చెరిగిపోని నెత్తుటి సంతకం - Nostalgia

By iDream Post Jul. 28, 2020, 05:17 pm IST
చెరిగిపోని నెత్తుటి సంతకం - Nostalgia

(ఇరవై మూడేళ్ళ క్రితం వచ్చిన సిందూరం సినిమా గురించి అప్పటి ఓ టీనేజ్ కుర్రాడి అనుభవాల మాల)

విప్లవం అంటే ఏమిటి ?

తిరుగుబాటు ఎందుకు వస్తుంది ?

మన మధ్యే ఉండాల్సిన మనుషులు అడవి బాట పట్టి పోలీసులతో ఎందుకు నిరంతర యుద్ధం చేస్తున్నారు ?

సంఘంలో జరుగుతున్న అరాచకాలకు అన్నలే ఎందుకు పోరాడాలి ?

రాజకీయ నాయకులు ఎందుకు ఈ వ్యవస్థకు కారణమయ్యారు ?

ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అప్పుడప్పుడే సమాజపు పోకడను అర్థం చేసుకుంటున్న నా 16 ఏళ్ళ వయసులో మెదులుతూ ఉండేవి. ఆర్ నారాయణమూర్తి గారి సినిమాల్లో వాటికి జవాబు వెతికే ప్రయత్నం చేసేవాడిని కాని ఆయన సిద్ధాంతాలను అర్థం చేసుకునేంత పరిపక్వత నాలో లేకపోవడం వల్ల అవి నా అసంతృప్తిని చల్లార్చలేకపోయాయి.......

అప్పుడు వచ్చింది సిందూరం.......

నిన్నే పెళ్లాడతా విడుదలయ్యాక కృష్ణవంశీ ఒక సంచలనం. ఓ మాములు ప్రేమకథను అందమైన పెయింటింగ్ లా ఆయన చెప్పిన తీరుకు థియేటర్లు కుటుంబాలతో జాతరలను తలపించాయి. హాళ్ల ఓనర్ల బ్యాంకు అకౌంట్లు భారీ నెంబర్లతో కళకళలాడాయి. ఇక సంగీతం సంగతి సరేసరి. దీని ముచ్చట్లు మరోసారి చెప్పుకుందాం. ఆ ప్రభావం వల్లే కథ దేని గురించో తెలియకుండానే సింధూరం మీద సినిమా ప్రేమికులు కొండంత అంచనాలు పెట్టేసుకున్నారు. వాళ్లలో నేనూ ఒకడిని. అప్పటికే చిన్న చిన్న కవితలు పాటలు రాయడం మొదలుపెట్టిన లేలేత కలం మరికాసేపట్లో తీవ్ర అంతర్మథనం చెందబోతోందని ఊహించలేక టికెట్ కొని లోపలికి అడుగు పెట్టాను

1997 సెప్టెంబర్ నెల

ఆదోని మినీ ద్వారకా థియేటర్. సీటింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. స్నేహితులతో కలిసి మూడో రోజు మధ్యాన్నం వెళ్ళా . చాలా సులభంగా టికెట్లు దొరికితే షాక్ అయ్యా. ఇదేంటి వచ్చి వారం కూడా కాలేదు అప్పుడే కృష్ణవంశీ సినిమాకు రద్దీ లేకపోవడం ఏమిటాని. అలా ఆలోచనలతో సతమవుతూనే లోపల పల్చగా ఉన్న జనాన్ని చూసి ఆశ్చర్యపోతూ చూడటం మొదలుపెట్టా. అప్పటికే దీని పాటలు ఇంట్లో టేప్ రికార్డర్ లో విన్నా నిన్నే పెళ్లాడతా హ్యాంగ్ ఓవర్ లో అవి అప్పటికింకా ఎక్కలేదు.

టైటిల్ కార్డు పాటతోనే మొదలైంది.

"కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూస్తూ తగువుకు లేస్తారే.... జనాలు తలలర్పిస్తారే"

ఒక్కో పదం నిప్పుకణికలా గుండెలోతుల్లోకి దూసుకుపోతోంది. అప్పటికే సిరివెన్నెల గారి శిష్యుడిగా ఏకలవ్య సాధన చేస్తున్న నాకు ఆ పాటలో అర్థం తెలుసుకునే కొద్దీ రోమాలు నిక్కబొడుచుకోవడమంటే ఏమిటో ప్రత్యక్షంగా అనుభవమయ్యింది. మన చుట్టూ మనలోనే ఉన్న మలిన మనస్తత్వాన్ని శాస్త్రి గారు ఎండగడుతున్న తీరుకి గొంతుకు ఏదో అడ్డుపడుతున్న ఫీలింగ్. ఇంత గొప్ప సాహిత్యం ఒక రచయిత నుంచి రాబట్టాలి అంటే అంతకన్నా గొప్పగా ఆలోచించే దర్శకుడు తన ఉద్దేశాన్ని చెప్పగలిగే సత్తా ఉన్నవాడు అయ్యుండాలి. నిన్నే పెళ్లాడతా కృష్ణవంశీని అప్పటికే మర్చిపోయా. సిందూరం రూపంలో కొత్తగా కనిపించడం మొదలుపెట్టారు

పైన చెప్పిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకడం మొదలైంది.

రాజ్యాంగం ఏర్పరిచిన వ్యవస్థ పౌరుల హక్కులను కాపాడుతుందని బలంగా నమ్మే ఒక కానిస్టేబుల్ అది జరగక చివరికీ తాను ఉద్యమంలో ఓ సమిధలా మారిపోయే క్రమాన్ని.....

జీవితం అంటే సరదా తప్ప ఇంకేమి ఉండదని భావించే ఓ జులాయి కుర్రాడు అనుకోకుండా కుళ్ళుని ఊడ్చే క్రమంలో తానూ ఆ చీపురులో పుల్లగా మారిన ఓ చైతన్యపు ప్రహసనాన్ని.....

అడవుల్లో నుంచే మార్పు మొదలువుతుందని బలంగా నమ్మి మార్పు కోసం ప్రజల బాగు కోసం ఎన్ని ప్రాణాలు తీసినా తప్పు లేదని భావించే ఓ నక్సలైట్ లీడర్ పోరాటతత్వాన్ని......

కళ్లార్పకుండా చూస్తూనే ఉన్నా. నేరుగా పరిచయం లేని ఓ మేధావి వెండితెరను వేదికగా చేసుకుని నా ప్రశ్నలకు సమాధానం బుల్లిరాజు - చంటి - బైరాగి - గోపాల్ రెడ్డి - బేబీ పాత్రల ద్వారా ఒక్కొక్కరిగా విడమర్చి చెప్పడాన్ని ప్రపంచాన్ని మర్చిపోయి మరీ చూస్తున్నా.....

పక్కనే ఇదేం సినిమారా అని నిట్టూరుస్తున్న మిత్రుల మాటలు నా చెవికి చేరడానికి ఇష్టపడటం లేదు. హౌస్ ఫుల్ ఎందుకు కాలేదో ఇప్పుడు అర్థం అయ్యిందా అంటూ దెప్పి పొడుస్తున్న ఇంకో స్నేహితుడి ఎగతాళి నేను స్వీకరించలేదు.

కొన్ని ప్రయత్నాలు ఆర్థికపరమైన లెక్కలకు అతీతంగా ఉంటాయి. సిందూరం అలాంటిదే.

ఆ తర్వాత మురారి - రాఖీ - ఖడ్గం - చందమామ లాంటి ఎన్నో క్లాసిక్స్ తీసినా నాకు మాత్రం సిందూరం నుదుటిపై దానికి లోపల మెదడుపై చేసిన ప్రత్యేక సంతకంగా బయటకి కనిపించని పచ్చబొట్టుగా నిలిచిపోయింది. అది ఎన్నటికీ చెరగదు.

ఇవాళ కృష్ణవంశీ బర్త్ డే సందర్భంగా ఈ జ్ఞాపకం నా మనోఫలకం నుంచి బయటికి వచ్చిన దృశ్యమాలిక.

ఒకప్పటి కృష్ణవంశీ మళ్ళీ కావాలి. ఆయనలో రెండో మనిషి తీసిన మొగుడు - నక్షత్రం లాంటివి ఇక చాలు. తనకు మాత్రమే సాధ్యమయ్యే సిందూర ఆవిష్కరణలకు మళ్ళీ శ్రీకారం చుట్టాలి........ వాటికి నేనో సాక్షిగా నిలవాలి....

వేచి చూస్తూ....
ఇట్లు....
ఓ సగటు అభిమాని

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp