సర్ప యాగం - ఒక వాస్తవ కథ -ఒక తండ్రి తీర్పు

By Guest Writer 01-12-2019 04:28 PM
సర్ప యాగం - ఒక వాస్తవ కథ -ఒక తండ్రి తీర్పు

ఒంగోలు ఈ పేరు వింటే చిల్లర రౌడీయిజం గుర్తొస్తుంది. 80 వ దశకం చివరలో 90 వ దశకం సగం వరకు బీరు-బిర్యానికి మర్డర్ జరిగే రోజులు..శర్మ కాలేజీ -ఎలక్షన్లు-రౌడీయిజం-మర్డర్లు ఇవే అప్పటి కబుర్లు. ఇలాంటి సందర్భంలో ఒంగోలులో అనుమానాస్పదంగా కనపడకుండా పోయిన కేసుల నమోదయ్యాయి.సినిమాకు సరిపడ కధ ఉంది.ప్రతీకార హత్యలకు ఆమోదం లభించిన సంఘటన ఇది.

ఒంగోలు లో కోదండరామిరెడ్డి అని టిప్ -టాప్ డ్రై క్లీనింగ్ నడుపుతుండేవారు..తన కూతురును అల్లారు ముద్దుగా పెంచి కాస్త ఉన్నత భావాలతో ఆటలు కూడా నేర్పిస్తూ ఉండేవారు.ఇలాంటి సందర్భంలో హైదరీ క్లబ్ల్ లో పరిచయమైన టెన్నిస్ కోచ్ మాటలు నమ్మిన టిప్ టాప్ రెడ్డి కూతురు తనతో కలసి కొత్తపట్నం సముద్ర తీరానికి వెళ్ళింది.ఆ కోచ్ తన మిత్రుల తో కలసి ఆడకూతురును అఘాయిత్యం చేశారు.అది జరిగిన నాలుగు రోజులకు ఆ అమ్మాయి జరిగిన సంఘటన గురించి,తనను పాడు చేసిన వారిని వదల వద్దని కోరుతూ తండ్రికి ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంది.ఆ ఉత్తరం చదివిన తండ్రి హృదయం ద్రవించింది.

జనమేజయిడు తన తండ్రి మరణానికి కారణమైన వారి కోసం సర్పయాగం చేసినట్లు కోదండరామరెడ్డి సర్పయాగం మొదలు పెట్టారు. గుంటూరుకు వెళ్లి తన ప్రతీకారాన్ని సహాయపడగల వాళ్ళకోసం అన్వేషించి ఇద్దరు యువకులను ఎంచుకున్నాడు. ఆ ఇద్దరు అప్పటి వరకు ఎలాంటి నేరాలకు పాల్పడలేదు.టిప్ టాప్ రెడ్డి కూతురికి జరిగిన అన్యాయం వారిని కదిలించింది.

Also Read : మృగాలను ప్రశ్నించిన అస్త్రం - సర్పయాగం

టిప్ టాప్ రెడ్డి ఆ ఇద్దరు యువకులను ఒంగోలు తీసుకొచ్చి తన కూతురి ఆత్మహత్యకు కారణమైన వారితో స్నేహం చేయించారు.ఆ మృగాలలో నిజంగా అఘాయిత్యం చేసిన వారెవరూ అసలు దోషులెవరూ అని ఆ యువకులు కనిపెట్టారు.వారిలో ముగ్గురు దోషులుగా తెలుసుకోని యాగం మొదలుపెట్టారు.

మొదటివాడు టెన్నిస్ కోచ్ ,ఆతను కానిస్టేబుల్ సెలక్షన్లకు ఎంపికై దర్శిలో శిక్షణకు బయలుదేరాడు.టిప్ టాప్ రెడ్డి నియమించిన ఇద్దరు యువకులు టెన్నిస్ కోచ్ ని స్కూటర్ మీద ఎక్కించుకొని ఒంగోలు నుంచి దర్శికి బయలుదేరారు. ముందస్తు ప్రణాళిక ప్రకారము టిప్ టాప్ రెడ్డి ఒక చోట గుంత తీసి సిద్ధంగా ఉన్నాడు.ఆ ప్రదేశానికి వచ్చిన వెంటనే ఆ యువకులు స్కూటర్ ను ఆపారు,టిప్ టాప్ రెడ్డి టెన్నిస్ కోచ్ గొంతుకు తీగ బిగించి చంపాడు. ముగ్గురు కలిసి హతుడిని గుంటలో పూడ్చి ఒంగోలు వెళ్లిపోయారు. హతుడి తల్లితండ్రులు తమ కొడుకు దర్శి పోలీస్ ట్రైనింగ్లో ఉన్నాడని భావించటంతో ఈ హత్య బయటకు రాలేదు.

టిప్ టాప్ రెడ్డి టార్గెట్ లో రెండవ వాడు RTC డిపో మేనేజర్ కొడుకు.అతను కావలి జవహర్ భారతి కాలేజిలో చదువుతుండేవాడు.టిప్ టాప్ రెడ్డి నియమించిన ఇద్దరు యువకులు అతనితో మందు పార్టీలు చేసుకుంటూ స్నేహం పెంచుకున్నారు.టిప్ టాప్ రెడ్డి నియమించిన యువకులు ఒకరోజు డిపో మేనేజర్ కొడుకుని పార్టీ చేసుకుందామని ఒత్తిడి చేసి తీసుకెళ్లారు. డిపో మేనేజర్ కొడుకు రూమ్ మేట్స్ రేపు పరీక్షలు పెట్టుకొని ఇప్పుడెందుకు వెళుతున్నావని వారించినా వినకుండా అతను కరేడు సముద్ర తీరానికి పార్టీ కోసం వెళ్లి మళ్ళి తిరిగి రాలేదు.

Also Read: నీ కన్నా,నీ భద్రత కన్నా,నీ ప్రాణం కన్నా మాకు ఏదీ ముఖ్యం కాదు --ఇదీ చెప్పవలసిన మాట

తన కొడుకు కనపడటం లేదని RTC డిపో మేనేజర్ గొడవ చెయ్యటంతో పోలీసులు సీరియస్ గా విచారణ మొదలుపెట్టారు.టిప్ టాప్ రెడ్డి నియమించిన యువకులు,హతుడిని తీసుకెళ్లిన స్కూటర్ నెంబర్ ను హతుడి రూమ్ మేట్ గుర్తు పెట్టుకొని పోలీసులకు చెప్పటంతో పోలీసులు తీగ లాగితే టిప్ టాప్ రెడ్డి విషయం వెలుగులోకి వచ్చింది.

టిప్ టాప్ రెడ్డి పోలీసులకు తన కూతురి ఆత్మహత్య గురించి,తానూ చంపించిన ఇద్దరి గురించి పోలీసులకు చెప్పాడు. మూడో వాడ్ని కూడా చంపటానికి అవకాశం ఇవ్వమని పోలీసులను వేడుకోవటం,ప్రలోభపెట్టే ప్రయత్నం కూడా చేశాడు. మొత్తానికి కొన్ని సంవత్సరాలు టిప్ టాప్ రెడ్డి జైలు జీవితం గడిపి బయటకొచ్చిన తరువాత ఒక గుడి కట్టుకొని అక్కడే జీవితం గడుపుతున్నాడు.పోలీసుల విచారణలో మూడు నిందితుడు అత్యాచారం చెయ్యలేదని తేలింది. 

ఆ టిప్ టాప్ రెడ్డి కథను "అసంభవామి యుగేయుగే" అనే ధారావాహిక గా ఉదయం పత్రికలో పరుచూరి సోదరులు వ్రాసారు.అనంతరం అదే కథను కొంచెం మార్చి సురేష్ ప్రొడక్షన్ బేనర్ లో సర్పయాగం సినిమాగా తీశారు...
ఈ సంఘటనలో ఒక తండ్రి ఆవేదన, ప్రేమ మాత్రమే ఒంగోలు ప్రజలకు,అప్పటి పాత్రికేయులకు కనిపించాయి. ప్రస్తుతం జరిగే సంఘటనలకు ఇలాంటి సమాధానం కావాలని ఒంగోలు ప్రజలు కోరుకుంటారు.రాష్ట్రంలో పత్రికలు ఈ సంఘటనను ప్రముఖంగా ప్రచురించాయి.సర్పయాగం రెడ్డిగారు ఇప్పుడు ప్రశాంతంగా కొండమీద కోదండరాముని సేవలో కాలం వెళ్ళబుచ్చుతున్నారు.

Written By--Nirmal Akkaraju

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News