ప్ర‌తీ ఇంట్లో పిండి వంట‌లు.. గోదారోళ్ల ప్ర‌త్యేక‌త‌లు..

By Kalyan.S Jan. 15, 2022, 08:30 am IST
ప్ర‌తీ ఇంట్లో పిండి వంట‌లు.. గోదారోళ్ల ప్ర‌త్యేక‌త‌లు..

సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల‌కు పెద్ద పండుగ‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రింత ప్ర‌త్యేకం. అందులోనూ గోదావ‌రి జిల్లాల్లో ఆ సంద‌డే వేరు. ఊళ్లూ.. వాడ‌లు.. సంక్రాంతి స‌ర‌దాల్లో మునిగితేల‌తాయి. పురుషులంతా కోడి పందాల బ‌రుల్లో స‌రిగా.. డేగ‌.. అంటూ పందాలు క‌డుతుంటే.. మ‌హిళ‌లు ఇంట్లో ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌తో నోరూరిస్తారు. ఇంటికి వ‌చ్చే అల్లుళ్లకు వండి వ‌డ్డించేందుకు ప్ర‌త్యేక వంట‌కాల త‌యారీలో బిజీగా ఉంటారు. పూర్వం ప్రతి ఇంట్లో రోలు, రోకలితో పిండ్లు దంచి స్వయంగా పెనం వేసి అరిసెలు, సున్ని పాకుండలు, జంతికలు, గులాబీ పువ్వులు, సున్నుండలు తయారుచేసుకునేవారు. ఇరుగుపొరుగు కుటుంబాల వారు సాయంగా వచ్చేవారు. లేదంటే కిలోల వంతున దంచడానికి లేదా తయారు చేయడానికి మనుష్యులు ఉండేవారు.

ప్రస్తుతం బిజీ జీవితంలో కొంద‌రు దుకాణాల్లోని పిండి వంట‌ల‌కు అల‌వాటు ప‌డితే.. ఇప్ప‌టికీ చాలా మంది ఇంట్లో త‌యారుచేస్తూనే ఉన్నారు. అరిసెలు, జంతికలు, సున్నపాకుండలతో పాటు బుల్లెట్‌ పాకుండలు, సున్నుండలు త‌యారు చేస్తుంటారు. మ‌రి కొంద‌రు అంత‌టితో ఆగ‌రు. పెద్ద కుటుంబాలు, పిల్ల‌లు ఎక్కువ ఉండే గోదావ‌రి జిల్లాల్లోని ఇళ్ల‌ల్లో బెల్లం మిఠాయి ఉండలు, పొంగడాలు, అప్పాలు, శనగపప్పు, పెసరపప్పు, కొబ్బరి, జున్నుతో తయార చేసే వివిధ రకాల బూరెలు, రవ్వ లడ్లు, గులాబీ పువ్వులు, చంద్రకాంతలు, గోరు మిఠాయి, సంపంగి పువ్వులు. గవ్వలు, చెక్కలు, గోధుమ గొట్టాలు.. ఇలా ర‌క‌ర‌కాల వంట‌లు సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఇళ్లల్లో పిండివంటలపై అభిరుచులు మారాయి. బెల్లం బదులు పంచదార, నువ్వులు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌ జోడించి కావలసిన స్వీట్లను త‌యారు చేస్తున్నారు.

ఇళ్లల్లో తయారీ చేసిన పిండివంట‌ల‌నే దుకాణాల‌కు పంపిణీ చేస్తూ.. కుటీర పరిశ్రమలుగా కొన్నిచోట్ల కొన‌సాగుతున్నాయి. స్వీట్లు, బేకరీ అయిటెమ్స్‌ తయారు చేసే పెద్ద సంస్థలను తీసిపోని రీతిలో స‌ప్ల‌య్ చేస్తుంటారు. పండగ ప్రత్యేకతగా వెదురుబుట్టలలో నింపి ఇళ్లకు డెలివరీ చేస్తున్నారు. పండ‌గ స‌మ‌యంలో గోదావ‌రి జిల్లాల్లోని దాదాపు ప్ర‌తీ కుటుంబం పిండి వంట‌ల‌కు ఎంతో ప్రాముఖ్యం ఇస్తుంది. అల్లుళ్ల‌కు, బంధువుల‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp