ఖరీదైన పాఠం నేర్పించిన సుబ్బు - Nostalgia

By iDream Post Mar. 02, 2021, 08:30 pm IST
ఖరీదైన పాఠం నేర్పించిన సుబ్బు - Nostalgia

ఏ హీరోకైనా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు దాని వెనుకనే ఫ్లాప్ రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎంత జాగ్రత్తగా ఉన్నా సదరు హిట్ పెంచిన అంచనాలు తర్వాత చిత్రం మీద ప్రభావం చూపించి ఫైనల్ గా రిజల్ట్ ని దెబ్బ కొడతాయి. శివ తర్వాత నాగార్జున, అల్లూరి సీతారామరాజు వచ్చాక కృష్ణ, ఖైదీ దెబ్బకు చిరంజీవి ఇలా ఇబ్బందులు పడిన వాళ్లే. ఇప్పటి జనరేషన్ హీరోలు సైతం దీనికి మినహాయింపు కాదు. యంగ్ టైగర్ ఉదాహరణ ఒకటి చూద్దాం. 2001లో 'నిన్ను చూడాలని'తో పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ కు అది లాంచింగ్ కు ఉపయోగపడింది తప్ప అభిమానులకు అంతగా నచ్చిన సినిమాగా మిగల్లేదు.

అప్పుడు రాజమౌళి తన డెబ్యూగా చేసిన 'స్టూడెంట్ నెంబర్ 1' అమాంతం తన స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. తారక్ లోని అసలైన నటుడిని ఎనర్జీని ప్రేక్షకులకు పరిచయం చేసి ఏకంగా ద్విశతదినోత్సవం జరుపుకుని కొత్త రికార్డులు నెలకొల్పింది. ముఖ్యంగా కీరవాణి పాటలకు జూనియర్ హుషారైన స్టెప్పులు రిపీట్ ఆడియన్స్ వచ్చేలా చేశాయి. ఇది షూటింగ్ లో ఉండగానే తారక్ మరో సినిమాకు సైన్ చేసాడు. అదే సుబ్బు. సురేష్ వర్మ దర్శకుడిగా సోనాలి జోషి హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో దీన్ని తెరకెక్కించారు. అప్పటికే భీభత్సమైన ఫామ్ లో ఉన్న మణిశర్మకు జూనియర్ ఎన్టీఆర్ తో ఇది మొదటి సినిమా. అందుకే పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

మంచి జీవితం కుటుంబాన్ని కలిగిన ఓ కాలేజీ యువకుడు విలన్ తన కూతురి విషయంలో చేసుకున్న అపార్థం వల్ల ఫ్యామిలీ మొత్తాన్ని ఆత్మహత్య రూపంలో పోగొట్టుకుని అనాధగా మారతాడు. మరో ట్విస్ట్ ఏంటంటే ఆ విలన్ చిన్న కూతురినే మన సుబ్బు ప్రేమించి ఉంటాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలే మిగిలిన స్టోరీ. కథను యూత్ కి కనెక్ట్ అయ్యేలాగే రాసుకున్నారు కానీ ట్రీట్మెంట్ లో వచ్చిన తేడా వల్ల సుబ్బు డిజాస్టర్ అయ్యింది. పాటలు వాటి చిత్రీకరణ కొంతమేర కాపాడాయి కానీ మెలో డ్రామా ఎక్కువైపోవడంతో సుబ్బు ఆశించిన అంచనాలు అందుకోలేక ఫెయిల్యూర్ గా మిగిలింది. గీతరచయిత జాలాది గారు రాసిన జననీ జన్మభూమి పాట సాహిత్యం, కంపోజింగ్ రెండు అద్భుతంగా ఉంటాయి. ఈ గాయం త్వరగా మానేలా 'ఆది' రూపంలో తారక్ కు మరుసటి ఏడాదే బ్లాక్ బస్టర్ దక్కింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp