శతాబ్దం క్రితం ప్రపంచమంతా మరణమృదంగం మోగించిన స్పానిష్ ఫ్లూ

By Sannapareddy Krishna Reddy Mar. 04, 2021, 08:15 pm IST
శతాబ్దం క్రితం ప్రపంచమంతా మరణమృదంగం మోగించిన  స్పానిష్ ఫ్లూ

మార్చి 4,1918న అమెరికాలో, కాన్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్ రైలీ మిలిటరీ ఆసుపత్రికి ఆల్బర్ట్ గిచ్చెల్ అనే సైనికుడు జలుబు, జ్వరం, తలనొప్పి, వొళ్లు నొప్పులతో వచ్చినప్పుడు అక్కడ డాక్టర్లు అది రోటీన్ గా వచ్చే ఇన్ ఫ్లుయెంజా అనుకున్నారు కానీ ప్రపంచమంతా వ్యాపించి, కోట్ల మంది ప్రాణాలు తీయబోయే భయంకర మహమ్మారి తొలి అడుగు అని ఊహించలేదు. అదే రోజు మధ్యాహ్నం కల్లా ఆ ఆర్మీ క్యాంపులో అవే లక్షణాలతో మరో వందమంది ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లో అమెరికా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ క్యాంపుల్లో కొన్ని వేలమంది ఇవే లక్షణాలతో ఆసుపత్రులలో చేరారు.

అవి మొదటి ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉన్న రోజులు. ఈ సైనికులు చాలా మంది పూర్తిగా కోలుకోకుండానే యుద్ధం చేయడానికి యూరప్, ఆసియా, ఆస్ట్రేలియాలకు వెళ్తూ తమవెంట తమ జబ్బుని కూడా తీసుకెళ్లారు. ఆనెలలోనే దాదాపు రెండు లక్షల మంది సైనికులు అమెరికా నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యుద్దరంగాలకు తరలివెళ్ళారు. వీరిలో చాలా మంది తమతోకూడా ఈ కొత్తరకం ఫ్లూ వైరస్ ని కూడా తీసుకెళ్లారు. జూన్ లోనే బ్రిటన్ లో 31వేల కేసులు నమోదయ్యాయి. తర్వాత రోజుల్లో స్పానిష్ ఫ్లూ అని పేరు తెచ్చుకున్న ఈ మహమ్మారి తనపర బేధం లేకుండా అన్ని దేశాలవారినీ కాటువేసింది. అప్పటికే యుద్ధంలో ఓటమికి చేరువలో ఉన్న జర్మనీ, దాని మిత్ర దేశాలకు చెందిన సైనికులమీద మరింత తీవ్ర ప్రభావం చూపింది. సరైన ఆహారం, ఔషధాలు అందక వీరిలో మరణాల శాతం బాగా ఎక్కువగా ఉన్నది.

ఒక్కోచోట ఒక్కో పేరు
ఈ మహమ్మారికి స్పానిష్ ఫ్లూ అని పేరు వచ్చినా ఇది స్పెయిన్ లో మొదలైన జబ్బు కాదు. ఆమాటకొస్తే ఈ వైరస్ ఎక్కడ మొదలైందో నిపుణులు కనిపెట్టలేకపోయారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో దాదాపు అన్ని దేశాలలో వార్తాపత్రికల మీద సెన్సార్ షిప్ ఉండేది. వేలాది మంది ఫ్లూ బారిన పడి మరణిస్తున్న విషయం బయటపడితే ప్రజలు భయాందోళనకు గురవుతారని చాలా దేశాలు ఆ వార్తలు బయటకు రానివ్వకుండా తొక్కిపట్టాయి. అయితే స్పెయిన్ యుద్ధంలో పాల్గొనలేదు కాబట్టి ఆ దేశ పత్రికలలో ఫ్లూ మరణాలు గురించి వార్తలు వచ్చేవి. దాంతో అప్పట్లో చాలా మంది స్పెయిన్లో ఈ మహమ్మారి తీవ్రంగా ఉందన్న అపోహతో దీన్ని స్పానిష్ ఫ్లూ అని పిలవసాగారు.


అయితే ఆఫ్రికా లోని సెనెగల్ దేశంలో ఈ జబ్బుని బ్రెజిలియన్ ఫ్లూ అని పిలిస్తే బ్రెజిల్ వాళ్ళు జర్మన్ ఫ్లూ అన్నారు. పోలాండ్ లో బోల్షివిక్ ఫ్లూ అని పిలిస్తే, స్పెయిన్లో ఒక నాటకంలో ఎవరు కనిపిస్తే వారిని పట్టి పీడించే ఒక నాటకంలోని పాత్ర ఆధారంగా నేపుల్స్ సోల్జర్ అని పిలిచారు. బొంబాయి ఓడరేవులో ఆగిన ఓడలు, అందులో ప్రయాణించిన పాసెంజర్ల ద్వారా వచ్చిన జబ్బు కాబట్టి ఇండియాలో బొంబాయి ఫ్లూ అనీ, బొంబాయి జ్వరం అనీ పేర్లు వచ్చాయి. అయితే ఎక్కువగా స్పానిష్ ఫ్లూ అనే పేరే స్థిరపడిపోయింది ఈ మహమ్మారికి.

పిట్టల్లా రాలిపోయిన జనం
స్పానిష్ ఫ్లూ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం చేసి, మృత్యుఘంటికలు మోగించింది. అప్పట్లో సరైన గణాంకాలు లేకపోయినా కొన్ని అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్ల మంది ఈ జబ్బు బారిన పడి ఉంటారని, రెండు నుంచి అయిదు కోట్ల మంది మరణించి ఉంటారని నిపుణులు తేల్చారు. కొందరు మరణాల సంఖ్య పది కోట్ల వరకూ ఉంటుందని లెక్కలు కట్టారు.

మొత్తం మీద అప్పుడే ముగిసిన మొదటి ప్రపంచ యుద్ధం కన్నా స్పానిష్ ఫ్లూ వలన మరణించినవారి సంఖ్య ఎక్కువగా ఉంది.
సాధారణంగా ఇలాంటి మహమ్మారులు చిన్న పిల్లలు, వృద్ధులలో మరణాలు ఎక్కువగా కలుగజేస్తాయి. అయితే స్పానిష్ ఫ్లూ వలన ఎక్కువగా యువకులు మరణించారు. ప్రపంచ యుద్ధం చివరి రోజులు కావడం వలన సైనికులకు వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉండటం, సుదీర్ఘ కాలం పాటు యుద్ధరంగంలో ఉండటం వలన పోషకాహార లోపం ఇందుకు కారణం అని నిపుణులు తేల్చారు.

భారతదేశంలో విలయతాండవం

బొంబాయి ఓడరేవు ద్వారా భారతదేశంలో అడుగు పెట్టిన స్పానిష్ ఫ్లూ అతి తక్కువ కాలంలోనే దేశం నలుచెరగులా వ్యాపించింది. మొదటగా బొంబాయిలో వచ్చింది కాబట్టి దీన్ని బొంబాయి ఫ్లూ, బొంబాయి జ్వరం అని పిలిచారు. అంతంత మాత్రంగానే ఉన్న ప్రజారోగ్య వ్యవస్థ మీద అంతులేని భారం మోపింది ఈ మహమ్మారి. అదే సమయంలో రుతుపవనాలు కూడా మొహం చాటేయడంతో నెలకొన్న ఆహార లోపం, కరువు పరిస్థితులు మరణాల సంఖ్య ఎక్కువ కావడానికి కారణం అయ్యాయి.

ఒక అంచనా ప్రకారం భారత దేశ జనాభాలో దాదాపు అయిదు శాతం అంటే కోటీ డెభ్బై లక్షల నుంచి, కోటీ ఎనభై లక్షలు మంది స్పానిష్ ఫ్లూ బారిన పడి మృతి చెందారు. భారత దేశంలో జనాభా లెక్కలు ప్రారంభించిన తరువాత ఒకే ఒక్కసారి 1911 నుంచి 1921 లెక్కల మధ్య మాత్రమే జనాభా తగ్గుదల కనిపించింది. దానికి కారణం స్పానిష్ ఫ్లూ.

ఎక్కడ పడితే అక్కడ ఉన్న శవాలను తగలబెట్టడానికి కట్టెలు కూడా దొరకని పరిస్థితిలో చాలా మంది శవాలను నదుల్లో పడేశారు. ప్రతిరోజూ గంగానది కొన్ని వేల శవాలను బంగాళాఖాతంలో కలిపింది.

ఒకదాని మీద మరొకటిగా మూడు సార్లు
మార్చి 1918 లో మొదలైన స్పానిష్ ఫ్లూ మొదటి వేవ్ కొంచెం అదుపులోకి వస్తుఓదనుకొనే లోగా మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో సైనికులందరూ వారి వారి స్వదేశాలకు వెళ్తూ ఈ వైరస్ ని కూడా వెంటబెట్టుకొని వెళ్ళారు. దాంతో అదే సంవత్సరం అక్టోబర్ లో సెకండ్ వేవ్, నవంబర్ లో థర్డ్ వేవ్ మరణాలు సంభవించి, మొదటివిడతలో తప్పించుకున్న ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా స్పానిష్ ఫ్లూ వ్యాపించింది.

సరైన మందులు, వైద్య విధానాలు లేని రోజులు కాబట్టి అప్పట్లో స్పానిష్ ఫ్లూ, ప్లేగ్, కలరా లాంటి మహమ్మారులు ప్రపంచమంతా మరణమృదంగం మోగించాయి కానీ అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఈ రోజుల్లో అలా జరిగే అవకాశం లేదని అనుకొంటున్నవారి భ్రమలు తొలగేలా ఇప్పుడు కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దీంతో పోరాటానికి మాస్కులు, క్వారంటైన్, భౌతిక దూరం లాంటి శతాబ్దం పూర్వం నాటి విధానాలే ఇప్పుడూ వాడాల్సి వస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp