స్నేహితులంటే వీళ్ళేరా - Nostalgia

By iDream Post Jun. 05, 2021, 08:30 pm IST
స్నేహితులంటే వీళ్ళేరా - Nostalgia
ప్రపంచంలో స్నేహం ఎవరి మధ్య అయినా ఉండొచ్చు. ఇక్కడ ఆడామగా అనే తేడా లేదు. అయితే మన చుట్టూ ఉన్న సమాజం గీసిన పరిమితుల వల్ల బంధుత్వ పరంగా సంబంధం లేని ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరగా మసలితే వాళ్ళ మధ్య ఏదో ఉందనుకుని చిలువలుపలువలు ప్రచారం చేసే జనాలు ఎందరో. అందుకే స్వంత అన్నయ్యతో బైక్ మీద వెళ్లినా సరే ఓ అమ్మాయి చుట్టూ వెయ్యి కళ్ళు అనుమానంగా చూసే ప్రపంచంలో ఉన్నాం మనం. బంధాలు చాలా సున్నితంగా మారిపోతున్న తరుణంలో అనుమానం అనే పెనుభూతం భార్యాభర్తల మధ్య వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో తీసిన ఒక మంచి ఎమోషనల్ డ్రామా స్నేహితులు.

1998 సంవత్సరం. దర్శకులు ముత్యాల సుబ్బయ్య పెద్ద ఫామ్ లో ఉన్నారు. చిరంజీవి హిట్లర్, వెంకటేష్ పవిత్రబంధం-పెళ్లిచేసుకుందాం, రాజశేఖర్ సూర్యుడు, పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత ఇలా ఎవరితో చేసినా బ్లాక్ బస్టర్లు వచ్చి పడుతున్నాయి. ఆయన కేవలం స్టార్లతోనే చేయాలనే నియమం పెట్టుకోకుండా సబ్జెక్టు డిమాండ్ చేస్తే చిన్న ఆర్టిస్టులతోనైనా తీసేందుకు సిద్ధమనేవారు. ఆ సమయంలో పోసాని కృష్ణమురళి చెప్పిన ఒక కథ సుబ్బయ్యగారిని బాగా ఆకట్టుకుంది. శ్రీనివాసరెడ్డి నిర్మాతగా దీనికి శ్రీకారం చుట్టారు. చేసిన ఎనిమిది సినిమాల్లో నాలుగు హిట్లున్న వడ్డే నవీన్ ని హీరోగా ఎంచుకున్నారు.

పేరుకి సాక్షి శివానంద్ హీరోయిన్ అయినా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే కీలకమైన పాత్ర మాత్రం రాశికి దక్కింది. కోటి సంగీత దర్శకుడిగా సుధాకర్, నర్రా, చలపతిరావు, వేణు మాధవ్, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు ఇతర తారాగణం. రీజనబుల్ బడ్జెట్ లో సినిమాను పూర్తి చేశారు.  ఏ పాపం తెలియని భార్య(రాశి)మీద అనుమానంతో భర్త(ఆనంద్)నరకం చూపిస్తుంటే ఆమె స్నేహితుడు(నవీన్ వడ్డే)అందరికీ కనువిప్పు కలిగించి జీవితాన్ని ప్రసాదించడం ఇందులో మెయిన్ పాయింట్. రాశి నటన అద్భుతంగా పండడంతో పాటు ఎమోషన్లు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. 1998 సెప్టెంబర్ 11న రిలీజైన స్నేహితులు సూపర్ హిట్ అయ్యి ఏకంగా వంద రోజుల వేడుక కూడా జరుపుకుంది
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp