లవ్ డ్రామాతో ఇండస్ట్రీ హిట్ - Nostalgia

By iDream Post Apr. 06, 2021, 08:30 pm IST
లవ్ డ్రామాతో ఇండస్ట్రీ హిట్ - Nostalgia

ఎంత స్టార్ హీరో అయినా మాస్ ఎలిమెంట్స్ తగ్గించి ప్రేమకథను చేసినప్పుడు కలెక్షన్ల విషయంలో ఒకరకమైన టెన్షన్ ఉంటుంది. అభిమానుల సంగతి ఎలా ఉన్నా కామన్ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అనే ఆందోళన ఎంతో కొంత ఉంటుంది. కానీ రిస్క్ చేసినప్పుడే కదా ఫలితం దక్కేది లేనిది తెలిసేది. ఓ ఉదాహరణ చూద్దాం. 1997లో 'అన్నమయ్య' లాంటి అల్టిమేట్ సక్సెస్ సాధించాక నాగార్జునకు ఆ ఆనందం ఆవిరయ్యేలా వరస పరాజయాలు పలకరించాయి. రక్షకుడు, ఆవిడా మా ఆవిడే, ఆటో డ్రైవర్, చంద్రలేఖ, రావోయి చందమామ దారుణంగా దెబ్బ తిన్నాయి. సీతారామరాజు ఒకటే జస్ట్ పర్వాలేదు అనిపించేలా వసూళ్లు తెచ్చింది.

ఏడుకొండల వాడి అపరభక్తుడిగా కనిపించాక ప్రేక్షకులు తనను మాస్ రోల్స్ లో వెంటనే చూసేందుకు అంతగా ఇష్టపడటం లేదని నాగ్ కు అర్థమైపోయింది. సరిగ్గా అదే సమయంలో నిర్మాత ఆర్బి చౌదరి దగ్గరి నుంచి అక్కినేని హీరోకి ఓ ప్రతిపాదన వచ్చింది. అంతకు ముందు ఏడాది 1999లో విజయ్-సిమ్రాన్ జంటగా ఏజిల్ దర్శకత్వంలో రూపొందిన 'తుల్లాద మనముం తుల్లుమ్' గొప్ప విజయాన్ని సాధించి చాలా కేంద్రాల్లో రెండు వందల రోజులు దాటింది. దాన్ని నాగ్ హీరోగా రీమేక్ చేయాలనేది చౌదరి ఆలోచన. ఒరిజినల్ వెర్షన్ చూసిన నాగార్జునకు సినిమా విపరీతంగా నచ్చింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దర్శకుడిగా విఆర్ ప్రతాప్ ని ఎంచుకున్నారు. పెద్దగా మార్పులు లేకుండా యధాతథంగా తీసేందుకు నిర్ణయించుకున్నారు.అరవంలో పాటలకు దక్కిన ఆదరణ చూశాక ఇక్కడా ఎస్ఏ రాజ్ కుమార్ నే కొనసాగించారు. సిమ్రాన్ మళ్ళీ ఆ పాత్ర చేసేందుకు అంగీకారం తెలిపింది. కోట, భరణి, బ్రహ్మానందం, ఆలీ, సుధాకర్, మల్లికార్జున రావు తదితరులు ఇతర తారాగణం. ఇందులో ప్రత్యేకించి సవాళ్లు చేసే భీకరమైన విలన్ అంటూ ఎవరూ ఉండరు. పరిస్థితుల ప్రభావం వల్ల అమ్మాయి అబ్బాయి దూరమైపోయి అపార్థాలు ఓ యువకుడి జీవితాన్ని ఎంతగా ఆడుకున్నాయో తెరమీద చూపించిన తీరు జనానికి అద్భుతంగా నచ్చేసింది. ఫలితంగా 2000 సంవత్సరం ఏప్రిల్ 5న రిలీజైన నువ్వు వస్తావని నాగ్ కోరుకున్న సక్సెస్ ని సిల్వర్ జూబ్లీ సాక్షిగా బంగారు పళ్లెంలో ఇచ్చింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp