శిష్యుడిని చూసి గురువే ఈర్ష్య పడితే - Nostalgia

By iDream Post Mar. 16, 2021, 08:33 pm IST
శిష్యుడిని చూసి గురువే ఈర్ష్య పడితే - Nostalgia

తెలుగు సినిమా చరిత్రలో కళాతపస్వి కె విశ్వనాథ్ గారి శైలి చాలా ప్రత్యేకం. కమర్షియల్ ఫార్ములాకు ఎదురీది సంగీత సాహిత్యాలతో కూడిన విలువలతో చిత్రాలు తీసి మాస్ ని సైతం మెప్పించేలా ఇండస్ట్రీ రికార్డులు సృష్టించడం అయన ప్రత్యేకత. దానికి మంచి ఉదాహరణలు శంకరాభరణం, స్వాతి ముత్యంలు. బిసి సెంటర్లలో సైతం ఇవి వంద రోజులు ఆడాయంటేనే అర్థం చేసుకోవచ్చు పండిత పామరులను సమాన స్థాయిలో మెప్పించిన విశ్వనాథ్ గారి విద్వత్తు. దర్శకుడిగా రిటైర్ మెంట్ తీసుకునేదాకా తాను అనుకున్న సిద్ధాంతాలకే కట్టుబడి సామాజికంగా ఎన్నో సున్నితమైన సమస్యలకు పరిష్కారం చూపడం వాటిలో గమనించవచ్చు.

1992 సంవత్సరం. చిరంజీవితో చేసిన ఆపద్బాంధవుడు ఊహించని విధంగా దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. ఘరానా మొగుడు లాంటి మసాలా బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ ని విశ్వనాథ్ గారు ఆవులు కాసేవాడిగా పిచ్చివాడిగా చూపించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. విమర్శకుల ప్రశంసలు వచ్చినా కాసులు రాలేదు. అందుకే ఇమేజ్ కి దూరంగా తన కథకు సూటయ్యే ఆర్టిస్టులతోనే సినిమా చేయాలనుకున్న విశ్వనాథ్ అప్పుడు సిద్ధం చేసుకున్న కథే స్వాతికిరణం. అప్పటిదాకా 1921, దళపతి, సామ్రాజ్యం లాంటి డబ్బింగ్ సినిమాల ద్వారానే మనకు పరిచయమున్న మమ్ముట్టి నటించిన మొదటి స్ట్రెయిట్ మూవీ ఇది.

అసూయ ఎంతటి పతనానికి దారి తీస్తుందో ఇందులో అద్భుతంగా చూపించారు. సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు అనంతరాయ శర్మ(మమ్ముట్టి)తన కన్నా వయసులో, తాహతులో, కులంలో చాలా చిన్నవాడైన గంగాధర్(మాస్టర్ మంజునాథ్) అద్భుత ప్రతిభను ఓర్వలేకపోతాడు. ఫలితంగా అతని ఆత్మహత్యకు కారణమవుతాడు. పాప చింతన ఎక్కువై ఊరి వదిలి వెళ్ళిపోయి దీనంగా బ్రతుకుతూ ఉంటాడు. చివరిదశలో ప్రాయశ్చిత్తం ఎలా చేసుకున్నాడనేదే కథ. మామ కెవి మహదేవన్ స్వరపరిచిన 12 పాటలు అమృత గుళికలుగా నిలిచాయి. సినిమా బాక్సాఫీస్ లెక్కలో అద్బుతాలు చేయకపోయినా ఒక గొప్ప కళాఖండాన్ని అందించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp