శ్రీఆంజనేయం - ఫలితం విఫలం - Nostalgia

By iDream Post Mar. 17, 2021, 08:30 pm IST
శ్రీఆంజనేయం - ఫలితం విఫలం - Nostalgia

సినిమాల్లో భక్తిని జొప్పించి దేవుడిని మెయిన్ సబ్జెక్టుగా తీసుకుని ప్రేక్షకులను నమ్మించడం అంత సులువు కాదు. ఎందుకంటే వీటిలో ఫాంటసీకి చోటు తక్కువ. ఎంతసేపు పురాణాలూ గాథలను ఆధారంగా తీసుకుని వాటిలో అంశాలు చూపించాల్సిందే తప్ప కొత్త ప్రయోగాలు చేస్తే సక్సెస్ అయిన దాఖలాలు తక్కువ. అందులోనూ మార్కెట్ కోసం ఇలాంటి కథల్లో కమర్షియల్ అంశాలను జోడిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. శ్రీ షిరిడిసాయిబాబా మహత్యం, శ్రీ వెంకటేశ్వర మహత్యం లాంటి చిత్రాలు చరిత్రలో నిలిచిపోవడానికి కారణాలు అందులో సమన స్థాయిలో ఉండే విలువలు, మైమరపించే పాటలు.

కానీ ప్రతిసారి ఇలాంటి అద్భుతాలు సాధ్యం కాదు. కొలతలో ఏ మాత్రం తేడా వచ్చినా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. 2004 సంవత్సరం. 'జయం'తో పరిచయమై డెబ్యూతోనే సంచలన సక్సెస్ అందుకున్న నితిన్ కు 'దిల్' మరో విజయం అందించగా సంబరం ఫలితం షాక్ ఇచ్చింది. మరోవైపు దర్శకుడు కృష్ణవంశీ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. సిందూరం, చంద్రలేఖ లాంటి సినిమాలు ఆశించిన రిజల్ట్ ఇవ్వనప్పటికీ అంతఃపురం, మురారి, ఖడ్గంలు ఆయన స్థాయిని అమాంతం పెంచేశాయి. ప్రతి చిత్రానికి విలక్షణమైన కథలు ఎంచుకునే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఈసారి ఆంజనేయుడిని కథావస్తువుగా తీసుకుని ఒక ఫాంటసీ తీసేందుకు సిధ్ధపడ్డారు. అదే శ్రీ ఆంజనేయం.

విలన్ వల్ల తల్లితండ్రులు చనిపోయి అనాథగా పెరిగిన అమాయకుడైన హీరోకు సాక్ష్యాత్తు ఆ ఆంజనేయుడే అండగా నిలబడే పాయింట్ తో కృష్ణవంశీ ఈ స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. కొంత 'ముత్యాలముగ్గు' స్ఫూర్తి కనిపిస్తుంది. లైన్ పరంగా బాగున్నప్పటికీ ఛార్మీ పాత్ర అవసరానికి మించి ఓవరాక్షన్ చేయడం, పాటల్లో శృంగార రసం శృతిమించడం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చలేదు. మణిశర్మ సంగీతం, ప్రతినాయకుడిగా పిల్లా ప్రసాద్ మంచి నటన నీరసంగా నడిచే కథనాన్ని కాపాడలేకపోయాయి. ఆంజనేయుడిగా అర్జున్ నటన, గ్రాఫిక్స్ డ్యామేజ్ ఎక్కువ జరగకుండా కాపాడాయి. 2004 జులై 23న విడుదలైన శ్రీఆంజనేయం అంచనాలు అందుకోలేకపోయింది. అదే రోజు రిలీజైన హాలీవుడ్ డబ్బింగ్ 'స్పైడర్ మ్యాన్ 2' ఘన విజయం సాధించడం కొసమెరుపు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp