ఆవేశం ఆదర్శం కలిసిన పెద్దన్నయ్య - Nostalgia

By iDream Post Jun. 01, 2021, 08:30 pm IST
ఆవేశం ఆదర్శం కలిసిన పెద్దన్నయ్య - Nostalgia
ఫ్యామిలీ కథలు అందులోనూ గ్రామీణ నేపథ్యంలో కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా తీస్తే ఎంత పెద్ద స్టార్ తో అయినా సక్సెస్ కొట్టొచ్చని గతంలో చాలా సినిమాలు ఋజువు చేశాయి. అయితే మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ లాంటి హీరోతో చేస్తున్నప్పుడు మాత్రం ఏ కొలత మిస్ కాకుండా చూసుకోవాలి. అది బ్యాలన్స్ చేయగలిగితే చాలు బ్లాక్ బస్టర్ పడ్డట్టే. దానికో మంచి ఉదాహరణ 1997లో వచ్చిన 'పెద్దన్నయ్య'. 1994లో 'బొబ్బిలి సింహం' ఘనవిజయం తర్వాత బాలయ్యకు ఆశించిన ఫలితాలు రాలేదు. టాప్ హీరో, మాతో పెట్టుకోకు, శ్రీ కృష్ణార్జున విజయం, ముద్దుల మొగుడు డిజాస్టర్లయ్యాయి. 'వంశానికొక్కడు' మాత్రమే హిట్ అనిపించుకుంది.

అప్పటికే నందమూరి స్వంత బ్యానర్ రామకృష్ణ హార్టీ కల్చరల్ స్టూడియోస్ నుంచి సినిమా నిర్మాణాలు తగ్గిపోయాయి. ఓ సందర్భంలో పరుచూరి బ్రదర్స్ బాలయ్యకు 'పెద్దన్నయ్య' లైన్ వినిపించారు. డ్యూయల్ రోల్ లో తండ్రి కొడుకులుగా కాకుండా అన్నదమ్ములుగా ఒక ఫ్రెష్ ట్రీట్ మెంట్ తో వాళ్ళు చెప్పిన లైన్ ఆయనకు బాగా నచ్చింది. అన్నయ్య రామకృష్ణను సంప్రదించి బయట వాళ్ళతో కాకుండా మనమే తీద్దామని నిర్ణయించుకుని ప్రకటించేశారు. వంశానికొక్కడులో శరత్ పనితనం నచ్చిన బాలయ్య ఆయనకే పెద్దన్నయ్య దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. రోజా, ఇంద్రజ హీరోయిన్లుగా అచ్యుత్, రాజ్ కుమార్, కోట, చరణ్ రాజ్, శ్రీహరి, బ్రహ్మానందం, చలపతిరావు తదితరులు కీలక తారాగణంగా ఎంపికయ్యారు.

మిత్రుడు రాజ్ తో విడిపోయాక మంచి ఫామ్ లో ఉన్న కోటి ఆరు అద్భుతమైన పాటలు ఇచ్చారు. కుటుంబం కోసం ఓ బలమైన కారణం వల్ల పెళ్లికి సైతం దూరంగా ఉన్న ఓ పెద్దన్నయ్య శత్రువుల వల్ల తనవాళ్లకు ఎదురైన సమస్యలను ఎలా ఛేదించాడనే పాయింట్ మీద శరత్ అద్భుతమైన డ్రామా పండించారు. 1997 జనవరి. 4వ తేదీన విడుదలైన చిరంజీవి 'హిట్లర్' సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దానికి ధీటుగా 10న రిలీజైన 'పెద్దన్నయ్య' బాలయ్యకు మరో సూపర్ హిట్ ఇచ్చింది. అదే నెలలో వచ్చిన చిన్నబ్బాయి, మెరుపు కలలు, ఇద్దరు, తాళి, చిలకొట్టుడు ఫ్లాప్ కాగా అడవిలో అన్న, ఎగిరే పావురమా మంచి ఫలితాలు అందుకున్నాయి. పెద్దన్నయ్య ముఖ్యంగా బిసి సెంటర్స్ లో రికార్డులు నమోదు చేసింది. మ్యూజికల్ గానూ ఆడియో సేల్స్ బాగా జరిగాయి.  
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp