గతం మరిచిన పోలీస్ కథ - Nostalgia

By iDream Post May. 03, 2021, 08:30 pm IST
గతం మరిచిన పోలీస్ కథ - Nostalgia
హాలీవుడ్ సినిమాలను స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడి ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు కథలు రాసుకుని మెప్పించడం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే స్టార్ హీరోలతో వీటిని డీల్ చేస్తున్నప్పుడు చాలా అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్క్రిప్ట్ పకడ్బందీగా రాసుకోవాలి. అప్పుడే కోరుకున్న సక్సెస్ సొంతమవుతుంది. ఓ ఉదాహరణ చూద్దాం. 1989 సంవత్సరం. ప్రముఖ నటుడు ప్రతాప్ పోతన్ అప్పటికి దర్శకుడిగా రెండు మలయాళం రెండు తమిళ సినిమాలు తీశారు. అయిదోది వాటిని మించిన భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ గా ప్లాన్ చేసుకుని వెట్రి విజా పేరుతో కమల్ హాసన్, ప్రభు హీరోలుగా అమల, రజని, ఖుష్బూ హీరోయిన్లుగా సినిమా ప్రారంభించారు.

ఇంగ్లీష్ నవలలు మూవీస్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ది బోర్న్ ఐడెంటిటీని స్ఫూర్తిగా తీసుకుని 85 ప్రాంతంలో బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న కమాండోలో సీన్లను ఆధారంగా చేసుకుని రచయితలు రాజేశ్వర్, షణ్ముగంలు విజేతలు వెర్షన్ ని సిద్ధం చేశారు. కోట్ల రూపాయల ఖర్చుతో అంతకు మించి రిచ్ క్యాస్టింగ్ తో దీన్ని సినిమా స్కోప్ లో నిర్మించారు నారాయణస్వామి, మనోహర్. గోవా, మదరాసు, బెంగుళూరు, మైసూర్ తదితర లొకేషన్లలో ఖర్చుకు వెనుకాడకుండా తీశారు. ఇళయరాజా అద్భుతమైన ట్యూన్లు ఇచ్చారు. భారీ అంచనాల మధ్య 1989 అక్టోబర్ 28 వెట్రి విజా తమిళనాట రిలీజై సిల్వర్ జూబ్లీ సక్సెస్ అందుకుంది.

తెలుగు డబ్బింగ్ హక్కులు నిర్మాత నరసారెడ్డి సొంతం చేసుకుని తొలుత రీమేక్ చేద్దామనుకున్నారు. కానీ ప్రాక్టికల్ గా సాధ్యాసాధ్యాలు తక్కువగా కనిపించడంతో ఎట్టకేలకు అనువాదం చేసి 1990 ఫిబ్రవరి 2న విజేతలు పేరుతో ఇక్కడ రిలీజ్ చేస్తే అదే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. అదే రోజు వచ్చిన పోలీస్ భార్య, రుస్తుం రుద్రయ్య, హంతకుల రాజ్యంతో పోటీపడి మరీ హిట్టు కొట్టింది. బాలీవుడ్ విలన్ సలీం గౌస్ దీంతోనే సౌత్ కు పరిచయమయ్యారు. 2017లో తమిళంలో దీన్ని డిజిటల్ వెర్షన్ కి రీ స్టోర్ చేసి రీ రిలీజ్ చేయడం ఒక సంచలనం. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా విజేతలు తీర్చిదిద్దిన తీరు చూసే నాగార్జున ప్రతాప్ పోతన్ కి 1990లో చైతన్య సినిమా ఆఫర్ చేయడం, అది డిజాస్టర్ కావడం కొసమెరుపు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp