ప్లాస్టిక్ సర్జరీ మీద వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ - Nostalgia

By iDream Post Oct. 13, 2021, 08:45 pm IST
ప్లాస్టిక్ సర్జరీ మీద వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ - Nostalgia

ప్రతి సినిమాలోనూ వైవిధ్యం ఆశించలేం కానీ దాన్ని సరైన రీతిలో చూపించగలిగితే మాత్రం ఖచ్చితంగా దశాబ్దాలు దాటినా వాటి ప్రత్యేకత అలాగే ఉంటుంది. ఓ ఉదాహరణ చూద్దాం. 1989 సంవత్సరం ఇంగ్లీష్ లో వచ్చిన 'ట్విస్ట్ అఫ్ ఫేట్' అనే టీవీ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది. దాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సురేష్ మీనన్ 'పుదియ ముగం' కథను సిద్ధం చేసుకున్నారు. తనే మెయిన్ లీడ్ లో, నిజ జీవిత భాగస్వామి రేవతి హీరోయిన్ గా, వినీత్ మరో హీరోగా స్వంత నిర్మాణంలో సినిమా తీశారు. నాజర్, రాధారవి, కస్తూరి తదితరులు ఇతర తారాగణం. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ చేసిన మూడో చిత్రమిది. రోజా, యోధ తర్వాత ఇదే.

కథ ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీలంక నేపథ్యంలో మొదలవుతుంది. తన ప్రేయసి(కస్తూరి)తో జీవితాన్ని ఆస్వాదిస్తున్న రాజా(వినీత్) ఓ హత్యను కళ్లారా చూడటం వల్ల ప్రియురాలిని పోగొట్టుకుంటాడు. ప్రతీకారంగా ఈ స్థితికి కారణమైన వాళ్ళను హత్య చేసి తీవ్రవాదిగా ముద్రపడి ఇండియాకు పారిపోతాడు. ప్లాస్టిక్ సర్జరీ సహాయంతో మొహం మార్చుకుని కొత్త అవతారం(సురేష్ మీనన్)లోకి వస్తాడు. చెన్నైలో అంజలి(రేవతి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళకు కలిగిన సంతానం హరి(వినీత్) పెద్దయ్యాక అచ్చం తన తండ్రి అసలు రూపంలో ఉండటంతో ఊహించని సంఘటనలు జరుగుతాయి. రాజా కన్నుమూయడం వరకు జరిగే పరిణామాలే సినిమా

అప్పటిదాకా ఎక్కువగా కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో సురేష్ మీనన్ చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెహమాన్ స్వరపరిచిన నిన్న ఈ కలవరింత లేదులే, కన్నులకు చూపందం పాటలు మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా వెంటాడాయి,. తెలుగులో పద్మవ్యూహం పేరుతో డబ్బింగ్ చేసి 1993 సెప్టెంబర్ 10న మాయదారి మోసగాడు, ముద్దుల బావతో పాటుగా విడుదల చేశారు. సరిగ్గా వారం ముందు రిలీజైన బాలయ్య రెండు సినిమాలు నిప్పురవ్వ, బంగారు బుల్లోడు ఎఫెక్ట్ వల్ల పద్మవ్యూహం తమిళ వెర్షన్ స్థాయిలో విజయం సాధించలేదు కానీ చూసిన ఆడియన్స్ కి మాత్రం థ్రిల్ ఇచ్చింది

Also Read : జెమిని నేర్పించిన రీమేక్ పాఠం - Nostalgia

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp