గోదావరి పల్లెల్లో.... సంక్రాంతి శోభ

By Prasad Jan. 14, 2022, 04:57 pm IST
గోదావరి పల్లెల్లో.... సంక్రాంతి శోభ

ప్రకృతి అందాలు... పచ్చని పల్లె వాతావరణంతో అలరారే గోదావరి జిల్లాలు సంక్రాంతి శోభతో తుళ్లిపడుతున్నాయి. సీజన్‌లో వచ్చే కొల్లేరు వలస పక్షులలాగా పండగ నాడు సొంతగ్రామాలకు వచ్చిన వలసదారులతో పల్లెల్లో కొత్త సందడి నెలకొంది. ఇళ్లకు వేసిన రంగులు.. వీధుల్లో వేసిన పేడ కల్లాపులు.. ముత్యాల ముగ్గుల లోగిళ్లతో పైరు పచ్చని గ్రామాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. కుటుంబ సభ్యులు.. బంధు మిత్రులు.. కొత్త అల్లుళ్ల రాకతో గోదావరి జిల్లాల్లో కొత్త సందడి నెలకొంది. పండగ చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసివచ్చిన వారి స్నేహితులకు గోదావరి ఆతిథ్యం రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల పండుగకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ముస్తాబవుతున్నాయి.

రణగొణ ధ్వనులు.. అప్యాయతానురాగాలకు.. మమకారంతో పిలిచే పిలుపులకు దూరమై.. పట్టణాల్లో యాంత్రిక జీవనానికి అలవాటు పడినవారికి పల్లె జీవనం స్వర్గాన్ని తలపిస్తోంది. అందుకే సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు పట్టణ జీవనం నుంచి విశ్రాంతి పొందేందుకంటూ పల్లెబాట పడుతుంటారు. వత్తిడికి దూరంగా తల్లివడిలో పసికూనలా ఒదిగిపోయేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు వంటి మహా నగరాల్లోనే కాదు.. ఉపాధి, ఉద్యోగాల కోసం అమెరికా వంటి దేశాలకు వెళ్లినవారు సైతం సొంత గ్రామాలకు రావాలంటే వారికి గుర్తుకు వచ్చేది సంక్రాంతి పండగే.

ముఖ్యంగా ఇలా వచ్చేవారి సంఖ్య గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పండగ జరిగే తీరు... తీర్థాలు.. పందేలు వంటివి చూసేందుకు వస్తుంటారు. బస్సు, రైల్వే టిక్కెట్లు నిండుకున్నా.. ధరలు రెట్టింపు చేసినా కొంతమంది లెక్క చేయకుండా తమ స్వగ్రామాలు చేరారు. మరికొంతమంది సొంత వాహనాల్లో ఇళ్లకు వచ్చారు. వీరి రాకతో ఉద్యోగం.. ఉపాధి.. ఉన్నత విద్యల కోసం వలసపోయినవారితో ఏడాదంతా బోసిపోయిన గోదావరి పల్లెల్లో సందడి ఎగిసిపడుతోంది. సాధారణంగా భోగికి ఒక రోజు ముందు.. లేదా భోగి రోజున వస్తుంటారు. గత శనివారం 8వ తారీఖు రెండవ శనివారం సెలవు కావడం.. పండగ ఆదివారంతో ముగిసిపోతుండడంతో ఈసారి చాలా మంది ఆదివారమే ఇళ్లకు చేరారు. సెలవు దొరకనివారు గురు,శుక్రవారాల్లో తరలివస్తున్నారు.

ఇళ్లకు వచ్చిన కొడుకులు.. కోడళ్లు. మనవులు.. మనుమరాండ్రులు, ముని మనవులు. బాబాయ్‌. పిన్నిలు. పెదనాన్న.. పెద్దమ్మలు. అత్తలు.. మామలు. అక్కలు.. బావలు రావడంతో స్థానికుల్లో హుషారు వచ్చింది. కొత్త అల్లుళ్ల సందడే.. సందడి. భోగి మంటల కోసం పిల్లలు, యువకులు, పెద్దలు కొబ్బరి, ఇతర చెట్ల దుంగలు, ఇళ్లల్లోని పాత కలప పిడకలు, డొక్కలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల వారి హడావిడి అంతాఇంతా కాదు. 

ఆతిథ్యంలో గోదావరి జిల్లాకు పెట్టింది పేరు. ఇక్కడ తయారు చేసే పిండివంటలు, సున్నుండలు, పోకుండలు, జంతికలు, ఇలంబీకాయలు, కొబ్బరి నూను, వెన్నప్పాలు, గోరుమిటీలు, పొంగడాలు నోరూరిస్తాయి. గత వారం రోజులుగా వీటి తయారీలో స్థానిక మహిళలు నిమగ్నమయ్యారు. ఇక గోదావరి జిల్లాల్లో మాంసాహార వంటకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

సాధారణ రోజుల్లోనే ఇక్కడ వంటలు అదరహో అన్నట్టు ఉంటాయి. ఇక పండగ నాడు వంటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. ఉల్లి గారెలు..నాటు కోడి ఇగరు, మాంసం, రొయ్యలు, చేపలు, పీతలతో తయారు చేసే వంటకాల రుచిగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరీ ముఖ్యంగా పందేలు పెద్ద ఎత్తున జరుగుతున్నందున ‘కోస’ మాంసం సైతం ఈ మూడు రోజులు ఘుమఘుమలాడనున్నాయి. కోర్టు ఆంక్షలున్నా పందేలకు బరులు సిద్ధమయ్యాయి. రెండు జిల్లాల్లో పందేల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమాన ఐ.భీమవరం, భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తూర్పున కోనసీమ, సామర్లకోట మండలం వేట్లపాలెం వంటి గ్రామాల్లో పందేలు పెద్ద ఎత్తున జరగనున్నాయి.

గతంతో పోల్చుకుంటే కరోనా ఒమిక్రాన్‌ కారణంగా ఈ ఏడాది స్వగ్రామలకు వచ్చేవారు చాలా తక్కువ ఉంటారని, తీర్థాలు, పందేలు జరగవని స్థానికులు చెబుతున్నారు. కరోనా వచ్చిన తరువాత గత ఏడాది సంక్రాంతి పండగ జరిగినా అప్పట్లో కరోనా పెద్దగా లేదు. తరువాత డెల్టా విజృంభించింది. అయితే ఈసారి సరిగ్గా పండగ ముందు ఒమిక్రాన్‌ కేసులు పెరగడం వల్ల ఆ ప్రభావం పండగ మీద పడే అవకాశముందని అంచనా వేశారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వలసదారులను చూస్తుంటే గోదావరి జిల్లాల్లో పండుగ జోరుగా సాగనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp