ఇద్దరికి లైఫ్ ఇచ్చిన నీ కోసం - Nostalgia

By iDream Post Jul. 17, 2021, 06:30 pm IST
ఇద్దరికి లైఫ్ ఇచ్చిన నీ కోసం - Nostalgia

ఇండస్ట్రీకి వచ్చిన ప్రతిఒక్కరు తమదైన రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దాని కోసం ఎంత కష్టపడాలనేదానికి ఎలాంటి కొలమానాలు ఉండవు. బ్రేక్ వచ్చే దాకా నెత్తురునే చెమటలా చిందించాలి.విజయ లక్ష్మి ఏదో నాడు గుర్తించి బంగారు భవిష్యత్తుకి దారులు వేస్తుంది. ఓ ఉదాహరణ చూద్దాం. 1990లో చిన్న ఆర్టిస్ట్ గా ప్రస్థానం మొదలుపెట్టిన రవితేజకు ఎనిమిదేళ్లకు కాస్త చెప్పుకోదగ్గ అవకాశాలు రాసాగాయి. ఇంచుమించు అదే సమయంలో ఇండస్ట్రీకి వచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల. బాలకృష్ణ 'ప్రాణానికి ప్రాణం' సినిమాకు తాతినేని రామారావు దగ్గర అసిస్టెంట్ గా కెరీర్ మొదలుపెట్టినప్పుడు డెబ్యూనే డిజాస్టర్ కొట్టింది. అపశకునం అనుకోలేదు.

అప్పుడే పరిచయమైన సాగర్ ని ఒప్పించి ఆయన దగ్గర చేరి 1994 'అమ్మదొంగా' సినిమా దాకా పనిచేసి ఆ తర్వాత స్వంత కథలు చేసుకోవడం మొదలుపెట్టారు శ్రీను వైట్ల. రాజశేఖర్ హీరోగా సాక్షి శివానంద్ హీరోయిన్ గా 'అపరిచితుడు' టైటిల్ తో ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. మొదటి షెడ్యూల్ అయ్యిందో లేదో ఇది కాస్తా ఆగిపోయింది. ఆ తర్వాత బాల్ రెడ్డి అనే నిర్మాత పరిచయమయ్యాక ఓ బృందంతో కలిసి 1998లో 'నీ కోసం'కు శ్రీకారం చుట్టారు శ్రీను వైట్ల. రవితేజకు సోలో హీరోగా ఇదే మొదటి సినిమా. 'గులాబీ'తో పేరు తెచ్చుకున్న మహేశ్వరిని హీరోయిన్ గా తీసుకుని ఆర్పి పట్నాయక్ అనే కొత్త కుర్రాడికి సంగీత బాధ్యతలు అప్పజెప్పారు

ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారం కేవలం 28 రోజుల్లో 40 లక్షల్లోపు పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇది ఆ టైంలో చాలా తక్కువ మొత్తం. అయినా కూడా వివిధ ఆర్థిక కారణాల వల్ల ఏడాదిన్నర పట్టింది. ఇన్ని పరీక్షలు దాటుకుని నీ కోసం ఫైనల్ గా 1999 డిసెంబర్ 3న విడుదలయ్యింది. కోటి రూపాయల దాకా కలెక్షన్ వచ్చింది. శ్రీను వైట్ల, రవితేజల రియల్ టాలెంట్ బయటికి వచ్చింది. ఇందులో టేకింగ్ నచ్చే ఆంధ్రకు నీ కోసం హక్కులు కొన్న రామోజీరావు గారు ఆ తర్వాత 'ఆనందం' రూపంలో బంగారం లాంటి అవకాశం ఇచ్చారు. అది బ్లాక్ బస్టర్ కావడంతో శ్రీనువైట్లను వెనుదిరిగి చూసే అవసరం లేకపోయింది. రవితేజ ఏళ్ళ తరబడి నిరీక్షణకూ శుభం కార్డు పడి తన స్థాయి పెరగడం మొదలయ్యింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp