రావుగారితో రౌడీ బంధం - Nostalgia

By iDream Post Aug. 11, 2020, 06:58 pm IST
రావుగారితో రౌడీ బంధం - Nostalgia

రెండో తరం హీరోల్లో అందమైన నటుడిగా పేరు పొందిన సుమన్ కు ప్రత్యేకమైన ఫాన్ ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా అమ్మాయిలకు ఇతనంటే మహా క్రేజ్. కెరీర్ మధ్యలో వ్యక్తిగతంగా కొన్ని చట్టపరమైన చిక్కుల్లో పడ్డప్పటికీ త్వరగానే బయటికి వచ్చి రెండో ఇన్నింగ్స్ తో మళ్ళీ తన స్టామినా చాటడం సుమన్ కే చెల్లింది. ఒకదశలో ఇతని పని అయిపోయిందనుకున్న వాళ్లకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి రేస్ లో నిలబడ్డాడు. ఆ సమయంలో వచ్చిందే 'రావుగారింట్లో రౌడీ'. 1990 సమయంలో అక్కినేని నాగేశ్వర్ రావు గారు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసేవాళ్ళు. కథ నచ్చితే తాతయ్యగా, బాబాయ్ గా, ఇంటి పెద్దగా ఇలా అన్నిరకాల పాత్రలను సవాల్ గా తీసుకునేవారు. రావుగారింట్లో రౌడీ దర్శకులు కోడి రామకృష్ణ.

ఒక వీధిలో రౌడీగా చెలామణి అయ్యే కోటిగాడి(సుమన్) జీవితంలోకి ప్రవేశిస్తారు ఆనందరావు(ఏఎన్ఆర్)ఆయన భార్య వాణి(వాణిశ్రీ). కోటిని వాడుకుంటూ నేరాలు చేస్తున్న బుజ్జులు(కోట శ్రీనివాసరావు)అతని ఇద్దరి స్నేహితుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి నడుంబిగిస్తారు ఆనందరావు జంట. కోటిలో మార్పు తీసుకురావడానికి తమ మనవరాలిని అతనికి దగ్గర చేసి పది రోజులు ఎలాంటి తప్పు చేయకూడదని గడువు విధిస్తారు. కానీ ఆనందరావుకు బుజ్జులుకు గతంలోనే శత్రుత్వం ఉంటుంది. అదేంటి, కోటి ఆ కుటుంబానికి కలిగిన కష్టాన్ని ఎలా తీర్చాడు అనే పాయింట్ తో కథ సాగుతుంది. ప్రేమ నగర్, దసరా బుల్లోడు లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ లో జంటగా నటించిన ఏఎన్ఆర్, వాణిశ్రీలు చాలా రోజుల తర్వాత కాంబో కావడం అంచనాలు పెంచింది.

సుమన్ హీరో అయినప్పటికీ ఈ రెండు పాత్రలు చాలా హుషారుగా సాగుతాయి. మాస్ ని ఆకట్టుకునే పాత్రలో సుమన్ చెలరేగిపోయాడు. రాజ్ కోటి సంగీతం, తోటపల్లి మధు సంభాషణలు చిత్ర విజయానికి దోహదపడ్డాయి. భారీ రికార్డులు సాధించనప్పటికీ రావుగారింట్లో రౌడీ కమర్షియల్ గా సేఫ్ వెంచర్ అయ్యింది. అక్కినేనికి 90వ దశకం నుంచే సెకండ్ ఇన్నింగ్స్ స్పీడ్ గా సాగింది. సీతారామయ్య గారి మనవరాలు, కాలేజీ బుల్లోడు, మాధవయ్య గారి మనవడు, రాజేశ్వరి కళ్యాణం, ప్రాణదాత లాంటి ఎన్నో మంచి పాత్రలు లేట్ ఏజ్ లోనూ దక్కించుకుని తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. తన తర్వాతి జనరేషన్ లో సుమన్ లాంటి స్టార్ హీరోలందరితోనూ నటించిన ఘనత దక్కించుకున్నారు. అందుకే రావుగారింట్లో రౌడీ ఒక ప్రత్యేక జ్ఞాపకంగా నిలిచిపోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp