ప్రేక్షకులతో 'నెంబర్ వన్' అనిపించారు - Nostalgia

By iDream Post Apr. 03, 2021, 06:47 pm IST
ప్రేక్షకులతో 'నెంబర్ వన్' అనిపించారు - Nostalgia

కొత్త రక్తం వస్తున్నప్పుడు పాత నీరు పక్కకు తప్పుకోవడం లేదా నెమ్మదించడం సహజం. అది రాజకీయమైనా సినిమా అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. కానీ కొందరు మాత్రం దీనికి అతీతంగా నిలుస్తూ సరైన సమయం వచ్చినప్పుడు తమ ఉనికి ఎంత బలమైందో చాటుతారు. అలాంటి వారే సూపర్ స్టార్ కృష్ణ. 1985 తర్వాత చిరంజీవి, బాలకృష్ణ లాంటి యంగ్ జెనరేషన్ వచ్చాక కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి పెద్ద హీరోల మార్కెట్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. వాళ్ళ స్పీడ్ తో పోటీ పడలేక లేదా వాళ్లకు ధీటుగా బదులు చెప్పే కథలను దర్శకులు తీయలేకపోవడం వల్లనో ఏదైతేనేం కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం.

1993 సంవత్సరం. కృష్ణ గారి గ్రాఫ్ ఏమంత బాగోలేదు. రౌడీ అన్నయ్య, పచ్చని సంసారం తప్ప రక్తతర్పణం, నా ఇల్లే నా స్వర్గం, అల్లుడు దిగ్గిన కాపురం, ఇంద్రభవనం, పరమశివుడు, విష్ణు, అన్నతమ్ముడు, ప్రజల మనిషి, ఇన్స్ పెక్టర్ రుద్ర ఇలా అన్నీ ఫ్లాపులే. ఆ టైంలో దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డిది భీభత్సమైన ఫామ్. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు లాంటి సూపర్ సక్సెస్ ల తర్వాత ఈయన కృష్ణతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ షాక్ తిన్నారు. అనవసరమైన రిస్క్ అని వారించిన వారు లేకపోలేదు. కానీ ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో కృష్ణ గారి అభిమానులకు చూపించాలని డిసైడ్ అయ్యారు కృష్ణారెడ్డి.

అన్నా చెల్లెలి సెంటిమెంట్ కి చిన్న విలన్ థ్రెడ్ పెట్టి ఎమోషన్స్ ని హై లైట్ చేస్తూ సంభాషణల రచయిత దివాకర్ బాబుతో కలిసి మంచి స్క్రిప్ట్ తయారు చేశారు. హీరోయిన్ గా సౌందర్యను అడగ్గా వెంటనే ఒప్పేసుకున్నారు. కృష్ణారెడ్డి అద్భుతమైన పాటలు కంపోజ్ చేసుకున్నారు. ఆడియో క్యాసెట్స్ అమ్మకాల్లో ఈ విషయం స్పష్టమయ్యింది. 1994 సంక్రాంతి జనవరి 14న నెంబర్ వన్ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. బయ్యర్లు ఆందోళన చెందారు. అదే నెలలో చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు, రాజశేఖర్ అంగరక్షకుడు, నాగార్జున గోవిందా గోవిందా, మణిరత్నం దొంగ దొంగ ఉన్నాయి. అయినా నెంబర్ వన్ వెనక్కు తగ్గలేదు. వాటికి పక్కకు తోసేసి మరీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. కృష్ణకు పర్ఫెక్ట్ కం బ్యాక్ గా అభిమానులు పండగ చేసుకునే విజయం దక్కించుకుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp