16,500 మందిలో మిగిలిన ఒకే ఒక్కడు!!

By Sannapareddy Krishna Reddy Jan. 13, 2022, 09:30 pm IST
16,500 మందిలో మిగిలిన ఒకే ఒక్కడు!!

జనవరి 13,1842 న ఆఫ్ఘనిస్తాన్ లోని జలాలాబాద్ నగరంలో ఉన్న బ్రిటిష్ సైనిక స్థావరం బయట కాపలా ఉన్న సెంట్రీకి దూరంగా నడవలేక నడుస్తున్న ఒక గుర్రం, దానిమీద వాలిపోయి బ్రతికి ఉన్నాడో లేదో తెలియని స్థితిలో ఉన్న ఒక మనిషి కనిపించారు. వెంటనే కొందరు సైనికులు వెళ్ళి ఆ ఇద్దరినీ తీసుకొచ్చారు. తాగడానికి నీరు, తినడానికి ఆహారం ఇచ్చాక ఆ వ్యక్తి కోలుకోలేని తన పేరు విలియమ్ బ్రైడన్ అని, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బ్రిటిష్ సైన్యంలో అసిస్టెంట్ సర్జన్ గా పని చేశానని చెప్పాడు.

సరిగా ఒకవారం క్రితం 4,500 బ్రిటిష్ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, నౌకర్లు అందరూ కలిసి మరో 12,000 మంది కాబూల్ విడిచి పెట్టి, జలాలాబాద్ వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించారని ఆ స్థావరంలో ఉన్న వారికి వార్త అందింది. "మిగిలిన సైన్యం ఏది?" అనడిగాడు జలాలాబాద్ స్థావరంలో ఉన్న సైనికాధికారి.
"నేనే సైన్యాన్ని!" అన్నాడు బ్రైడన్. ఆ అధికారికి అర్థం కాలేదు. అది గమనించిన బ్రైడన్ "అందరినీ చంపేశారు. నేనొక్కడినే ప్రాణాలతో బయటపడ్డాను" అని చెప్పాడు.

ఆఫ్ఘనిస్తాన్ పావుగా బ్రిటన్, రష్యాల గ్రేట్ గేమ్

పంతొమ్మిదో శతాబ్దం మొదట్లో ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్ తన బద్ధ శత్రువు అయిన బ్రిటన్ కు అపారమైన సంపద అందిస్తున్న ఇండియాను చేజిక్కించుకోవడం ద్వారా ఆ దేశాన్ని తిరుగులేని దెబ్బ కొట్టొచ్చు అని భావించి, రష్యాతో కలిసి పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా నాటి బ్రిటిష్ ఇండియా మీద దాడి చేయవచ్చు అని పథకం రచించి, రష్యా పాలకుడు అలెగ్జాండర్ ప్రతినిధులతో చర్చలు కూడా జరిపాడు. అయితే బ్రిటిష్ ఇండియా మీద రష్యా పాలకులకు ఆసక్తి లేకపోవడం, ఆ తర్వాత రష్యా, ఫ్రాన్స్ దేశాలు శత్రువులుగా మారడంతో ఈ ప్లాన్ ఎవరూ పట్టించుకోలేదు.

అయితే తన గూఢాచారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బ్రిటన్ బ్రిటీష్ ఇండియాకు, రష్యా, పర్షియా దేశాలకు మధ్య ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో తమ అడుగులకు మడుగులొత్తే పాలకుడు ఉండాలని భావించింది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాలకుడుగా ఉన్న దోస్త్ మహమ్మద్ ఖాన్ రష్యాకు సన్నిహితంగా ఉంటున్నాడని భావించిన బ్రిటన్ పాలకులు, అతడిని దించివేసి, అతని చేతిలో సింహాసనం కోల్పోయి, దాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ఎవరు సహాయం చేస్తారా అని దేశాలు పట్టి తిరుగుతున్న షా షూజాకి సైనిక సహాయం చేసి, అతన్ని పాలకుడిగా చేయాలని భావించి, ఆ పని అప్పటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ ఆక్లాండుకు అప్పగించారు.

1839 ఆగష్టులో 20,000 మంది సైనికులు, అంతకు రెట్టింపు సంఖ్యలో సహాయక సిబ్బందిని సమకూర్చుకుని షా షూజాని వెంటబెట్టుకొని బ్రిటిష్ ఇండియా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ లో అడుగు పెట్టింది. దీన్ని, దీనికి ముందు, వెనుక 1830 - 1895 మధ్య కాలంలో జరిగిన సంఘటనలను చరిత్రకారులు "ది గ్రేట్ గేమ్" అని పిలుస్తారు. ఒకవైపు భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ సైన్యాన్ని సమీకరిస్తున్న సమయంలో రష్యా పాలకులకు, ఆఫ్ఘన్ పాలకుడు దోస్త్ మహమ్మద్ కి చెడింది. అయితే ఆ విషయం తెలియని బ్రిటిష్ ఇండియా పాలకులు "ఇండస్ ఆర్మీ" పేరుతో తమ సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ వైపు నడిపించారు.

ఆక్రమణ సులభం - పాలనే కష్టం

క్రీస్తు పూర్వం అలెగ్జాండర్ నుంచి,గత శతాబ్దంలో రష్యన్లు, నిన్న మొన్నటి అమెరికా వరకూ ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకోవడం తేలిక పనే అయినా, వివిధ తెగలు, తెగల నాయకులతో కూడిన ఆ దేశాన్ని పాలించడం చాలా కష్టం అని తెలుసుకుని అర్ధాంతరంగా దేశాన్ని వదిలి వెళ్లారు. దోస్త్ మహమ్మద్ ఖాన్ ని ఓడించడం, తమ చెప్పుచేతలలో ఉండే షా షూజాని ఆ స్థానంలో కూర్చోబెట్టడం తేలిగ్గా జరిగినా, జనాదరణ ఉన్న దోస్త్ మహమ్మద్ స్థానంలో షా షూజాని ఆఫ్ఘన్ లు అంగీకరించలేదు.

షూజాకి మద్దతుగా బ్రిటిష్ ఇండియా సైన్యం కాబూల్ నగరంలో శాంతిభద్రతలు కల్పించినా దేశమంతా అసంతృప్తి నెలకొంది. 1841 సంవత్సరం చివరిలో దోస్త్ మహమ్మద్ కుమారుడు అక్బర్ ఖాన్ జనంలో పెద్ద తిరుగుబాటు లేవదీశాడు. ఇంత పెద్ద సైన్యానికి నాయకుడు అయిన మేజర్ జనరల్ విలియం ఎల్ఫిన్ స్టోన్ గౌట్ వ్యాధివల్ల తీవ్రమైన కీళ్ళనొప్పులతో బాధపడుతూ గుర్రం ఎక్కాలన్నా, దిగాలన్నా ఇద్దరు మనుషుల సాయం తీసుకునేవాడు. 1841 నవంబరులో ఒక గుంపు ఎల్ఫిన్ స్టోన్ సహాయకుడు అలెగ్జాండర్ బర్న్స్ ఇంటికి నిప్పంటించారు. కాలుతున్న ఇంటిలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన అతన్ని, అతని కుటుంబాన్ని ముక్కలుగా నరికేశారు. ఇంత దారుణానికి కారణమైన వారిమీద బ్రిటిష్ సైన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆఫ్ఘన్లు వారి మీద హింసాత్మక చర్యలకు తెగబడసాగారు.

అప్పుడు ఎల్ఫిన్ స్టోన్ సలహాదారుడు విలియం మెక్ నాటెన్ అక్బర్ ఖాన్ ని చర్చలకు ఒప్పించాడు. డిసెంబర్ 23న అక్బర్ ఖాన్ తో చర్చలు జరుపుతుండగా అతను మెక్ నాటెన్ నోటిలో తుపాకీ పెట్టి కాల్చేశాడు. దాంతో ఎల్ఫిన్ స్టోన్ జరిగింది చాలు అన్న నిర్ణయానికి వచ్చి, కాబూల్ నగరాన్ని అక్బర్ ఖాన్ కి అప్పగించి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సందేశం పంపించాడు. అక్కడికి 149 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలాలాబాద్ నగరంలోని తమ సైనిక స్థావరాన్ని చేరేవరకూ తమ సైన్యం మీద ఎలాంటి దాడులు చేయకూడదన్న నిబంధన విధించాడు. అందుకు అక్బర్ ఖాన్ అంగీకరించగానే ఇండస్ ఆర్మీ కాబూల్ నగరాన్ని ఖాళీ చేయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు.

జనవరి 6,1842 రోజున 4500 మంది సైనికులు, సైనిక అధికారులు, 12,000 మంది వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది కాబూల్ నుంచి జలాలాబాద్ ప్రయాణం మొదలు పెట్టారు. అయితే వారి ప్రయాణం మొదలైన మొదటి రోజునే అక్బర్ ఖాన్ ఇచ్చిన హామీ అబద్ధం అని తేలిపోయింది. దారికి అటూఇటూ ఉన్న ఎత్తెన పర్వతాల మీద ఉన్న అతని అనుచరులు తుపాకులతో గుళ్ళవర్షం కురిపించడం మొదలు పెట్టారు. తుపాకీ గుళ్ళ నుంచి తప్పించుకున్నా రాత్రి వేళల్లో కురిసిన మంచు కబళించసాగింది. పడుకున్న వారు పడుకున్నట్టే మరణించసాగారు.

జనవరి 12న గండమాక్ కొండను చేరుకునే సరికి సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుపోయి కేవలం ఎనభై మంది మిగిలారు. అక్కడ వీరిని మరో గుంపు చుట్టుముట్టారు. తప్పించుకునే అవకాశం ఎలాగూ లేదని తమ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకుని వారితో తలపడ్డారు. ఒకరొకరుగా నేలకొరిగిపోతూ ఉండగా కొందరు తప్పించుకుని ముందుకు సాగారు. వీరిలో విలియం బ్రైడన్ కూడా ఉన్నాడు. ఆ పోరాటంలో ఒక ఆఫ్ఘన్ అతడి తలమీద కత్తితో గట్టిగా దెబ్బ వేశాడు.

విపరీతమైన చలిని తప్పించుకోవడానికి బ్రైడన్ తన టోపీకింద తన దగ్గర ఉన్న ఒక పుస్తకాన్ని ఉంచుకోవడంతో ప్రాణాలు తీయవలసిన ఆ దెబ్బ పుర్రె ఎముక విరగ్గొట్టింది. తీవ్రంగా గాయపడి, మృత్యువాత పడిన ఒక అశ్వికదళ సైనికుడికి చెందిన గుర్రం మీద తప్పించుకున్న బ్రైడన్, తన లాగా తప్పించుకున్న మరో పదిహేను మందితో కలిసి గుర్రాల మీద జలాలాబాద్ కి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతేహాబాద్ చేరగానే మరో ముఠా ఎదురైంది. తనతో ఉన్న అందరూ ఆ ముఠా చేతుల్లో మరణించగా తీవ్రంగా గాయపడిన బ్రైడన్ తనలాగే గాయపడిన గుర్రం మీద తమ సైనిక స్థావరాన్ని చేరుకున్నాడు.

ప్రతీకారం తీర్చుకున్న బ్రిటిష్ సైన్యం

తమ సైన్యానికెదురైన దారుణ పరాభవాన్ని బ్రిటిష్ ఇండియా పాలకులు తేలిగ్గా తీసుకోలేదు. ఈసారి మరింత పెద్ద సైన్యాన్ని సమీకరించి, సెప్టెంబర్ 1842 లో కాబూల్ మీద దాడి చేసి, ఆ నగరాన్ని నేలమట్టం చేశారు. అంతకు అయిదు నెలల ముందే షా షూజా హత్యకు గురయి, అతని వారసుడు మహమ్మద్ ఖాన్ అతని స్థానంలో పాలకుడుగా ఉన్నాడు. భారత దేశంలో ఖైదీగా ఉన్న దోస్త్ మహమ్మద్ ఖాన్ ని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం విడుదల చేశాక అతను 1843లో ఆఫ్ఘనిస్తాన్ సింహాసనం ఎక్కి 1863లో మరణించేవరకూ పాలించాడు.

విలియం బ్రైడన్ బ్రిటిష్ సైన్యంలో డాక్టరుగా కొనసాగి, 1852 లో బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత రెజిమెంటల్ డాక్టరుగా ప్రమోషన్ పొంది లక్నోలో పనిచేస్తుండగా, 1857లో సిపాయిల తిరుగుబాటులో భాగంగా తన రెజిమెంటును తిరుగుబాటుదారులు చుట్టుముట్టిన ఘటనలో కూడా ప్రాణాలతో తప్పించుకుని, 1873లొ ఇంగ్లాండులో తన స్వస్థలంలో మరణించాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp