఆక్సిజన్ ట్యాంకర్ గంటకు 40 కిలోమీటర్లకు మించి వేగంగా వెళ్లకూడదని నిబంధనలు ఉండటం వల్ల ఆక్సిజన్ ట్యాంకర్ కాస్త ఆలస్యంగా ఆసుపత్రికి చేరుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 11 మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక మృతిచెందారు. ఆక్సిజన్ ట్యాంకర్ రావడంతోనే అధికారులు వెంటనే ట్యాంక్ లో ఆక్సిజన్ నింపి సరఫరాను పునరుద్ధరించారు.
కాగా ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రుయా ఆస్పత్రి అధికారులు, ఎంపీ గురుమూర్తి, కలెక్టర్‌ హరినారాయణన్, కమిషనర్‌ గిరీష, ఎస్పీ వెంకట అప్పలనాయుడు, మేయర్‌ శిరీష, జేసీ వీరబ్రహ్మం, ఆర్డీవో కనక నరసారెడ్డి, ఇతర అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి అదుపులోకి తెచ్చారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్

రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని తెలుసుకున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. కోవిడ్‌ బాధితుల సహాయం కోసం తక్షణమే సహాయకచర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని ఆక్సిజన్ టాంకర్ ఆలస్యంగా రావడం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి వెల్లడించారు. ప్రమాదంపై విచారణ జరుగుతుందని ఎవరైనా దోషులుగా తేలితే కఠినంగా శిక్షిస్తామని ఎంపీ గురుమూర్తి తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp