సిల్వర్ స్క్రీన్ పై 'సత్య' తుఫాను - Nostalgia

By iDream Post Oct. 17, 2020, 09:34 pm IST
సిల్వర్ స్క్రీన్ పై 'సత్య' తుఫాను - Nostalgia

మాఫియా కథలు భారతీయ సినిమాకు కొత్తేమి కాదు కానీ వర్మ వచ్చాకే వాటికో స్టైలిష్ మేకింగ్ వచ్చిందన్నది వాస్తవం. అంతకు ముందు అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు ఈ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో చిత్రాలు చేశారు. కానీ అవన్నీ కమర్షియల్ సూత్రాలకు లోబడి రూపొందినవి. ఈ పద్ధతిని మారుస్తూ ఓ ట్రెండ్ కు శ్రీకారం చుడుతూ వర్మ రూపొందించిన సినిమా సత్య. జెడి చక్రవర్తి హీరోగా మనోజ్ బాయ్ పాయ్ మరో కీలకపాత్రలో స్నేహానికి దందాకు ముడిపెట్టి ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన తీరు దీన్నో క్లాసిక్ గా మార్చేసింది. 1998లో వర్మ పేరు మరోసారి బాలీవుడ్ లో మారుమ్రోగేలా చేసింది. దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు చూద్దాం. రంగీలా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వర్మకు దౌడ్ రూపంలో డిజాస్టర్ ఎదురయ్యింది. ఆ టైంలో ఒక మంచి యాక్షన్ సినిమా చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ అదే సమయంలో అనుకోకుండా కొందరు క్రిమినల్స్ ని కలవాల్సి వచ్చి తన ఆలోచనలకు సత్యగా రూపం ఇచ్చారు.

మాడరన్ ఏజ్ కల్ట్ డైరెక్టర్ గా ఇప్పుడు పేరు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్ ని అసోసియేట్ గా, నటుడు సౌరభ్ శుక్లాలను రచయితలుగా తీసుకున్నారు. కేవలం 2 కోట్ల లోపే బడ్జెట్ తో సత్య పూర్తిగా ముంబైలోనే షూటింగ్ జరుపుకుంది . వచ్చిన వసూళ్లు అక్షరాలా 15 కోట్ల పైమాటే. నిజానికి సత్య టైటిల్ రోల్ కోసం ముందు మనోజ్ బాయ్ పాయ్ ని అనుకున్నారు. కానీ భికూ మాత్రే పాత్రకైతేనే అతను న్యాయం చేస్తాడని మనసు మార్చుకున్నారు. అదే నిజమై మనోజ్ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు సాధించాడు. ముందు హీరోయిన్ గా పర దేస్ ఫేమ్ మహిమా చౌదరిని అనుకున్నారు. ఆమె నో చెప్పడంతో ఛాన్స్ ఊర్మిళాకు దక్కింది. సత్య పాత్రకు స్ఫూర్తి వర్మ నిజ జీవిత స్నేహితుడే. 1994 ఢిల్లీ ఉపహార్ థియేటర్లో జరిగిన కాల్పుల ఘటనను స్ఫూర్తిగా తీసుకుని ఇందులో ఓ ఎపిసోడ్ పెట్టారు. గాయం సినిమాలో కూడా ఇలాంటి ఘటనే ఉంటుంది.

ముందు సత్యను పాటలు లేకుండా తీద్దామనుకున్నారు. కానీ బిజినెస్ కోసం పెట్టక తప్పలేదు. ఆడియో సక్సెస్ అయ్యాక కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సెపరేట్ ఆల్బమ్ ని కొంత కాలం అయ్యాక రిలీజ్ చేశారు. మొదటిసారి షూటింగ్ అయ్యాక ఓ 60 ఆడియన్స్ కి బాంద్రా డింపుల్ థియేటర్లో సత్యని స్పెషల్ షో వేసి చూపించారు. వాళ్ళ నుంచి కొంత నెగటివ్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ హాఫ్ లో చాలా భాగం రీ షూట్ చేశారు. అప్పుడు బాగా వచ్చింది. టైటిల్ పెట్టడానికి కారణం వర్మకు బాగా ఇష్టమైన హిందీ క్లాసిక్స్ లో ఉన్న ఓంపురి అర్ద్ సత్య సినిమా ప్లస్ అయన ప్రియురాలి పేరు అదే కావడం. కల్లు మామ పాట షూట్ కు కొరియోగ్రాఫర్ రాకపోవడంతో దర్శకుడే కంపోజ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్. 1998లో ఇండియన్ పనోరమా విభాగంలో సత్య ఎంపికయ్యింది.సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్ కు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఆరు ఫిలిం ఫేర్, ఒక నేషనల్ అవార్డుతో సత్య ఇన్నేళ్ల తర్వాత కూడా బెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా నిలిచిపోయింది. తెలుగులోనూ ఇదే టైటిల్ తో డబ్ చేస్తే ఇక్కడా ఘన విజయం సొంతం చేసుకుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp