నరసింహరాజుకు విజయం దాసోహం - Nostalgia

By iDream Post May. 05, 2021, 09:00 pm IST
నరసింహరాజుకు విజయం దాసోహం - Nostalgia
ఇప్పుడంటే తగ్గిపోయాయి కానీ ఒకప్పుడు విలేజ్ డ్రామా సెంటిమెంట్ సినిమాలకు బ్రహ్మాండమైన ఆదరణ ఉండేది. క్లాసు మాసు అనే తేడా లేకుండా అందరు విరగబడి చూసేవాళ్ళు. అన్నీ సరిగ్గా పండాలే కానీ ఇవి కురిపించే కనకవర్షానికి హద్దులు కనిపించేవి కావు. పెదరాయుడు లాంటివి మంచి ఉదాహరణలుగా చెప్పొచ్చు. అయితే ఈ తరహా చిత్రాలు తమిళంలో ఎక్కువగా రూపొందేవి. అక్కడ హిట్టయ్యాక మనవాళ్ళు రీమేక్ హక్కులు కొనుక్కుని చేసుకున్న దాఖలాలు ఎన్నో. అధిక శాతం విజయం సాధించాయి కూడా. చిరంజీవి తో మొదలుకుని సునీల్ దాకా ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయని హీరోలు లేరంటే అతిశయోక్తి కాదు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం.

డైలాగ్ కింగ్ సాయి కుమార్ హీరోలు రాజశేఖర్, సుమన్ లకు తన గొంతును ఇవ్వడం మానేశాక వాళ్ళ కెరీర్ గ్రాఫ్ ప్రభావితం చెందిన మాట వాస్తవం. పోలీస్ స్టోరీ బ్లాక్ బస్టర్ తో సాయికు కనీసం తన సినిమాలకు డబ్బింగ్ చెప్పే టైం కూడా ఉండేది కాదు. అందుకే ఆ ఇద్దరి దర్శక నిర్మాతలు వేరే ఆప్షన్లు చూసుకోవడం మొదలుపెట్టారు. 1997లో వచ్చిన 'మా ఆయన బంగారం' నుంచి రాజశేఖర్ కు వేరే గొంతు వినిపించడం మొదట్లో ప్రేక్షకులు ఇబ్బందిగా ఫీలైనా ఆ తర్వాత క్రమంగా అలవాటు చేసుకున్నారు. అక్కడి నుంచి యాంగ్రీ మ్యాన్ కి ఒక హిట్టు వస్తే మూడు ఫ్లాపులు పలకరించేవి. అయిదేళ్ల కాలంలో సూర్యుడు, శివయ్య, మా అన్నయ్య ఇలా కేవలం మూడు సక్సెస్ లు మాత్రమే దక్కాయి. 2000 సంవత్సరంలో శరత్ కుమార్ హీరోగా సూర్యప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన 'మాయి' అక్కడ సంచలన విజయం సాధించింది.

దీన్ని నిర్మించిన ఆర్బి చౌదరి ఇలాంటివి ఇక్కడి స్టార్ హీరోలతో రీమేకులు చేసి ఘనవిజయాలు సొంతం చేసుకుంటున్న సమయం. ఈ సినిమాని కూడా రాజశేఖర్ తో 'సింహరాశి' టైటిల్ తో వి సముద్ర డైరెక్షన్ లో పెద్దగా మార్పులు చేయకుండా తీశారు. హీరోయిన్ గా సాక్షి శివానంద్ ని తీసుకున్నారు. తప్పు చేస్తే తండ్రిని చంపేందుకు కూడా సిద్ధపడే ఊరి పెద్ద నరసింహరాజు కథకు మదర్ సెంటిమెంట్ ని జోడించి తీసిన తీరు ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఎస్ఏ రాజ్ కుమార్ పాటలు అలరించాయి. 2001 జూన్ లో మూడు భారీ సినిమాలు బావ నచ్చాడు, భలేవాడివి బాసూ, శ్రీ మంజునాథ తీవ్రంగా నిరాశపరిచాయి. ఆ టైంలో నిరాశలో ఉన్న బయ్యర్లకు లాభాలు కురిపిస్తూ జూలై 6న రిలీజైన సింహరాశి సూపర్ హిట్ కొట్టింది. కాస్త డౌన్ లో ఉన్న రాజశేఖర్ మార్కెట్ ని తిరిగి నిలబెట్టి కొత్త ఊపిరినిచ్చింది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp