Electrical Vehicles -భవిష్యత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దే.. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న వెహికల్స్ ఇవే!

By Balu Chaganti Oct. 13, 2021, 08:00 pm IST
Electrical Vehicles -భవిష్యత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దే.. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న వెహికల్స్ ఇవే!

వాహన తయారీ సంస్థలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో తలమునకలయ్యాయని చెప్పొచ్చు. పర్యావరణ హితానికి ఎలక్ట్రిక్ వాహనాలు ముఖ్యమవడంతో ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు అధిక సబ్సిడీలు ఇస్తుండడంతో కంపెనీలు కూడా ఈ వాహనాల మీదే ఆసక్తి చూపుతున్నాయి. ఇంధన ధరలు ప్రతి రోజూ పెరుగుతుండడంతో వినియోగదారులు సైతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే కొన్ని కార్ల సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్లోకి తీసుకురాగా.. చాలా సంస్థలు ఉత్పత్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. అలా ఈ ఏడాది అలాగే రానున్న ఏడాది భారత మార్కెట్లో మరిన్ని కార్లు విడుదల కానున్నాయి. భారతదేశ మార్కెట్ లోకి విడుదల కావడానికి ఇప్పటికే ప్రకటించిన కొన్ని వాహనాలు సహా మరికొన్ని వాహనాలు భారతీయ మార్కెట్లో విడుదల చేయబడుతాయని భావిస్తున్నారు. ఇక ఆ వాహనాల జాబితా ఇక్కడ ఉంది.

టెస్లా మోడల్ 3 (Tesla Model 3)

టెస్లా ఇండియన్ మార్కెట్లో నాలుగు మోడళ్లను లాంచ్ చేయడానికి ఆమోదం పొందినప్పటికీ, ఈ విషయం మీద టెస్లా నుండి ఇంకా ఎలాంటి నిర్ధారణ లేదు. టెస్లా ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో మోడల్ 3ని పరీక్షించడం ప్రారంభించింది. ఇది 2022 మొదట్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ Tesla Model 3 అనేది అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఎంట్రీ లెవల్ కారు. భారత ప్రభుత్వం నుండి ఎలాంటి పన్ను మినహాయింపులు ప్రకటించనందున భారత మార్కెట్లో దీని ధర రూ .50 లక్షలకు పైగా ఉంటుంది. భారతదేశంలో మోడల్ 3 కి మంచి డిమాండ్ కనుక ఏర్పడితే, టెస్లా తన ఇతర కార్ మోడళ్లను సైతం భారతీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

మహీంద్రా ( Mahindra eKUV)

ఇక ఎలక్ట్రిక్ వాహనాలను మహీంద్రా సంస్థ సైతం సిద్ధం చేసింది. మహీంద్రా 2020 ఆటో ఎక్స్‌పోలో eKUV ని ప్రదర్శించింది. మహీంద్రా అప్పుడే వాహనం ధరను కూడా విడుదల చేసింది కానీ ఇంకా భారతీయ మార్కెట్లో విడుదల చేయబడలేదు. మహీంద్రా ఇప్పుడు eKUV తో సిద్ధంగా ఉందని ఈ సంవత్సరం చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనంగా మారుతుందని మహీంద్రా సంస్థ భావిస్తోంది. మహీంద్రా స్పెసిఫికేషన్‌లలో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేనప్పటికీ, రెండు విభిన్న వేరియంట్‌లను మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశం ఉంది. eKUV 15.9 kWh బ్యాటరీతో సిద్ధం అయింది. వాహనం ముందు యాక్సిల్‌కు మౌంట్ చేయబడిన సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ తో ఇది పని చేయనుంది.

టాటా ఆల్ట్రోజ్(Tata Altroz EV)

ఇటీవలి కాలంలో భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఎలక్ట్రానిక్ వెహికల్ తయారీదారులలో ఒకరుగా టాటా సంస్థ నిలబడింది. టాటా భారతదేశంలో నెక్సాన్, టిగోర్
లను అందిస్తుంది. టాటా ఆల్ట్రోజ్ మీద కూడా పనిచేస్తోంది.. బహుశా వచ్చే ఏడాది విడుదల చేస్తుందని భావిస్తున్నారు. Tata Altroz EV విభిన్న ఆల్ఫా ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటున్న కారణంగా నెక్సాన్ మరియు టిగోర్‌తో పోలిస్తే కారులో వివిధ బ్యాటరీ ప్యాక్‌లు , ఎలక్ట్రిక్ మోటార్‌లను మనం చూడవచ్చు.

మారుతి సుజుకి వాగన్ఆర్ (Maruti Suzuki WagonR EV)

భారతదేశపు అతిపెద్ద బ్రాండ్ అయిన మారుతి సుజుకి డీజిల్ ఇంజిన్‌లకు ఇప్పటికే దూరమైంది. ఇప్పుడు సిఎన్‌జి వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించింది. సుజుకి కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి కృషి చేస్తోంది. మారుతి సుజుకి కొన్ని సంవత్సరాల క్రితం భారత మార్కెట్లో 50 యూనిట్ల వ్యాగన్ఆర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ను పరీక్షించడం ప్రారంభించింది. సుజుకీ వాగన్ఆర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను 2022కి విడుదల చేస్తుందని భావిస్తున్నారు. అయితే, మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారు అధికారిక లాంచ్‌కు ఇంకా చాలా సంవత్సరాల దూరంలో ఉందని మరియు మొదటి మారుతి సుజుకిని 2025లో విడుదల చేసే అవకాశం ఉందని ఒక నివేదిక సూచిస్తుంది.

బీవైడీ e6 (BYD e6)

చైనీస్ తయారీదారు బీవైడీ(BYD) భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీవైడీ నుండి మొట్టమొదటి కారు బీవైడీ e6 కావచ్చు, బీవైడీ కూడా కొంతకాలంగా భారతీయ రోడ్లపై తమ కారును పరీక్షిస్తున్నారు. మిడ్-సైజు SUV స్టైల్ కారయిన ఈ బీవైడీ e6 71.7 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా ఛార్జ్ అవుతుంది. ఇది కేవలం 1.5 గంటల్లో 100% బ్యాటరీని ఛార్జ్ చేయగల వేగవంతమైన ఛార్జింగ్ సిస్టమ్‌తో రిలీజ్ అయ్యే అవకశాలున్నాయని అంటున్నారు.

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)

రెనాల్ట్ ఇప్పటికే చైనా మార్కెట్లో క్విడ్ ఎలక్ట్రానిక్ వెహికల్ ని విడుదల చేసింది. ఇప్పుడు భారత లో కూడా దాన్ని రిలీజ్ చేసే సూచనలు కూడా వచ్చాయి కానీ భారతీయ మార్కెట్లో విడుదల తేదీని రెనాల్ట్ ఇంకా ధృవీకరించలేదు. ఈ క్విడ్ నగర పరిమితులకు సరైన కారు అని అంటున్నారు..ఈ కారు ఫుల్ ఛార్జ్‌కు దాదాపు 200 కి.మీల దూరం వెళ్లే అవకాశం ఉంటుంది.

టాటా టియాగో (Tata Tiago EV)

టిగోర్ మరియు టియాగో రెండు క్కే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడినందున, టాటా టియాగో ఎలక్ట్రానిక్ వెహికల్ ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడం పెద్ద పని కాదు. టాటా తన ఎలక్ట్రిక్ వాహనాల విడుదల విషయంలో నిర్విరామంగా పనిచేస్తోంది. భారత మార్కెట్లో టియాగో ఎలక్ట్రానిక్ వెహికల్ లాంచ్ గురించి టాటా ఏమీ సూచించనప్పటికీ, వచ్చే ఏడాది ఇది లాంచ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

రెనాల్ట్ జో (Renault Zoe)

రెనాల్ట్ 2020 ఆటో ఎక్స్‌పోలో జో ఎలక్ట్రానిక్ వెహికల్ ని ప్రదర్శించింది. ఆ తరువాత భారతదేశంలో కూడా దీనిని పరీక్షించడం ప్రారంభించింది. ఇండియన్ మార్కెట్లో జో ఈవీని లాంచ్ చేయడాన్ని ఇంకా రెనాల్ట్ ధృవీకరించనప్పటికీ, ఈ వాహనం వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లోకి రావడానికి అవకాశం ఉందని అంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp