నయన మనోహరం... కోనసీమ ప్రభల తీర్థం...

By Prasad Jan. 15, 2022, 06:00 pm IST
నయన మనోహరం... కోనసీమ ప్రభల తీర్థం...

రంగురంగుల ముగ్గులు.. హరిదాసు కీర్తనలు.. బసవన్నల పొగడ్తలు.. భోగి మంటలు.. పిండివంటలు.. కోడిపందేలు.. ఇవే కాదు... సంక్రాంతి అంటే ప్రభల తీర్థాలు కూడా. ఈ తీర్థాలకు పైరుపచ్చని కోనసీమ వేదిక. ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలల్లో ప్రభల తీర్థాలు ఒకటి. సంక్రాంతి నాడు ఆరంభమై ముక్కనుమ వరకు కోనసీమలో వివిధ ప్రాంతాల్లో 90 వరకు తీర్థాలు జరుగుతాయి. తీర్థాల నిర్వహణ వెనుక పురాణ, ఆధ్యాత్మిక ఆధారాలు, చరిత్ర ఉంది. నాటి రాజుల కాలంలోను.. ఆ తరువాత బ్రిటీష్‌ కాలంలోను.. నేటి ప్రజా పాలనలోను ఈ తీర్థాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. కోనసీమలోని అంబాజీపేట మండలం జగన్నతోట, కొత్తపేట, మామిడికుదురు మండలం కొర్లగుంట, కాట్రేనికోన శివారు వేట్లపాలెం వద్ద జరిగే ప్రభల తీర్థాలు అతి పెద్దవి. ఇక్కడ తీర్థాలకు సుమారు 20 వేల నుంచి 50 వేల మంది వరకు ప్రజలు హాజరవుతారని అంచనా.

ప్రభ వీరభద్రునికి ప్రతిరూపం. దీనిపై వివిధ రూపాల్లో ఉన్న పరమేశ్వరులు అధిరోహించి లోకకల్యాణార్ధం సమావేశమవుతారని, అది సంక్రాంతి సమయంలో జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కారణంగానే ప్రభపై ఆయా గ్రామాలలోని ఆలయాల్లో కొలువైన పరమేశ్వరుని ప్రతిరూపాలను ఉంచి ఊరేగింపుగా తీర్థాలకు తీసుకుని వస్తారు. అంబాజీపేట మండలం జగన్నతోట తీర్థానికి ఐదు శతాబ్ధాల చరిత్ర ఉంది. ఈ తీర్థం నాలుగు గ్రామాల సరిహద్దులో ఉన్న ఒక కొబ్బరితోటలో జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి గుడి, గోపురం ఉండదు. కనీసం దేవుని ప్రతిరూపం కూడా ఉండదు. కాని ఇక్కడ ఐదు శతాబ్ధాలుగా తీర్థం  జరుగుతుంది. సమీపంలోని 11 గ్రామాలకు చెందిన ప్రభలు ఈ తీర్థానికి వస్తాయి. ఇక్కడ జరిగే తీర్థానికి ఎన్‌ఆర్‌ఐలు, ఇతర ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగాలు కోసం వెళ్లిన వారు కుటుంబ సమేతంగా తరలివస్తారు. ఉన్నత కుటుంబాలకు చెందినవారు సైతం గూడెడ్ల బండ్ల మీద తీర్థానికి వస్తుంటారు. కొత్తపేటలో సంక్రాంతి పండగ నాడు తీర్థం జరుగుతుంది. ఇక్కడ రాత్రివేళల్లో రూ.లక్షల విలువ చేసే బాణసంచా కాలుస్తారు. మిగిలిన ప్రాంతాల్లో తీర్థాలు కనుమ, ముక్కనుమ రోజున నిర్వహిస్తారు.

ప్రభలు చాలా పెద్దవిగా ఉంటాయి. వీటి ఎత్తు 30 నుంచి 40 అడుగులకు పైబడి ఉంటుంది. అంబాజీపేట మండలం వాకలగరువులో జరిగే తీర్థానికి 43 అడుగుల నుంచి 45 అడుగుల ఎత్తున ఉన్న ప్రభలు వస్తుంటాయి. తాటి శూలం... టేకు చెక్క, పోక చెట్ల పెంటికలు, మర్రి ఊడలు, వెదురు బొంగులతో ప్రభను తయారు చేస్తారు. ఇది ‘‘యూ’’ ఆకారంలో ఉంటుంది. ఇవి కనీసం టన్ను నుంచి టన్నున్నర బరువు ఉంటుంది. సుమారు 50 మంది నుంచి 100 మంది వరకు భక్తులు, ప్రభల నిర్వాహకులు వీటిని భూజాల మీద మోసుకుని తీర్థానికి వస్తారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ప్రభను మోసేందుకు పోటీ పడతారు. తీర్థాలకు వచ్చే దారిలో కొబ్బరి తోటలు, వరిచేలు, రోడ్లు, పంట బోదెలు, కాలువులు ఉన్నా వాటిని దాటించి తీర్థానికి ప్రభను మోసుకువచ్చే తీరు నభూతో... అనే రీతిలో సాగుతుంది. 

ప్రభలు సైతం సప్తవర్ణాల ఇంద్రధనస్సులా కనిపిస్తాయి. రంగురంగుల నూలు దారాలతో అల్లికలు చేస్తారు. కొత్త వస్త్రాలతో అలంకరిస్తారు. ప్రభల పై భాగంలో పసిడి కుండ ఉంచి, చుట్టూ నెమలిపించాలను కడతారు. దిగువ భాగంలో జే గంటలు కడతారు. రైతులు తమ పొలాల్లో పండిన వరి కంకులను, కూరగాయలను ప్రభలకు తగిలిస్తారు. 20 అడుగుల వెడల్పు, కనీసం 30 అడుగుల ఎత్తు ఇలా ముస్తాబయ్యే ప్రభను చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రభలు వీధుల మీద నుంచి చేలు, తోటల మీద నుంచి వెళుతుంటే నింగిన ఉండే ఇంద్రధనస్సు నేలన నడియాడినట్టు ఉంటుంది.

గత ఏడాది ఈ తీర్థాల ప్రాముఖ్యతను తెలుసుకున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్వాహకులకు అభినందనలు తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ఈ తీర్థాలు జాతీయ స్థాయిని ఆకర్షించాయి. ఈ ఏడాది కరోనా ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య పెరుగుతుండడం వల్ల తీర్థాలకు జనం తగ్గే అవకాశముందని నిర్వాహకులు భావిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp