ఆంఖోదేఖీ ఒక వెంటాడే సినిమా - Nostalgia

By G.R Maharshi Jan. 03, 2020, 02:37 pm IST
ఆంఖోదేఖీ ఒక వెంటాడే సినిమా - Nostalgia

 జీవితం ఎప్పుడూ రెడీమేడ్ కాదు. ఎవ‌డి కొల‌త‌లు వాడే తెలుసుకోవాలి. ఒక‌డి దుస్తులు ఇంకొక‌డికి ఎప్పుడూ ఫిట్‌కావు. నువ్వు స‌త్యం అనుకున్న‌ది ఎదుటి వాడికి అస‌త్యం కావ‌చ్చు. ఈ తాత్విక లోతుల్లోకి తీసుకెళ్లే సినిమా "ఆంఖోదేఖీ" అంటే క‌ళ్ల‌లోకి చూసా. 2013లో వ‌చ్చిన ఈ సినిమాని ఎవ‌రూ చూడ‌లేదు. నాలుగు కోట్ల‌తో తీస్తే కోటిన్న‌ర రూపాయ‌లు వ‌సూలు చేసింది. ఇండ‌స్ట్రీ లెక్క‌ల ప్ర‌కారం డిజాస్ట‌ర్‌. అయితే నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వ‌చ్చాయి.

ఈ సినిమాలో రొటీన్ సీన్స్ ఉండ‌వు. కొన్ని సార్లు డాక్యుమెంట‌రీలా ఉంటుంది. రెగ్యుల‌ర్ ప్రేక్ష‌కుల‌కు బోర్‌. మ‌నం మ‌న‌లాగే జీవిస్తున్నామా అనే ప్ర‌శ్న చూస్తున్నంత సేపూ వెంటాడుతూ ఉంటుంది.

ఎవ‌రో కారు కొన్నార‌ని మ‌నం కొంటాం. ఇత‌రుల కంటే గొప్ప‌గా క‌నిపించాల‌ని ఇల్లు క‌ట్టుకుంటాం. అప్పులు చేసి మ‌రీ ఫంక్ష‌న్లు చేస్తాం. న‌లుగురు ఏమ‌నుకుంటార‌నే ఊబిలో జీవించి చ‌చ్చిపోతాం. ఇత‌రుల వేలు ప‌ట్టుకుని న‌డుస్తాం. ఇంకొక‌రి భుజాల మీద లోకాన్ని చూస్తాం. అయితే మ‌న ఆలోచ‌న‌, అభిప్రాయం ఏంటి?

ఇది ఒక ముస‌లాయ‌న (సంజ‌య్ మిశ్రా) క‌థ‌. కూతురు ఎవ‌రితోనూ తిరుగుతోంద‌ని, అత‌ను మంచి వాడు కాద‌ని ఎవ‌రో చెబితే, ఆ కుర్రాడ్ని త‌న్న‌డానికి వెళ్తాడు. అత‌ని క‌ళ్ల‌లోకి చూసి, అత‌ను దుర్మార్గుడు కాద‌ని తెలుసుకుంటాడు. ఎవ‌రో చెబితే అభిప్రాయాలు ఏర్ప‌ర‌చుకోవ‌డం కాద‌ని, ఇక‌పైన‌ ప్ర‌తిదీ స్వ‌యంగా చూసి తెలుసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు.
ఉద్యోగానికి వెళ్తాడు. విమానం టికెట్లు బుక్ చేయ‌డం ప‌ని. అమృత్‌స‌ర్‌లో వాతావ‌ర‌ణం ఎలా ఉంద‌ని క‌స్ట‌మ‌ర్ అడిగితే , తానెప్పుడూ ఆ న‌గ‌రం చూడ‌లేద‌ని, చూడ‌కుండా ఎట్లా చెబుతాన‌ని అంటాడు. క‌స్ట‌మ‌ర్ విసుగ్గా ఫోన్ పెట్టేస్తాడు. గూగుల్ చూసి చెప్పొచ్చు క‌దా అని మేనేజ‌ర్ మంద‌లిస్తాడు. దాంతో ఉద్యోగం మానేస్తాడు. భార్య నెత్తీనోరు మొత్తుకుంటుంది. త‌మ్ముడు వేరు కాపురం పెడ‌తాడు. దాంతో పెద్దాయ‌న మౌనాన్ని ఆశ్ర‌యించి, ఎవ‌రితో మాట్లాడ‌డు.

క‌న‌ప‌డ‌ని క‌రెంట్‌ని న‌మ్ముతున్న‌ప్పుడు, దేవున్ని కూడా న‌మ్మాలి క‌దా అని ఎవ‌రో ప్ర‌శ్నిస్తే స‌మాధానం ఉండ‌దు. పులిని చూడ‌కుండా , పులి గ‌ర్జిస్తుంద‌ని న‌మ్మ‌డం క‌రెక్ట్ కాద‌ని, జూకి వెళ్లి పులిని చూస్తాడు.

ప్ర‌పంచం ఏర్పాటు చేసిన కొల‌త‌లు, విలువ‌లు, అభిప్రాయాల్లో ఇమిడే వాడికి ఏ స‌మ‌స్యా లేదు. ప్ర‌శ్నిస్తే అన్నీ స‌మ‌స్య‌లే.

సినిమా చిర‌వ్లో కూతురి పెళ్లి చేసిన ఆనందంలో భార్య‌తో విహార‌యాత్ర‌కు వెళ్తాడు. గాలిలో ఎగిరినంత ఆనందంగా ఉందంటాడు. గాలిలో ఎగిరిన అనుభ‌వం తెలియ‌కుండా , ఎలా మాట్లాడ‌తావ‌ని భార్య ఎగ‌తాళి చేస్తుంది. స్వ‌యంగా తెలుసుకోవ‌డానికి శిఖ‌రం పైన్నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. ప్ర‌ముఖ న‌టుడు, హిందీ నాట‌క‌రంగ ప్ర‌ముఖుడు ర‌జ‌త్‌క‌ఫూర్ నిర్మించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫిలాస‌ఫీని ఇష్ట‌ప‌డేవాళ్లు, అనుభ‌వించేవాళ్లు ఆమేజాన్ ఫ్రైమ్‌లో చూడొచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp