ఒకే కథతో మళ్ళీ మళ్ళీ సినిమా - Nostalgia

By Ravindra Siraj Feb. 09, 2020, 03:45 pm IST
ఒకే కథతో మళ్ళీ మళ్ళీ సినిమా - Nostalgia

కొన్ని సినిమా విచిత్రాలు చూడడానికి వినడానికి భలే వింతగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఏదైనా సబ్జెక్ట్ ఒక భాషలో హిట్ అయ్యిందంటే మరో భాషలో డబ్బింగ్ లేదా రీమేక్ చేయడం సర్వసాధారణంగా జరిగేదే. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ అదే కథను సినిమాలగా తీస్తూ పోతే దాన్నేమంటారు. అలాంటి వింతలు పరిశ్రమలో బోలెడున్నాయి. మచ్చుకు ఒకటి చూద్దాం

32 ఏళ్ళ క్రితం అంటే 1988లో కృష్ణంరాజు, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో ప్రాణ స్నేహితులు అనే సినిమా వచ్చింది. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అనే పాట అప్పట్లో మారుమ్రోగిపోయింది. భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ప్రాణ స్నేహితులు చెప్పుకోదగ్గ సక్సెస్ నే అందుకుంది. ఇందులో రాధ హీరోయిన్. సుప్రసిద్ధ వి మధుసూదనరావు గారి దర్శకత్వంలో రాజ్ కోటి సంగీతంలో జనం దీన్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు. అంతకు ముందు సంవత్సరం హిందీలో సూపర్ హిట్ అయిన ఖుద్ కర్జ్ కి ఇది రీమేక్. అందులో శత్రుఘ్న సిన్హా, జితేంద్ర హీరోలుగా నటించారు. హృతిక్ రోషన్ నాన్న రాకేష్ రోషన్ దర్శకుడు. అసలు వీటికి మూలం 1979లో జెఫ్రీ ఆర్చర్ రాసిన కేన్ అండ్ ఆబెల్ నవల. దీనికి కమర్షియల్ హంగులు జోడించి వీటిని తీశారు

1992లో రజినీకాంత్ హీరోగా ఇదే ప్రాణ స్నేహితులుని అన్నామలైగా రీమేక్ చేస్తే ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సురేష్ కృష్ణ దర్శకుడు. దేవా సంగీతం అప్పట్లో చార్ట్ బస్టర్. దీని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇటీవల వచ్చిన దర్బార్ లో కుడా వాడుకున్నారంటే ఇది ఎంత ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రాణ స్నేహితులులో నటించిన శరత్ బాబు ఇందులోనూ అదే పాత్ర చేయడం విశేషం. హీరొయిన్ గా ఖుష్బూ నటించింది. దీంట్లో సురేష్ కృష్ణ పనితనం చూసే రజనీకాంత్ బాషాకు ఇతన్నే రికమండ్ చేశాడు. ఈ అన్నామలైనే బిర్లా రాముడుగా మళ్ళీ తెలుగులో డబ్బింగ్ చేసి వదిలారు. అక్కడితో కథ అయిపోలేదు.

ఏడాది గ్యాప్ తర్వాత వెంకటేష్, సుమన్ హీరోలుగా ఇదే కథను కొండపల్లి రాజాగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మళ్ళీ తీశారు. అయినా హిట్ అయ్యింది. కీరవాణి సంగీతం బాగా ప్లస్ అయ్యింది. ఒకకరంగా చెప్పాలంటే ఇది మల్టీ స్టారర్ గానే ప్రమోట్ అయ్యింది. సుమన్ కు ఆ టైంలో మార్కెట్ తో పాటు మంచి ఇమేజ్ ఉండేది. నగ్మా గ్లామర్, కోట విలనీ, సుధాకర్ కామెడీ, ఫైట్లు అన్ని వర్కవుట్ అయ్యాయి. కట్ చేస్తే కొండపల్లి రాజా ఫైనల్ గా లాభాలు ఇచ్చాడు. ఈ లెక్కన ఒకే కథను తెలుగులో మూడు సార్లు మన ప్రేక్షకులు చూశారన్న మాట. హిందీ మూవీస్ చూసే అలవాటున్న వాళ్లకు మరో బోనస్ ఖుద్ గర్జ్. కథలో నిజంగా దమ్ముంటే ఇలా ఒకే కథను ఎన్ని భాషల్లో అయినా ఎన్నిసార్లయినా చూస్తారని చెప్పడానికి ఇంత కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదేమో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp