చల్లా-జంధ్యాల వదిలిన చైతన్యపు బ్రహ్మాస్త్రం - Nostalgia

By iDream Post Jan. 07, 2021, 12:12 pm IST
చల్లా-జంధ్యాల వదిలిన చైతన్యపు బ్రహ్మాస్త్రం  - Nostalgia

ఇటీవలే కాలం చేసిన చల్లా రామకృష్ణారెడ్డి అపారమైన అనుభవం, జనాదరణ ఉన్న రాజకీయ నేతగానే అందరికీ తెలుసు కానీ చాలా ఏళ్ళ క్రితమే హీరోగా ఓ సినిమా చేశారనే సంగతి తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఇది నిజం. ఆ విశేషాలేంటో చూద్దాం. అది 1987వ సంవత్సరం. హాస్యభరిత చిత్రాలతో ఆబాలగోపాలాన్ని అలరించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జంధ్యాల గారు అప్పటికే చంటబ్బాయి, పడమటి సంధ్యారాగం, రెండు రెళ్ళు ఆరు, బాబాయ్ అబ్బాయ్, ఆనందభైరవి లాంటి ఎన్నో చక్కని చిత్రాలు అందించారు. 1985లోనే ఓ సందేశాత్మక చిత్రాన్ని తీయాలనే ఆలోచనతో సత్యాగ్రహం స్క్రిప్ట్ కి రూపకల్పన చేశారు. ఓ గ్రామరాజకీయం చుట్టూ రావణాసురుడి స్ఫూర్తితో కథ సిద్ధమయ్యింది. 

సమాజానికి ఉపయోగపడే సినిమాలో నటించాలనే లక్ష్యంతో ఉన్న చల్లా రామకృష్ణారెడ్డికి ఈ రూపంలో మంచి అవకాశం దక్కింది. సమీప బంధువు విజయ అమర్ నాథ్ రెడ్డి నిర్మాతగా దాదాపు రెండేళ్ళు నిర్మాణం కొనసాగింది. గ్రామాన్ని తన గుప్పిట్లో ఉంచుకుని అరాచకాలు చేస్తూ అందరి మీద పెత్తనం చెలాయించే ఊరి పెద్ద రావణరాజు(గుంటూరు శాస్త్రి)ని మార్చేందుకు అహింసా పద్ధతిలో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాడు సత్యం(చల్లా రామకృష్ణారెడ్డి). రాజు వల్ల ఏడేళ్లు జైలుకు వెళ్లి వచ్చినా పగను పెంచుకోడు. ఈ క్రమంలో తను ఎన్నో కోల్పోతాడు. ఆఖరికి మనసిచ్చిన కాయగూరలు అమ్ముకునే గంగ(సరిత)తన చేతుల్లోనే కన్ను మూస్తుంది. దీంతో సహనం కోల్పోయిన సత్యం నిస్సహాయత చూసి స్కూల్ పిల్లలంతా కలిసి రాక్షస సంహారం చేస్తారు. ఈ సినిమాకు సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి.

బ్రహ్మానందం మొదటి సినిమా ఇది, కానీ రాగలీల, అహ నా పెళ్ళంట ముందు విడుదలయ్యాయి. గుండు హనుమంతరావు డెబ్యూ చిత్రం కూడా ఇదే. విలన్ తో సహా ఈ మూడు పాత్రలు సినిమా మొత్తం నున్నని గుండుతో ఉంటాయి. రాజేంద్రప్రసాద్, సుత్తివేలు అతిధి పాత్రల్లో కనిపిస్తారు. ఇందులో శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానంలోని రెండు శైశవ గీతాలను వాడుకున్నారు. సినిమా రిలీజయ్యే సమయానికి ఆయన కన్నుమూశారు. మరో రెండు వేటూరి రాయగా చందమామ అనే సూపర్ హిట్ సాంగ్ మాత్రం జానపద సాహిత్యం నుంచి సేకరించారు. రమేష్ నాయుడు అందించిన సంగీతం సత్యాగ్రహం స్థాయిని పెంచింది. బాలు, జానకి పాటలు పాడారు. చల్లా రామకృష్ణారెడ్డి గారికి ఎస్పి బాలసుబ్రమణ్యం డబ్బింగ్ చెప్పడం విశేషం.

షూటింగ్ అధికశాతం అమీనాబాద్ గ్రామంలో జరిపారు. రాజు గారి బంగాళా భాగం చేబ్రోలు కృష్ణమూర్తి భవంతిలో పూర్తి చేశారు. జంధ్యాల గారు అక్కడక్కడా సున్నితమైన హాస్యంతో సత్యాగ్రహంని తెరకెక్కించిన తీరు చాలా సన్నివేశాల్లో ఆలోచింపజేస్తుంది. దొర దుర్మార్గాలను చూపించిన వైనం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. చల్లా రామకృష్ణారెడ్డి అభ్యుదయం నిండిన పాత్రలో సహజంగా నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలితను విధవగా చూపించి జంధ్యాల చేసిన ప్రయోగం విభిన్నం. రామ్ చరణ్ రంగస్థలంకి ఇందులో కొన్ని సారూప్యతలు చూడొచ్చు. కానీ 1987 డిసెంబర్ 17న విడుదలైన సత్యాగ్రహం జంధ్యాల బ్రాండ్ ఇమేజ్ కు భిన్నంగా ఈ సీరియస్ డ్రామా నడవడంతో ప్రేక్షకుల అంచనాలకు సరితూగలేకపోయింది. అయినప్పటికీ ఉదాత్త చిత్రంగా మిగిలిపోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp