మార్పు కోసం గళమెత్తిన మందారం - Nostalgia

By iDream Post May. 07, 2021, 08:30 pm IST
మార్పు కోసం గళమెత్తిన మందారం - Nostalgia

విప్లవం, తిరుగుబాటు ఈ రెండు మాటలు ప్రభుత్వ వ్యవస్థకే కాదు వెండితెరకు కూడా ఒకరకంగా సవాల్ అనిపించే అంశాలు. అందుకే వీటిని ఆధారంగా చేసుకుని సినిమాలు తీసిన దర్శకులు హీరోలు తక్కువగా కనిపిస్తారు. కారణం అన్ని వర్గాలను మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో లేకపోవడమే. అయినా సరే లాభాల కోసం కాకుండా సమాజం కోసం ఇలాంటి చిత్రాలు నిర్మించే వాళ్ళకు ప్రభుత్వాల నుంచే కాదు ప్రజల నుంచి కూడా మద్దతు దక్కే సందర్భాలు లేకపోలేదు. దశాబ్దాలు గడిచినా వాటి తాలూకు సౌరభాలు ఇంకా సినీ ప్రేమికులను ఆలోచింపజేస్తూనే ఉంటాయి. అలాంటి ఒక ఆణిముత్యమే ఎర్రమందారం. ఆ విశేషాలు చూద్దాం.

1990 సంవత్సరం. అభ్యుదయ దర్శకులు టి కృష్ణ ఆశయాలను కొనసాగిస్తూ ఈతరం ఫిలింస్ సంస్థను నడిపిస్తున్న పోకూరి బాబూరావు ఓ రోజు వారపత్రికలో ప్రముఖ రచయిత ఎంవి ఎస్ హరనాథరావు గారు రాసిన 'లేడి చంపిన పులి నెత్తురు' కథను చదివి దీన్ని సినిమాగా తీస్తే ఎలా ఉంటుందన్న ఆకాంక్షను ఆయన ముందే వెలిబుచ్చారు. అయితే ఇది చదివేందుకు బాగుందని స్క్రీన్ మీద మీరు ఆశించినంత గొప్పగా పండకపోవచ్చని హరినాధరావు సందేహం వెలిబుచ్చినా బాబురావు వదల్లేదు. కొన్ని కీలక మార్పులతో సంజీవి, మరుధూరి రాజా అందరూ కలిసి ఎర్రమందారం స్క్రిప్ట్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ముత్యాల సుబ్బయ్య దర్శకుడిగా వాసూరావు సంగీతం సమకూర్చారు.

ఇంతటి సీరియస్ సబ్జెక్టుకు హాస్యనటకిరిటీ రాజేంద్రప్రసాద్ ని ఎంపిక చేసుకోవడం చూసి అందరూ షాక్ తిన్నారు. యమున హీరోయిన్ గా కన్నడ హీరో దేవరాజ్ విలన్ గా ఎంపికయ్యారు. ఊరి మీద పెత్తనం చేస్తూ అందరినీ ఆడించే దొర ఆగడాలకు అమాయకుడైన హీరో బలైతే అతని భార్య దొర మీద ప్రతీకారం తీర్చుకోవడం ఇందులో మెయిన్ పాయింట్. 1991 జనవరి 25న విడుదలైన ఎర్రమందారం ఫ్లాప్ కాలేదు కానీ భారీ లాభాలను మాత్రం ఇవ్వలేకపోయింది. అందులోనూ కేవలం వారం గ్యాప్ లోనే ఏప్రిల్ 1 విడుదల సంచలన విజయం సాధించడం ప్రభావం చూపించింది. ఎర్ర మందారంకు ఉత్తమ నటుడు, ఉత్తమ కథా చిత్రం, ఉత్తమ గేయ రచయిత, విలన్, ఎడిటింగ్ ఇలా అయిదు విభాగాల్లో నంది పురస్కారాలు దక్కాయి. అందుకే ఈ విప్లవ అద్భుతం ఎన్నటికీ వాడని ఓ ఎర్రపుష్పం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp