కొండ చిలువ‌ని ప‌రుగెత్త‌లేదామె...ఏం చేసిందంటే?

By Sodum Ramana 20-11-2019 11:53 AM
కొండ చిలువ‌ని ప‌రుగెత్త‌లేదామె...ఏం చేసిందంటే?

స‌హ‌జంగా మ‌న‌ల్ని ఎవ‌రైనా భ‌య‌పెట్టాల‌నుకుంటే...వామ్మో పామ‌ని గ‌ట్టిగా అరుస్తుంటారు. అవ‌త‌లి మ‌నిషి చెప్పిన చోట పాముందో, పులే ఉందో అని మ‌నం ఏ మాత్రం చూసుకోం. ముందు ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ఒక్కసారిగా శ‌క్తినంతా కూడ‌దీసుకుని జంప్ చేస్తాం. ఊపిరి ఉంటే ఉప్పైనా బ‌తుకుతామ‌నే సామెత చావు అంచుల దాకా మ‌నిషి పోయిన‌ప్పుడే పుట్టిందే. కొంద‌రు ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌లేని వారుంటారు. భ‌య‌మ‌నేది వాళ్ల ఒంట్లో ఉండ‌దు. అలాంటిది ఓ మ‌హిళ సాహ‌సం చేస్తే....ఆ సాహ‌స వ‌నిత గురించే తెల్సుకుందాం.

చిత్తూరు జిల్లా పాల‌స‌ముద్రం మండ‌లంలో దీన‌బంధుపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామ రైతు చంద్ర‌న్ త‌న పొలంలో చెర‌కు సాగు చేశాడు. చెర‌కు పంట కోత‌కు వ‌చ్చింది. పంటను న‌రికేందుకు కూలీలు వ‌చ్చారు. చెర‌కు గ‌డెల‌ను న‌రికేందుకు సిద్ధ‌మ‌వుతున్న కూలీల‌కు సుర్రు సుర్రుమంటున్న అలికిడి చెవుల‌కు సోకింది. మొద‌ట్లో వారంతా పామై ఉంటుంద‌ని అనుమానించారు.తీరా అది పాము కాదు కొండ‌చిలువ‌ని గుర్తించి ప్రాణ‌భ‌యంతో ఒక్క‌సారిగా త‌లో దిక్కుకు ప‌రుగులు తీశారు. కొండ చిలువ మ‌నుషుల‌ను సైతం మింగుతుంద‌నే విష‌యం తెలిసిందే. అయితే వారిలో అదే గ్రామానికి చెందిన సునంద అనే మ‌హిళ కొండ‌చిలువ అయితే నాకేంటి?  డోంట్ కేర్ అన్న‌ట్టు...దాని అంతు చూసేందుకు ముందుకు వ‌చ్చింది.కొండచిలువ ఉడ‌త ఊపులు ఆ మ‌హిళ ముందు ఏ మాత్రం ప‌నిచేయ‌లేక‌పోయాయి. కొంత మంది మ‌గ‌వాళ్ల సాయంతో ఆమె కొండ చిలువ తోక‌ను ప‌ట్టుకుని పొలం నుంచి బ‌య‌ట‌కు తీసింది. ఈ విష‌య‌మై పోలీసులు, అట‌వీ అధికారుల‌కు స్థానికులు స‌మాచారం ఇచ్చారు.పోలీసులు, అట‌వీ అధికారులు వ‌చ్చి కొండ‌చిలువ‌ను తీసుకెళ్లి అట‌వీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అయితే కొండ‌చిలువంటే బొమ్మ‌ను ఆడుకున్న‌ట్టుగా తోక‌ను ప‌ట్టుకుని ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించిన సునంద‌ను ప్ర‌తి ఒక్క‌రూ అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోయారు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News