అమితాబ్ దృష్టిలో పడ్డ మెగా మూవీ - Nostalgia

By iDream Post Mar. 24, 2021, 08:45 pm IST
అమితాబ్ దృష్టిలో పడ్డ మెగా మూవీ - Nostalgia
ఖైదీతో స్టార్ డం వచ్చాక చిరంజీవితో కమర్షియల్ ఎంటర్ టైనర్లు చేస్తే ఏ స్థాయిలో కనకవర్షం కురుస్తుందో నిర్మాతలు ప్రత్యక్షంగా చూస్తున్న రోజులవి. ఆయన డేట్లు ఏ ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నాయని తెలియడం ఆలస్యం కాంబినేషన్ ఏంటో చూసుకోకుండా మరీ బయ్యర్లు అడ్వాన్సులతో ఉక్కిరిబిక్కిరి చేసేవాళ్ళు. 1989లో సంక్రాంతి కానుకగా వచ్చిన 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' రికార్డులు చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. సరదాగా సాగే అత్తాఅల్లుళ్ళ కథతో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టుకోవచ్చా అని నెలల తరబడి వాటి గురించే మాట్లాడుకున్నారు. అప్పుడు మొదలయ్యిందే స్టేట్ రౌడీ.

దీనబంధుగా పిలుచుకునే నిర్మాత టి సుబ్బరామిరెడ్డి గారికి చిరంజీవితో ఇదే మొదటి సినిమా. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్ కేటాయించారు. అప్పటికి దర్శకుడు బి గోపాల్ చేసింది ఆరు సినిమాలే. వాటిలో ఒకటి హిందీ. నాగార్జునతో చేసిన విజయ్ మాత్రమే ఫ్లాప్ కాగా మిగిలినవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. పరుచూరి సోదరులు తయారు చేసిన పవర్ ఫుల్ సబ్జెక్టుకు న్యాయం చేయగలరనే నమ్మకంతో ఈ బాధ్యతను ఆయనకు అప్పగించారు. భానుప్రియ, రాధ హీరోయిన్లుగా శారద, సత్యనారాయణ, రావుగోపాల్ రావు, నూతన్ ప్రసాద్, జగ్గయ్య, అల్లు, అన్నపూర్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. కాళీచరణ్ అనే కొత్తగా వచ్చిన రౌడీ ఊళ్ళో ఉన్న దాదాలు, గూండాల పని పడుతూ పోలీసుల దృష్టిలో పడతాడు.

కట్ చేస్తే అతను అండర్ కవర్ ఆపరేషన్ మీద శారద నియమించిన పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. దీంతో సెకండ్ హాఫ్ లో ఖాకీ డ్రెస్సుతో మన పృథ్వి ఎలా చట్టాన్ని కాపాడాడు అనే పాయింట్ మీద కథ సాగుతుంది. బప్పీలహరి అందించిన పాటలు మారుమ్రోగిపోయాయి. వీటి కోసమే వచ్చిన రిపీట్ ఆడియన్స్ ఎందరో. నైజామ్ ఏరియాలో కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమాగా స్టేట్ రౌడీ నిలిచింది. మొదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ క్రమంగా సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. దీని వసూళ్ల గురించి అమితాబ్ ఎంక్వయిరీ చేసే స్థాయిలో ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ కథనం ప్రచురించడం ముంబై మీడియాని షాక్ లో ముంచెత్తింది. 1989 మార్చి 23 విడుదలైన స్టేట్ రౌడీ కలెక్షన్ల మీద కేవలం రెండు వారాల గ్యాప్ తో వచ్చిన ముద్దుల మావయ్య ప్రభావం చూపించిన మాట వాస్తవం.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp