తెలుగులో వద్దన్నారు కన్నడలో ముద్దన్నారు - Nostalgia

By iDream Post Mar. 07, 2021, 08:05 pm IST
తెలుగులో వద్దన్నారు కన్నడలో ముద్దన్నారు - Nostalgia

ఒక ఇండస్ట్రీ హిట్ తెచ్చే ఇమేజ్ అంచనాలు తర్వాత సినిమా మీద ఎంత ప్రభావం చూపిస్తాయో ఎన్నో సార్లు చూశాం. పదే పదే తమ హీరోని అలాంటి పాత్రల్లోనే చూడాలన్న అభిమానుల అంచనాలు కావొచ్చు లేదా ఇంతకంటే గొప్ప క్యారెక్టర్ లో కనిపిస్తారేమోనన్న ప్రేక్షకుల ఆలోచన కావొచ్చు ఏదైతేనేం ఇలాంటివి చేసే డ్యామేజ్ కొన్నిసార్లు మాములుగా ఉండదు. అయితే కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా హీరోకు మార్కెట్ ఉంది కదాని నేలవిడిచి సాము చేస్తే వచ్చే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. కథ విషయంలో గుడ్డిగా ముందుకు వెళ్లడం ఎందుకు మంచిదో కాదో హెచ్చరికలా అవి పని చేస్తూ ఉంటాయి. ఒక ఉదాహరణ చూద్దాం.

2003 సంవత్సరం. ఫ్యాన్స్ ముద్దుగా బుడ్డోడు అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం చూపించిన సింహాద్రి రికార్డుల ఊచకోత కోసి సంచలన వసూళ్లు రాబట్టుకుంది. దెబ్బకు మార్కెట్ పదింతలు పెరిగిందా అనేలా బయ్యర్లు తర్వాతి సినిమా కోసం ఎగబడ్డారు. అప్పుడు ప్రకటించిందే ఆంధ్రావాలా. ఇడియట్, అమ్మానాన్నా తమిళ అమ్మాయి, శివమణి వరస సూపర్ హిట్లతో భీభత్సమైన ఫామ్ లో ఉన్న పూరి జగన్నాధ్ దర్శకుడనగానే క్రేజ్ ఆకాశాన్ని దాటేసింది. తారక్ ని డ్యూయల్ రోల్ లో తండ్రి కొడుకులుగా చూపిస్తూ మాఫియా బ్యాక్ డ్రాప్ లో పూరి ఓ విభిన్నమైన కథను రాసుకున్నాడు. షూటింగ్ దశలోనే ఇదో పెద్ద సెన్సేషన్. రక్షిత హీరోయిన్ గా చక్రి సంగీత దర్శకుడిగా కోన వెంకట్ సంభాషణలతో భారీ బడ్జెట్ లో గిరి దీన్ని రూపొందించారు.

టాలీవుడ్ ఎన్నడూ చూడని రీతిలో ఆడియో ఫంక్షన్ నిర్వహించడం చూసి నేషనల్ మీడియా సైతం అబ్బురపడింది. దీన్నే సమాంతరంగా కన్నడలోనూ మెహర్ రమేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పునీత్ రాజ్ కుమార్ హీరోగా 'వీర కన్నడిగ' పేరుతో నిర్మించారు. మక్కికి మక్కి ఇదే కథాకథనాలు అక్కడా ఫాలో అయ్యారు. విచిత్రంగా 2004 జనవరి 1న విడుదలైన తెలుగు వెర్షన్ డిజాస్టర్ కాగా శాండల్ వుడ్ ప్రేక్షకులకు ఇది నచ్చింది. ఆంధ్రావాలాలో జూనియర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మిస్ ఫైర్ అయ్యింది. దానికి తోడు ఫస్ట్ హాఫ్ మొత్తం బస్తీలో నడిపించిన మసాలా కామెడీ అతి అయ్యింది. ఇది పూరి బ్రాండ్ ని దెబ్బ తీస్తే అక్కడ మెహర్ రమేష్ కు పునీత్ తోనే ఒక్కడు రీమేక్ చేసే అవకాశాన్ని తెచ్చి పెట్టింది. అందుకే అనేది ఆడియన్స్ అభిరుచులు రాష్ట్రాలకు తగ్గట్టు వేర్వేరుగా ఉంటాయని.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp