2005 Hit Movies : పోటీ ఎంతున్నా విషయమున్న సినిమాకే విజయం - Nostalgia

By iDream Post Jan. 09, 2022, 05:18 pm IST
2005 Hit Movies : పోటీ ఎంతున్నా విషయమున్న సినిమాకే విజయం  - Nostalgia

ఏడాది ఏదైనా మొదటి నెల వచ్చే సినిమా రిలీజులు ప్రత్యేకతను ఆసక్తిని కలిగి ఉంటాయి. సంక్రాంతి పండగ ఉండటం ప్రధాన కారణం అయినప్పటికీ ప్రతిసారి ఆ సెంటిమెంట్ హిట్ ఇస్తుందన్న గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు ఊహించని ఫలితాలు దక్కుతాయి. ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళదాం. 2005. పవన్ కళ్యాణ్ 'బాలు' మీద మాములు అంచనాలు లేవు. ఇండస్ట్రీ హిట్ తొలిప్రేమ ఇచ్చిన దర్శకుడు కరుణాకరణ్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ ఊహలకు రెక్కలు లేకుండా పోయాయి. అశ్వినిదత్ నిర్మాణం, మణిశర్మ సంగీతం, కోట్ల రూపాయల బడ్జెట్ తో వేసిన సెట్లు, తిరిగిన లొకేషన్లు పవర్ స్టార్ మూవీ హైప్ ఇంతకన్నా ఏం కావాలి అన్నట్టుగా బయ్యర్లు ఎగబడ్డారు.

జనవరి 6 థియేటర్లలో అడుగు పెట్టిన బాలు నిరాశపరిచింది. తనకు సూట్ కాని మాఫియా బ్యాక్ డ్రాప్ ని ఎంటర్ టైన్మెంట్ తో మిక్స్ చేసి ఏదో చూపించాలన్న కరుణాకరన్ తాపత్రయం బెడిసి కొట్టింది. ఫలితంగా బాలు పరాజయం. అదే రోజు వచ్చిన బుచ్చిబాబు అనే చిన్న సినిమా అడ్రెస్ లేకుండా పోయింది. జనవరి 14న జూనియర్ ఎన్టీఆర్ 'నా అల్లుడు' సైతం బాలు రేంజ్ లో బిజినెస్ జరుపుకుని ఓపెనింగ్స్ రాబట్టుకుంది. అత్తగా రమ్యకృష్ణ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శ్రేయ-జెనీలియా గ్లామర్ ఇవేవి దర్శకుడు వర ముళ్ళపూడి నాసిరకం కథాకథనాలను కాపాడలేకపోయాయి. ఫలితంగా బాక్సులు వాపస్. రెండు షేడ్స్ లో తారక్ పెర్ఫార్మన్స్ ఉపయోగపడలేదు.

అదే రోజు సుమంత్ 'ధన 51' కూడా వచ్చింది. యువకుడు, గోదావరి, సత్యంలతో ఇమేజ్ బిల్డ్ చేసుకున్న ఈ అక్కినేని కాంపౌండ్ హీరో మీద నమ్మకంతో హాళ్లకు వచ్చిన ప్రేక్షకులు బొమ్మ పూర్తి కాకుండానే లేచి వెళ్లిపోయారు. అంత డిజాస్టర్. కానీ అనూహ్యంగా అదే 14న వచ్చిన సిద్దార్థ్-త్రిషల 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. చూసిన కథకే దర్శకుడు ప్రభుదేవా ఇచ్చిన ట్రీట్మెంట్, ఫ్రెష్ సీన్లు, దేవి అదిరిపోయే పాటలు వెరసి ఫ్యామిలీ ఆడియన్స్ అండతో నిర్మాత ఎంఎస్ రాజుకు కనకవర్షం కురిసింది. 21న వచ్చిన ఈవివి 'ఎవడి గోల వాడిది' మంచి విజయం అందుకోగా రాజనర్తకి, సాయికుమార్ రాక్షసుడు, వడ్డే నవీన్ శత్రులను ఎవరూ పట్టించుకోలేదు. ఫైనల్ గా నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంద రోజులు ఆడి మరీ సూపర్ విజేతగా నిలిచింది

Also Read : Moratodu Naa Mogudu : అక్కడి బ్లాక్ బస్టర్ ఇక్కడి డిజాస్టర్ - Nostalgia

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp