8నెలల చికిత్స.. రూ. 8 కోట్ల ఖర్చు అయినా కరుణించని కరోనా

By Ramana.Damara Singh Jan. 15, 2022, 05:00 pm IST
8నెలల చికిత్స.. రూ. 8 కోట్ల ఖర్చు అయినా కరుణించని కరోనా

మానవాళిని సుమారు రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా పీల్చి పిప్పిచేస్తోంది. కొన్ని లక్షల ప్రాణాలను బలిగొంది. ఆ మహమ్మారి నుంచి తమవారిని కాపాడుకోవడంలో ఎందరో విఫలమయ్యారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఆ కుటుంబమైతే తమ కుటుంబానికే చెందిన ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు కోవిడ్ తో సుమారు ఎనిమిది నెలలు పోరాడింది. అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేసింది. ఖర్చుకూ వెనుకాడలేదు. భూములు అమ్మి ఏకంగా రూ. ఎనిమిది కోట్లు ఖర్చు చేసింది. అయినా తమ కుటుంబ సభ్యుడిని దక్కించుకోలేకపోయింది. డబ్బు పోతే పోయింది.. తమ మనిషిని రక్షించుకోలేక పోయినందుకు బాధపడుతోంది.

దేశవిదేశాల వైద్య నిపుణులతో వైద్యం

మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా ప్రాంతానికి చెందిన ధరమ్ జయ్ సింగ్ కరోనా సెకండ్ వేవ్ సమయంలో గత ఏడాది ఏప్రిల్లో కోవిడ్ బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని రేవా ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆరోగ్యం కుదుటపడకపోగా మరింత విషమించడంతో ఉన్నత వైద్యం కోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించినా అప్పటికే ధరమ్ ఊపిరితిత్తులు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురయ్యాయి. కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి. దాంతో అతను నిరంతరం వెంటిలేటర్ మీదే ఉంచాల్సి వచ్చింది. కొన్నాళ్లు ఎక్స్ మో మిషన్ పై కూడా ఉంచారు. మొదట దేశంలోని పలువురు ప్రముఖ వైద్య నిపుణలను రప్పించి చికిత్స అందించారు. ఆన్లైన్ లో పలు దేశాల నిపుణులతో సంప్రదించారు. చివరికి లండన్ నుంచి డాక్టర్లను రప్పించి అత్యున్నత వైద్యం అందించినా ఫలితం లేకపోయింది.

ఎక్స్ మో మిషన్ కే రోజుకు రూ. లక్ష చెల్లించాల్సి వచ్చింది. వైద్యుల ఫీజులు, ఆస్పత్రి చార్జీలు, మందులు, ఇతరత్రా ఖర్చులు కలిపి రోజు రూ. 3 లక్షలు చొప్పున బిల్లు చెల్లించాల్సి వచ్చింది. అలా ఎనిమిది నెలల్లో రూ. 8 కోట్లు ఖర్చయ్యాయి. ఇందుకోసం ధరమ్ జయ్ సింగ్ కుటుంబం 50 ఎకరాల భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంత చేసినా ప్రయోజనం లేకపోయింది. నాలుగు రోజుల క్రితం ధరమ్ కన్ను మూసి తన కుటుంబాన్ని విషాదంలో ముంచాడు.

రాష్ట్రపతి సత్కారం అందుకున్న ఆదర్శ రైతు

ధరమ్ జయ్ సింగ్ భూస్వామ్య కుటుంబానికి చెందినవారు. వీరికి వెయ్యి ఎకరాల భూములు ఉన్నాయి. వీరు ముగ్గురు సోదరులు. ఒక సోదరుడు న్యాయవాది. మరో సోదరుడు సామాజిక కార్యకర్త. ఇక ధరమ్ కూడా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఆదర్శ రైతుగా గుర్తింపు పొందాడు. స్ట్రాబెరీ, గులాబీల సాగుతో మంచి గుర్తింపు పొందాడు. గతంలో రాష్ట్రపతి నుంచి, గత ఏడాది రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా కూడా సత్కారం అందుకున్నాడు. చివరికి కరోనా చేతిలో చిక్కి కన్ను మూశాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp