తెలివున్న యువకుడి ప్రేమ పాఠాలు - Nostalgia

By iDream Post Jan. 16, 2021, 09:00 pm IST
తెలివున్న యువకుడి ప్రేమ పాఠాలు  - Nostalgia

సినిమాల్లో ప్రేమంటే కబుర్లు చెప్పుకోవడం, చెట్టు పుట్ట వెంట తిరుగుతూ పాటలు పాడుకోవడం, అమ్మానాన్నా వద్దంటే వాళ్ళను ఎదిరించైనా సరే మూడు ముళ్ళు వేసుకుని ఇదే విజయమని చాటుకోవడం. చాలా మటుకు ఇదే తరహా ఫార్ములాలో ఎన్నో సూపర్ హిట్లు, అట్టర్ ఫ్లాపులు తెలుగు ప్రేక్షకులు చూశారు. కానీ ప్రేమలో బాధ్యత కూడా ఉంటుందని, యువతకు అదేంటో తెలియజేస్తే అద్భుతాలు చేస్తారని, గొప్ప ఎత్తులకు చేరుకుంటారని నేర్పించే చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. వాటిలో ఇప్పటి తరానికి బాగా కనెక్ట్ అయ్యేలా వినోదంతో పాటు సందేశాన్ని కూడా సమపాళ్ళలో జొప్పించి ఘన విజయం అందుకున్న సినిమా ప్రేమకు వేళాయెరా.

1999 సంవత్సరం. దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డికి అప్పటికి గత మూడేళ్లు సరైన సక్సెస్ లేదు. హీరోగా మారి చేసిన ఉగాదితో పాటు దీర్ఘసుమంగళిభవ, పెళ్లి పీటలు, మనసులో మాట, ఊయల ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాలు అందుకోలేదు. మ్యూజికల్ గా మాత్రమే పేరు తెచ్చుకున్నాయి. అందుకే ఈసారి బయటి కథ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుప్రసిద్ధ రచయిత సూర్యదేవర రామ్మోహనరావు రాసిన నవల ఆధారంగా రచయిత దివాకర్ బాబుతో కలిసి ప్రేమకు వేళాయేరా స్క్రిప్ట్ ని సిద్ధం చేయించారు. స్వతహాగా తనకు గొప్ప తెలివితేటలు ఉన్నా కూడా కేవలం డబ్బున్న అమ్మాయిని చేసుకుంటే చాలు లైఫ్ లో సెటిలవ్వొచ్చు అనే అబ్బాయికి, కోట్ల ఆస్తి ఉన్నా కష్టపడి పైకి రావాలనుకునే అమ్మాయికి మధ్య ప్రేమకథగా ఆద్యంతం వినోదాత్మకంగా దీన్ని రూపొందించారు.

మనోహర్ గా హీరో పాత్రకు జెడి చక్రవర్తి, హీరొయిన్ గా మంచి ఫాంలో ఉన్న సౌందర్యను తీసుకున్నారు. జెడి స్నేహితుడి పాత్రలో రవితేజ మంచి టైమింగ్ ఉన్న క్యారెక్టర్ దక్కించుకోగా ప్రకాష్ రాజ్ బిజినెస్ మెన్ గా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ పోషించారు, శ్రీహరి, బ్రహ్మానందం, గౌతం రాజు, సూర్య, ఎంఎస్ నారాయణ, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 6న విడుదలైన ప్రేమకు వేళాయేరాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క డబుల్ మీనింగ్ లేకుండా, అశ్లీలతకు తావివ్వకుండా ఒకపక్క నవ్విస్తూనే మరోపక్క ఆలోచింపజేసేలా ఎస్వి చిత్రీకరించిన తీరుకు అమోఘమైన విజయం దక్కింది. పాటలూ మారుమ్రోగిపోయాయి. కృష్ణారెడ్డి మళ్ళీ ఫాంలోకి వచ్చేశారు. ఫ్యామిలీ మొత్తం హాయిగా చూసే బెస్ట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా నిలిచిపోయింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp