ఫలితమివ్వని సీమ ఫార్ములా - Nostalgia

By iDream Post Mar. 15, 2021, 08:33 pm IST
ఫలితమివ్వని సీమ ఫార్ములా - Nostalgia

ఒక డెబ్యూ దర్శకుడికి చిన్న హీరోతో పెద్ద హిట్టు పడ్డాక ఎవరైనా స్టార్ హీరో నుంచి ఆఫర్ వస్తే దాన్ని వాళ్ళ అంచనాలకు తగ్గట్టు నిలబెట్టుకోవడం చాలా పెద్ద సవాల్. అందులోనూ అభిమానులు ఆశిందేమిటో రాసుకున్న కథలో జొప్పించి వాళ్ళను మెప్పించడం అంత సులభం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా అసలుకే మోసం వచ్చి కెరీర్ ఒక్కసారిగా కుదుపులకు లోనవుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. 2000 సంవత్సరంలో వేణుతో తీసిన చిరునవ్వుతో ద్వారా ఇండస్ట్రీ దృష్టిలో గట్టిగా పడ్డారు దర్శకుడు జి రామ్ ప్రసాద్. దాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులనే కాదు పరిశ్రమ వర్గాలలోనూ అందరినీ ఆకర్షించింది. ఆ టైంలో జరిగిందా విశేషం.

నందమూరి బాలకృష్ణ నుంచి రామ్ ప్రసాద్ కు పిలుపు. చిన్నికృష్ణ అందించిన కథ ఒకటి బాగా నచ్చి పరుచూరి సోదరులతో స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. ముందుగా బి గోపాల్ తో అనుకున్నారు కానీ ఆ టైంలో ఆయనకున్న కమిట్ మెంట్స్ వల్ల అది కాస్తా రామ్ ప్రసాద్ కు వచ్చి చేరింది. అప్పటికే రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడులతో చరిత్ర సృష్టించిన బాలయ్యను మరోసారి అలాంటి పవర్ ఫుల్ పాత్రలో చూడబోతున్నామన్న ఆనందంలో అభిమానుల్లో మొదలయ్యింది. సోలో హీరోగా ఫుల్ ఫామ్ లో ఉన్న సాయికుమార్ ప్రత్యేక పాత్ర చేసేందుకు ఒప్పుకున్నారు. తమిళ దర్శకుడు పి వాసు విలన్ గా నటించారు.

టాప్ ఫామ్ లో ఉన్న సిమ్రాన్ ని, మనసంతా నువ్వేతో వెలుగులోకి వచ్చిన రీమా సేన్ ని హీరోయిన్లుగా తీసుకున్నారు. కె విశ్వనాధ్, రఘువరన్, జయప్రకాశ్ రెడ్డి, చరణ్ రాజ్, భరణి ఇలా భారీ తారాగణం సెట్ చేసుకున్నారు. సీమసింహం టైటిల్ అనౌన్స్ చేశాక ట్రేడ్ లో విపరీతమైన క్రేజ్. బిజినెస్ క్రేజీగా జరిగింది. అయితే సినిమాలో మెలో డ్రామా ఎక్కువ కావడం, పోలీస్ ఆఫీసర్ పాత్రలో నడిచే ఫ్లాష్ బ్యాక్ అంతగా కిక్ ఇవ్వకపోవడంతో సీమ సింహం ఆశించిన ఫలితాన్ని అందుకోలేపోయింది. 2002 జనవరి 11 సంక్రాంతి కానుకగా విడుదలై ఓపెనింగ్స్ లో రికార్డులు సొంతం చేసుకుంది. కానీ అసలు పోటీనే కాదనుకున్న తరుణ్ 'నువ్వు లేక నేను లేను' బ్లాక్ బస్టర్ అయ్యింది. సీమసింహం తర్వాత ఒక్క రోజు ఆలస్యంగా రిలీజైన 'టక్కరిదొంగ' కూడా సోసోగానే ఆడటం ఫైనల్ ట్విస్ట్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp