మహిళలు మెచ్చిన శుభలగ్నం - Nostalgia

By iDream Post Jul. 08, 2021, 09:00 pm IST
మహిళలు మెచ్చిన శుభలగ్నం - Nostalgia

సెంటిమెంట్ కథలతో ప్రయోగాలు చేయలేం అనుకుంటాం కానీ నిజంగా అది తప్పు. రిస్క్ అని భయపడటం తప్పించి ఒకవేళ ధైర్యం చేసి ముందడుగు వేస్తే ఎలాంటి అద్భుత ఫలితం దక్కుతుందో ఋజువు చేసిన సినిమా శుభలగ్నం. 1993లో హాలీవుడ్ లో 'ఇండీసెంట్ ప్రపోజల్' అనే మూవీ వచ్చింది. బ్రహ్మాండంగా ఆడింది కూడా. అందులో ఒక పాయింట్ తీసుకుని రైటర్ భూపతిరాజా సౌత్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు ఒక కథ రాసుకున్నారు. ఇది ఓ సందర్భంలో విన్న సంభాషణల రచయిత దివాకర్ బాబు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డికి యమలీల షూటింగ్ టైంలో ఈ ప్రతిపాదన తీసుకెళ్లారు. విన్నప్పుడు కొంచెం రిస్కేమో అనిపించింది.

అప్పటికాయన నిర్మాత అశ్వినిదత్, వెంకటేశ్వరరావులకు ఒక కమిట్ మెంట్ బాకీ ఉన్నారు. వాళ్లకూ ఈ సబ్జెక్టు నచ్చడంతో ప్రాజెక్టు పట్టాలు ఎక్కేసింది. స్క్రిప్ట్ శరవేగంగా సిద్ధమయ్యింది. కేవలం నలభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేలా ప్లానింగ్ వేసుకున్నారు. బడ్జెట్ కూడా తక్కువే. ప్రధాన పాత్రకు మిస్టర్ పెళ్ళాంతో అందరినీ ఫిదా చేసిన ఆమని కన్నా బెస్ట్ ఛాయస్ ఎస్వికి ఎవరూ కనిపించలేదు. సెకండ్ హీరోయిన్ గా రోజాను తీసుకున్నారు. ఫ్యామిలీ స్టోరీ అయినప్పటికీ మ్యూజికల్ గానూ తన స్థాయికి తగ్గ సంగీతం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎస్వి కృష్ణారెడ్డి గొప్ప ఆల్బమ్ ని సిద్ధం చేశారు. 1994 జూన్ లో మొదలై మూడు నెలల్లోనే ఫస్ట్ కాపీ రెడీ.

నిజానికి కథా చర్చలు జరుగుతున్నప్పుడు కోటి రూపాయలకు మొగుడిని అమ్ముకోవడం అనే పాయింట్ ని మహిళలు ఆదరిస్తారా అనే అనుమానం అందరిలోనూ ఉంది. అయితే ఒక మధ్యతరగతి స్త్రీని అత్యాశ అనే కోణంలో చూపిస్తున్నాం కానీ భర్తను విడగొట్టి ఆవిడను శాశ్వతంగా ఒంటరిగా వదిలేయడం లేదు కదా అనే లాజిక్ అందరికీ కన్వినింగ్ గా అనిపించింది. ప్రేక్షకులూ అదే అనుకున్నారు. 1994 సెప్టెంబర్ 30 ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన శుభలగ్నంకు జనం బ్రహ్మరథం పట్టారు. ఆ ఏడాది టాప్ గ్రాసర్స్ గా నిలిచిన ప్రేమికుడు, బొబ్బిలి సింహం, హలో బ్రదర్, యమలీల, భైరవ ద్వీపంలను చాలా సెంటర్స్ లో దాటడం చూసి ట్రేడ్ సైతం నివ్వెరపోయింది. నంది అవార్డు పొందిన చిలకా ఏ తోడు లేక పాట ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప ఆణిముత్యం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp