పల్లె పెద్దల దుర్మార్గాలకు తెరరూపం - Nostalgia

డబ్బు, అధికారం, కులం. ఇవి మన వ్యవస్థను కీలుబొమ్మను చేసి ఆడించే మూడు చక్రాలు. లేనివాడు అణిగిమణిగి శ్రమ దోపికి గురవుతున్నా, ఉన్నవాడు మదంతో పొగరెక్కి కిందివాళ్లను చెప్పుచేతల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నా దానికి కారణం ఇవే. అందులోనూ పల్లెటూళ్ళలో ఈ దాష్టీకం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తగ్గినట్టు కనిపిస్తున్నా ఒకప్పటి గ్రామాల్లో అరాచకం రాజ్యమేలేది. రంగస్థలంలో దర్శకుడు సుకుమార్ తీసుకున్నది ఇలాంటి నేపధ్యమే. పెత్తందారీతనం వల్ల బడుగు జీవులు ఎంతగా నలిగిపోతున్నారో ఎన్ని జీవితాలు ఛిద్రం అవుతున్నాయో అందులో చూపించారు. కమర్షియల్ సినిమా కాబట్టి అదనపు హంగుల వల్ల ఉద్దేశం మారింది.
కానీ సహజత్వానికి పెద్దపీఠ వేస్తూ కళ్ళకు కట్టినట్టు గ్రామీణ భారతాన్ని చూపించిన చిత్రాలు దశాబ్దాల క్రితం ఎన్నో వచ్చాయి. అందులో ప్రత్యేకంగా ఎంచదగిన ఆణిముత్యం ఊరుమ్మడి బ్రతుకులు. 1976లో సత్యేంద్రకుమార్, మాధవి ప్రధాన పాత్రల్లో ఈ సినిమాని బిఎస్ నారాయణ గారి దర్శకత్వంలో జికె మూర్తి, జెవి ఆర్య నిర్మించారు. కథ మాటలు సిఎస్ రావు అందించగా లక్ష్మణ్ గోరె ఛాయాగ్రహణం సమకూర్చారు. ఎంబి శ్రీనివాసన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. తక్కువ బడ్జెట్ లో ఒకే లొకేషన్ లో రెండు గంటల నిడివి లోపే నిర్మించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా నందితో పాటు జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది.
కమ్మరి వృత్తి చేసుకుంటూ కొత్తగా పెళ్ళైన ఓ అమాయకుడి భార్య మీద మేకవన్నె పులులైన ఇద్దరు గ్రామపెద్దల కళ్ళు పడతాయి. అదును చూసి అతన్ని పట్నం పంపించి ఆ నిస్సహాయురాలిగాపై అత్యాచారం చేయబోతారు. అనుకోకుండా వెనక్కు వచ్చిన అతను ఈ దారుణాన్ని కళ్లారా చూసి వాళ్ళను నరికి పారేస్తాడు. భార్యను వదిలి జైలుకు వెళ్తాడు. మోతుబరిగా నూతన్ ప్రసాద్, ఐదు పది పైసల కోసం వార్తలు మోసే తాగుబోతు పాత్రలో రాళ్ళపల్లి అద్భుతంగా నటించారు. సినిమా మొత్తం ఒకే టోన్ లో అత్యంత సహజంగా సాగుతుంది. భారీ వసూళ్లు రాకపోయినా చరిత్ర గుర్తుపెట్టుకునే గొప్ప ప్రశంసలు అందుకుంది ఊరుమ్మడి బ్రతుకులు.


Click Here and join us to get our latest updates through WhatsApp